వానల వేళ...

ABN , First Publish Date - 2022-07-07T16:58:41+05:30 IST

వర్షాకాలంలో పెరిగే తేమ ప్రభావం మేకప్‌ మీద పడుతుంది. మేకప్‌ చెదిరి, ప్యాచీగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే

వానల వేళ...

వర్షాకాలంలో పెరిగే తేమ ప్రభావం మేకప్‌ మీద పడుతుంది. మేకప్‌ చెదిరి, ప్యాచీగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలి.

మన్నికైన మాయిశ్చరైజర్‌

వాతావరణం ఎంత తేమగా ఉన్నా, కొన్నిసార్లు చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. ఇందుకోసం మేలు రకం మాయిశ్చరైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. దీన్ని మేకప్‌ ముందు అప్లై చేసుకుంటే, మేకప్‌ మొత్తం ముఖం మీద సమంగా పరుచుకుంటుంది. అయితే ఈ కాలంలో వాటర్‌ బేస్‌డ్‌ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది చర్మం మీద అదనపు నూనెను పీల్చుకుని, రోజంతా మేక్‌పతో చికాకు కలగకుండా చేస్తుంది. 

పౌడర్స్‌ వాడితే...

ఈ కాలంలో క్రీమ్‌ బేస్‌డ్‌ ఉత్పత్తుల కంటే, పౌడర్‌ బేస్‌డ్‌ ఉత్పత్తులను ఎంచుకోవడమే మేలు. వీటితో మ్యాటి ఎఫెక్ట్‌ సమకూరుతుంది. అయితే ఫౌండేషన్‌, కన్‌సీలర్లను ఎక్కువగా అప్లై చేసుకోకూడదు. మేక్‌పకు పౌడర్‌ను బేస్‌గా వాడుకోవాలి. ఇందుకోసం పౌడర్‌ బేస్‌డ్‌ ఫౌండేషన్‌ ఎంచుకుంటే, తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉంటుంది. అలాగే మేక్‌పకు ముందు ప్రైమర్‌ను అప్లై చేసుకోవడం కూడా ముఖ్యమే! 

లిప్‌ టింట్స్‌ ఇలా...

ఈ కాలంలో బోల్డ్‌, బ్రైట్‌ రెడ్స్‌ కంటే, సాఫ్ట్‌ మ్యాటి, పింక్‌ షేడ్స్‌ లేదా తేలికైన బ్రౌన్‌ షేడ్స్‌ బాగుంటాయి. ఈ కాలంలో లిప్‌ గ్లాస్‌కు దూరంగా ఉండాలి. గ్లాస్‌, క్రీమ్‌ లిప్‌స్టిక్‌లు ఈ కాలంలో తేలికగా కారిపోతూ ఉంటాయి. 

కళ్లు ఇలా...

లైనర్స్‌ ఉపయోగించే ముందు రెప్పలను హైడ్రేట్‌ చేసుకోవాలి. ముడతలు లేని మ్యాటి ఫినిష్‌ కోసం, క్రీమ్‌ బేస్‌డ్‌ పెన్సిళ్లకు బదులుగా ఫెల్ట్‌-పెన్‌ ఐలైనర్‌ ఎంచుకోవాలి. నలుపు రంగు కాజల్‌ పెన్సిల్‌ వాడకం మానేసి, తెలుపు లేదా గోధుమ రంగు పెన్సిల్‌తో కనురెప్పల అంచుల్లో లైన్‌ గీసుకోవాలి. ఇలా చేస్తే కళ్లు విప్పారినట్టు కనిపిస్తాయి.

బ్లషర్స్‌, ఐషాడోస్‌

పౌడర్‌ బేస్‌డ్‌ బ్లషర్స్‌, ఐషాడోలు ఈ కాలంలో ఎంచుకోవాలి. క్రీమీ పింక్‌, లైట్‌ బ్రౌన్‌, పేస్టెల్‌, బీజ్‌ రంగుల ఐషాడోలు ఈ కాలానికి నప్పుతాయి.

ఆచితూచి

మేకప్‌ ఆకర్షణను పెంచేలా.. ముఖకవళికలను ఎన్‌హాన్స్‌ చేసేలా ఉండాలి. కాబట్టి అవసరానికి మించి ఎక్కువగా లేదా  తక్కువగా మేకప్‌ వేసుకోకూడదు. అలాగే సరైన షేడ్స్‌ను ఆచితూచి ఎంచుకోవాలి. మేక్‌పలో ప్రయోగాలు చేస్తే ఫలితం మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.  

Updated Date - 2022-07-07T16:58:41+05:30 IST