ప్రభుత్వ భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకా?

ABN , First Publish Date - 2022-05-12T18:13:00+05:30 IST

రాష్ట్రంలో ల్యాండ్‌ ఫూలింగ్‌ పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర

ప్రభుత్వ భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకా?

సీఎం కేసీఆర్‌పై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం

జనగామ:  రాష్ట్రంలో ల్యాండ్‌ ఫూలింగ్‌ పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. పేదలకు దక్కాల్సిన అసైన్డ్‌, అటవీశాఖ భూములతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఈటల మాట్లాడారు.

దళితుల మూడు ఎకరాల భూపంపిణీలో విఫలమైన ప్రభుత్వం పిచ్చిపిచ్చి పథకాలతో ప్రజలను వంచించడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రజలు విచక్షణతో ఆలోచించి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మద్యం పాలసీతో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీజేపీ అండగా నిలిచి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దుష్టపాలన అంతానికి శ్రీకారం జరుగుతుందని, జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సౌడ రమేష్‌, ఉడుగుల రమేష్‌, ముక్కెర తిరుపతిరెడ్డి, కేవీఎల్‌ఎన్‌.రెడ్డి, శివరాజ్‌ యాదవ్‌, కొంతం శ్రీను, హరిశ్చంద్ర గుప్తా, పి.జగదీష్‌, భాస్కర్‌రెడ్డి, బెజాడి బీరప్ప, దండు శ్రీను పాల్గొన్నారు.

Read more