కోర్టుకెక్కిన టెండర్ల వివాదం

ABN , First Publish Date - 2021-02-23T05:22:42+05:30 IST

ఏడుపాయల వన దుర్గామాత ఆలయానికి అధిక ఆదాయం సమకూర్చే టెండర్ల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. మాఘ అమావాస్య, జాతర అమ్మకాల టెండర్ల వివాదం చిలికిచిలికి కోర్టు మెట్లెక్కింది. ఓడిబియ్యం, కొబ్బరికాయలు, తలనీలాల టెండర్లు నిర్వహించకపోవడంపై కొందరు వ్యాపారులు హైకోర్టులో వ్యాజ్యం వేయగా.. ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ప్రతి వ్యాజ్యాన్ని దాఖలు చేయడంతో చర్చనీయాంశమైంది.

కోర్టుకెక్కిన టెండర్ల వివాదం
ఏడుపాయల వనదుర్గామాత ఆలయం (ఫైల్‌)

ఏడుపాయల జాతర దగ్గర పడుతున్నా ఖరారు కాని వైనం

కొబ్బరికాయలు, ఒడిబియ్యంకు టెండర్‌ నిర్వహించాలని హైకోర్టులో వ్యాజ్యం


పాపన్నపేట, ఫిబ్రవరి 22 : ఏడుపాయల వన దుర్గామాత ఆలయానికి అధిక ఆదాయం సమకూర్చే టెండర్ల నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. మాఘ అమావాస్య, జాతర అమ్మకాల టెండర్ల వివాదం చిలికిచిలికి కోర్టు మెట్లెక్కింది. ఓడిబియ్యం, కొబ్బరికాయలు, తలనీలాల టెండర్లు నిర్వహించకపోవడంపై కొందరు వ్యాపారులు హైకోర్టులో వ్యాజ్యం వేయగా.. ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ ప్రతి వ్యాజ్యాన్ని దాఖలు చేయడంతో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ప్రతి సంవత్సరం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర ఉత్సవాలకు, తదనంతర రోజులకు వేర్వేరుగా రెండు టెండర్లను నిర్వహిస్తారు. అయితే డిసెంబరు 2019లో టెండర్లను నిర్వహించగా మాఘ అమావాస్య మొదులుకొని జాతర వరకు 55 రోజుల కాల పరిమితికి మొదటి టెండర్‌లో ఒడిబియ్యాన్ని పోగు చేసుకునే హక్కును రూ.12.60 లక్షలకు, కొబ్బరికాయలు అమ్ముకునే హక్కును రూ.28.01 లక్షలకు, తలనీలాలు రూ.5.25 లక్షలకు టెండర్‌దారులు కైవసం చేసుకున్నారు. అలాగే జాతర అనంతరం పది నెలల పాటు ఓడిబియ్యం పోగు చేసుకునే హక్కును రూ.32 లక్షలకు, కొబ్బరికాయలు అమ్ముకునే హక్కును రూ.65 లక్షలకు దక్కించుకున్నారు. మొదటి టెండర్‌కు సంబంధించి రెండు రోజులైతే 55 రోజుల కాల పూర్తవుతుందనగా 2020 మార్చిలో కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించారు. అయినప్పటికీ మొదటి టెండర్‌దారులు దాదాపు కాలపరిమితిని పూర్తి చేసుకున్నారు. అయితే రెండో టెండర్‌దారులే ఈ లాక్‌డౌన్‌ మూలంగా అమ్మకాలు, కొనుగోళ్లు చేసుకోలేకపోయారు. 2020 సెప్టెంబరులో తిరిగి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఈవో శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు రెండో టెంటర్‌ను దక్కించుకున్న వ్యాపారులు కొబ్బరికాయలు, ఓడిబియ్యం అమ్మకం, కొనుగోలు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది మాఘ అమవాస్య, జాతరకు సంబంధించిన టెండర్‌ను నిర్వహించ లేదు. లాక్‌డౌన్‌లో నష్టపోయిన వారికే టెండరు కాలపరిమితి పొడిగించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఈ సారి టెండర్లు నిర్వహించలేదని ఆలయ ఈవో తెలిపారు. ఈ విషయమై కొంత మంది వ్యాపారులు గతంలో టెండర్లు పాడిన వ్యక్తులు వారు నష్టపోయిన కాల పరిమితిని జాతర అనంతరం సమకూర్చలే కానీ.. జాతరకు సంబంధించి మాత్రం టెండర్లు తప్పనిసరిగా నిర్వహించాలని ఫిబ్రవరి 9న హైకోర్టులో వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈవో శ్రీనివాస్‌ ఎండోమెంటు స్టాడింగ్‌ కౌన్సిల్‌ను ఆశ్రయించి, మరో వాజ్యాన్ని దాఖలు చేయాల్సి వచ్చింది. ఓ వైపు మహాశివరాత్రి జాతర దగ్గర పడుతుండగా ఈ వివాదం ఎప్పుడు తేలుతుందోనని భక్తులు చర్చించుకుంటున్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నా : ఈవో

టెండర్ల విషయమై రాష్ట్ర దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నానని ఆలయ ఈవో శ్రీనివా్‌స తెలిపారు. ఎండోమెంటు స్టాడింగ్‌ కౌన్సిల్‌ సూచనల మేరకు కోర్టులో ప్రతి వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు చెప్పారు. టెండర్లు నిర్వహించాలని ఏ వ్యాపారి అయితే కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడో ఆ వ్యక్తి తన తండ్రి పేరుపై గత సంవత్సరానికి సంబంధించి జాతర టెండరును దక్కించుకున్నాడు. వారు అప్పటి టెండరు బకాయి రూ.9 లక్షల వరకు ఇంకా ఆలయానికి చెల్లించలేదని తెలిపారు. ఆ వ్యాపారిపై కూడా తాము కేసు వేసినట్లు చెప్పారు. కమిషనర్‌, కోర్టు ఉత్తర్వుల ప్రకారం తాను నడుచుకుంటానని పేర్కొన్నారు.


Updated Date - 2021-02-23T05:22:42+05:30 IST