గిరి ప్రదక్షిణ విజయవంతానికి కృషి

ABN , First Publish Date - 2022-07-07T06:26:47+05:30 IST

ఈనెల 12న మధ్యాహ్నం మూడుగంటలకు అప్పన్నస్వామి ప్రచారం రథం పరిక్రమణతో ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున తెలిపారు. జీవీఎంసీ కమిషనర్‌ డా.లక్ష్మీషా, సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌, సింహాచలం ఈవో సూర్యకళతో కలిసి బుధవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

గిరి ప్రదక్షిణ విజయవంతానికి కృషి
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై చర్చిస్తున్న అధికారులు

పిల్లలు, వృద్ధులు రావద్దు 

మాస్కులు ధరించి పాల్గొనండి: కలెక్టర్‌

భద్రతపై ప్రత్యేక దృష్టి :  సీపీ 

సింహాచలం, జూలై 6: ఈనెల 12న మధ్యాహ్నం మూడుగంటలకు అప్పన్నస్వామి ప్రచారం రథం పరిక్రమణతో ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున తెలిపారు. జీవీఎంసీ కమిషనర్‌ డా.లక్ష్మీషా, సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌, సింహాచలం ఈవో సూర్యకళతో కలిసి బుధవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశామని, అందుకు తగ్గట్టుగా స్టాల్స్‌, టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి చిన్న పిల్లలను తీసుకురావద్దని, వయోవృద్ధులు పాల్గొనవద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. నగరంలో వాటర్‌ ప్యాకెట్లపై నిషేధం ఉందని, ప్రత్యామ్నాయంగా పేపర్‌ గ్లాసులతో వాటర్‌ బబుల్స్‌ ద్వారా నీటిని అందిస్తామన్నారు. సింహగిరి మెట్లమార్గాన్ని ఉత్సవానికి తగినట్టుగా తీర్చిదిద్దాలని ఆదేశించామన్నారు. కరోనా ప్రబలుతున్న దృష్ట్యా భక్తులంతా మాస్కులు ధరించి గిరిప్రదక్షిణలో పాల్గొనాలన్నారు. పోలీసు కమిషనర్‌  సీహెచ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ గిరిప్రదక్షిణ మార్గంలో క్షేత్రపరిశీలన చేసి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. బారికేడింగ్‌తో రద్దీ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ప్రదక్షిణ మార్గంలో జోడుగుళ్లపాలెం, అప్పూఘర్‌ ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను ఉంచుతామని, రిస్కుపార్టీలను మోహరిస్తామన్నారు.  ఉత్సవంలో సుమారు 2వేలకు పైగా పోలీసులకు విధులు కేటాయిస్తామని చెప్పారు. భక్తులు స్నానాలు చేసే సమయంలో ఉత్సాహంతో లోతైన ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. ఈ పర్యటనలో డీసీపీ సుమిత్‌ సునీల్‌గార్గ్‌, ఏసీపీలు శరత్‌రాజ్‌కుమార్‌, పెంటారావు, సీఐలు, ఎస్‌ఐలు, దేవస్థానం ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T06:26:47+05:30 IST