గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-26T06:07:16+05:30 IST

మండలంలో ప్రతీ గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేయాలని ఎంపీపీ గొర్లి సూరిబాబు కోరారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
మాట్లాడుతున్న ఎంపీపీ గొర్లి సూరిబాబు

ఎంపీపీ గొర్లి సూరిబాబు


తుమ్మపాల, జనవరి 25: మండలంలో ప్రతీ గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేయాలని ఎంపీపీ గొర్లి సూరిబాబు కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన  మాట్లాడారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగిస్తూ అభివృద్ధి పథంలో మండలాన్ని నడపాలన్నారు. మండలంలో అనధికార క్వారీలు నిర్వహిస్తున్నారని, ఈ వివరాలు గనులశాఖ అధికారులను అడుగ్గా అందించడం లేదని వెంకుపాలెం సర్పంచ్‌ నాగేశ్వరరావు తెలపగా, ఎంపీపీ తీవ్రంగా మండిపడ్డారు. గనుల శాఖ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ, మండలంలో 215 క్వారీలకు అనుమతులు ఇవ్వగా 46 మాత్రమే నిర్వహణలో ఉన్నాయని చెప్పడంతో అంతా విస్తుపోయారు. రోజూ వందలాది లారీల్లో అక్రమంగా రోడ్డు మెటల్‌ తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఎంపీపీ ఆరోపించారు. తక్షణమే అధికారుల తీరును ప్రక్షాళన చేయకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆర్‌ఈసీఎస్‌ను సహకార రంగంలోనే కొనసాగించాలని తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో సత్య శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ డీఈ వేణుగోపాలరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ దుర్గాప్రసాద్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బీవీ సత్యవతి, జడ్పీటీసీ కో-ఆప్షన్‌ మెంబరు జోసఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:07:16+05:30 IST