మళ్లీ తెరపైకి ఈటల భూ వివాదం

ABN , First Publish Date - 2022-06-25T09:01:06+05:30 IST

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేట

మళ్లీ తెరపైకి ఈటల భూ వివాదం

జమునా హేచరీస్‌ ఆక్రమిత భూములను అప్పగించాలి

మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆందోళన


మెదక్‌ అర్బన్‌/మాసాయిపేట/నర్సాపూర్‌ జూన్‌ 24: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేట మండలంలో ఈటలకు చెందిన జమునా హేచరీస్‌ ఆక్రమించిన అసైన్డ్‌ భూములను బాధితులకు తిరిగి ఇస్తామని గత ఏడాది నవంబరులో సర్వే నిర్వహించారని, ఆ భూములను వెంటనే అర్హులకు పంచాలని దళిత, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బాధిత రైతులు శుక్రవారం మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. మాసాయిపేట మండలంలోని హేచరీస్‌ భూములున్న హక్కింపేట, అచ్చంపేట, ధర్విపల్లి గ్రామానికి చెందిన రైతులు, దళితులు, రజకులు అచ్చంపేట గ్రామ సర్పంచ్‌ రాంచందర్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జమునా హేచరీస్‌ ఆక్రమించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని ఫ్లెక్సీలు ప్రదర్శించి నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అచ్చంపేట పరిధిలోని సర్వే నంబర్‌ 77 నుంచి 82 వరకు అలాగే హక్కింపేటలోని సర్వే నంబర్‌ 130లో గల సుమారు 70.33 సీలింగ్‌ భూములను వెంటనే తమకు పంచాలని డిమాండ్‌ చేశారు.  వారం, పది రోజుల్లో భూములు అందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతులు అదనపు కలెక్టర్‌ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. భూముల సర్వే పూర్తయిందని, చట్ట ప్రకారం న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్‌ రైతులకు హామీ ఇచ్చారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతులు ఎమ్మెల్యే మదన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ వారం రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ భూముల విషయాన్ని ఆయన దృష్ట్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-06-25T09:01:06+05:30 IST