జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Published: Tue, 16 Aug 2022 01:54:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

స్వాతంత్య్ర దినోత్సవాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌, ఆగస్టు 15:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) స్వాతంత్య్ర పోరాటాల స్ఫూర్తిగా జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. దేశంలో విభిన్న మతాలు, భాషలు, ప్రాంతాలున్నా.. అంతా ఒక్కటే అని చాటిచెప్పే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని ఆయన అన్నారు.

రైతుల ఖాతాలో డబ్బులు జమ

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 267.26 కోట్ల రూపాయలను 2లక్షల 60వేల 333 మంది రైతుల ఖాతాలో జమచేశామన్నారు.  జిల్లాలో 25వేల రూపాయల వరకు రుణం పొందిన 15711 మంది రైతులకు సంబంధించిన 20 కోట్ల 10లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 50వేల రూపాయల్లోపు పంట రుణం పొందిన 27వేల 601 మంది రైతులకు 85 కోట్ల 85లక్షల రూపాయల రుణాన్ని కూడా మాఫీ చేశామన్నారు. జిల్లాలో ఉధ్యానవనశాఖ కింద బిందు, తుంపర సేద్యం ప్రొత్సహించేందుకు 58.80హెక్టార్‌లలో రాయితీలు అందిస్తున్నామన్నారు. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 6వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నామన్నారు. 

శనగ రైతులకు రూ.43.55 కోట్ల చెల్లింపులు

జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా 83,275 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేసి 43.55 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించామన్నారు. జిల్లాలో కందుల కొనుగోలు కూడా చేపట్టామని తెలిపారు. జిల్లాలో మత్స్యశాఖ ద్వారా 12.50 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంకాగా 4.16 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేశామన్నారు. ఈ వానకాలంలో 10 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో పశుసంవర్ధకశాఖ ద్వారా గొల్లకుర్మలు, యాదవుల ఆర్థిక అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 10722 యూనిట్లను లబ్ధిదారులకు అందించామని వీరి కోసం 139.355 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. అలాగే జిల్లాలో 2021-22 యాసంగి సీజన్‌లో 460 కేంద్రాల ద్వారా 6లక్షల 35వేల 900లమెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని 81239 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కోసం ప్రభుత్వం 1238.59 కోట్లను రైతుల ఖాతాలో జమచేసిందన్నారు. ఆహారభద్రత కార్డుల ద్వారా 4లక్షల 5314 మందికి ప్రతి నెలా బియ్యంపంపిణీ చేస్తున్నామన్నారు.

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలకు 426.15 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. పట్టణ ప్రగతి కింద నిజామాబాద్‌ కార్పొరేషన్‌ మూడు మున్సిపాలిటీల పరిధిలో 116.7 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. అలాగే నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 15 ప్రధాన కాల్వల కోసం 954.77 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. చెరువుల కింద సాగు పెంచేందుకు 217 కోట్ల రూపాయలను వెచ్చించి మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ పూర్తిచేశామన్నారు. జిల్లాలో 52 చెక్‌డ్యాంల కోసం 162 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. శ్రీరామసాగర్‌ పునర్జీవన పథకంలో భాగంగా ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేవిధంగా పనులను చేపట్టి పూర్తిచేశామని మంత్రి అన్నారు. ఈ పథకం కోసం 1999 కోట్ల రూపాయలను వెచ్చించామన్నారు. జిల్లాలోని సారంగాపూర్‌ వద్ద సర్జ్‌పూల్‌తో పాటు పంపుల నిర్మాణం కోసం 892 కోట్లను వెచ్చిస్తున్నామన్నారు. మంచిప్ప వద్ద 2 పంపుల నిర్మాణం కోసం 540 కోట్ల అంచనాలతో పనులు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 20,21 కింద 2413 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామన్నారు. పైప్‌లైన్‌ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందిస్తామన్నారు. మెంట్రాజ్‌పల్లి వద్ద పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. జిల్లాలో 35 లిఫ్టుల కోసం 149 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు

జిల్లాలో మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 27 మండలాల పరిధిలో 805 ఆవాసాల్లో ప్రతిరోజూ తాగునీరు అందించడంతో పాటు 2లక్షల 86వేల 159 నల్లా కనెక్షన్‌లను ఇప్పటి వరకు ఇచ్చామన్నారు. జిల్లాలో కొత్తగా జిల్లాలో 48వేల 22 పెన్షన్‌లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు 831 కోట్ల రూపాయలు అందించేందుకు నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 75.55 కోట్ల రూపాయ లు ఖర్చు చేశామన్నారు. లక్ష 86వేల 222 మంది కూలీలకు పనులు కల్పించామని తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆసుపత్రిలో సాదారణ ప్రసవాలను ప్రోత్సహించుటకు ప్రయత్నాలు చేస్తున్నామన్నా రు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భా గంగా ఇప్పటి వరకు 12లక్షల 52వేల 312 మందికి మొదటి డోసు, 12లక్షల 14వేల 716 మంది 2వ డోసు వేశామన్నారు. జిల్లా లో బూస్టర్‌డోసు 80వేల 63 మంది ఇప్పటి వరకు వేశామన్నారు. జిల్లాలో 336 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నామన్నారు.

జిల్లాలో 14,825 ఇళ్ల మంజూరు 

జిల్లాలో గృహ నిర్మాణం కింద 14వేల 825 ఇళ్లను మంజూరు చేయగా 2569 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మిగిలిన ఇళ్లు పురోగతిలో ఉన్నాయని వీటి కోసం ఇప్పటి వరకు 217 కోట్లు ఖర్చు చేశామన్నారు.  అలాగే జిల్లాలో అటవీశాఖ ద్వారా ఈ సంవత్సరం హరితహారం కింద 45.312 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో విద్యాశాఖ ద్వారా మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టామన్నారు. మొత్తం 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 407 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టి 160 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు 7లక్షల 50వేల పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జిల్లా కలెక్టరేట్‌ నూతన భవనానికి 58.70 కోట్లను వెచ్చించి పనులు పూర్తిచేశామన్నారు. న్యాక్‌భవన నిర్మాణం కొనసాగుతుందన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా వివిధ పథకాల కింద 498 కోట్లతో 2664 పనులు మంజూరయ్యాయన్నారు. వీటిలో 2055 పనులు ఇప్పటి వరకు పూర్తిచేసి 345 పనులు వెచ్చించామన్నారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్‌, మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రమిశ్రాతో పాటు అధికారులు,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా అభివృద్ధిని తెలిపేవిధంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. రైతు సంక్షేమ పథకాలు, డ్రోన్‌ ద్వారా పిచికారి, యంత్రంతో వ్యవసాయశాఖ శకటం, పెన్షన్‌లు, బ్యాంకు లింకేజీ పథకాలతో గ్రామీబివృద్ధిశాఖ శకటం, మిషన్‌ భగీరథ వివరాలను తెలుపుతూ ఆర్‌డబ్లుఎస్‌ శకటం, సాదారణ కాన్పుల గురించి వివరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ శకటం, ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల శకటాలు, పశుసంవదర్దకశాఖ , ఉద్యానవనం పట్టుపరిశ్రమ శకటం, కార్గో పార్సిల్‌ వాహనం, రెడ్‌క్రాస్‌ వాహనాలతో శకటాల ప్రదర్శన నిర్వహించారు. 

నిజామాబాద్‌ అర్బన్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. 

వర్షంలోనూ సాగిన ప్రదర్శనలు

వర్షంకారణంగా పోలీసు పరేడ్‌ మైదానం చిత్తడిగా మారడంతో సాంస్కృతిక కార్యక్రమాలను రద్దుచేయాలని మంత్రి సూచించినప్పటికీ విద్యార్థులు తాము వర్షంలోనూ ప్రదర్శనలు ఇస్తామని చెప్పడంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పరేడ్‌ గ్రౌండ్‌ బురదమయం అయినప్పటికీ విద్యార్థులు చక్కని నృత్యాలతో అలరింపచేశారు. ఇందల్‌వాయి, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ కేజీబీవీవి విద్యార్థులు, ధర్మారం సాంఘిక సంక్షేమ రెసిడెన్షీయల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు బురదలో జారిపడే ప్రమాదం ఉందని వద్దని మంత్రి చెప్పినప్పటికీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు గొప్పగా సాగాయి. విద్యార్థులను మంత్రితో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.

అవార్డులు, పెన్షన్‌లు అందజేత..

జిల్లాలో వివిధశాఖల ఉన్నతాధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అవార్డులను అందజేశారు. రెవెన్యూ, డీఆర్‌డీఏ, పోలీస్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, పంచాయతీరాజ్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌, వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌, పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్‌ విద్యా, పోలీసు, ఆర్‌డబ్లూ ఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీశాఖ, 7వ బెటాలియన్‌, నీటిపారుదలశాఖ, విద్యుత్‌శాఖ, మెప్మా, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, పశుసంవర్దకశాఖ, ఆర్టీసీ సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ఎన్‌జీవోలకు మొత్తం 300 మందికి అవార్డులు అందజేశారు. 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తున్న సందర్భంగా జిల్లాలో ప్రారంభం సందర్భంగా 67 మంది లబ్ధిదారులకు పెన్షన్‌లు అందజేశారు. అనంతరం మంత్రి పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.