ఈద్‌ ముబారక్‌!

ABN , First Publish Date - 2021-05-14T05:30:00+05:30 IST

శుభాల సరోవరమైన అతి పవిత్ర రంజాన్‌ మాసం ముగిసింది. అల్లాహ్‌తో సంబంధాలను మరింత దృఢతరం చేసుకొనే అవకాశాన్ని ఈ మాసం అందించింది. ఆ అవకాశాన్ని ఎంతమంది....

ఈద్‌ ముబారక్‌!

నేడు రంజాన్‌


శుభాల సరోవరమైన అతి పవిత్ర రంజాన్‌ మాసం ముగిసింది. అల్లాహ్‌తో సంబంధాలను మరింత దృఢతరం చేసుకొనే అవకాశాన్ని ఈ మాసం అందించింది. ఆ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారనేది ప్రతి ఒక్కరూ ఆత్మ సమీక్ష చేసుకోవాలి. 


నెలవంకను చూసి రంజాన్‌ ఉపవాసాలను ప్రారభించినట్టే, షవ్వాల్‌ నెలలో నెలవంకను చూశాక... ఉపవాసాలను విరమించి, ఆ మరుసటి రోజు ‘ఈద్‌-ఉల్‌- ఫిత్ర్‌’ (రంజాన్‌) పండగ జరుపుకోవడం ఆనవాయితీ. ‘‘నెలవంకను చూసి రోజా (ఉపవాసాలు) ప్రారంభించండి. నెలవంకను చూశాక వాటిని విరమించండి. అవి ఇరవై తొమ్మిది రోజాలు కావచ్చు, ముప్ఫై రోజాలు కావచ్చు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ సూచన చేశారు.


‘‘ఈద్‌, బక్రీద్‌ రాత్రులు ఎంతో ఉన్నతమైన, శుభప్రదమైన రాత్రులు. కాబట్టి ఈ రాత్రులలో మేలుకొని ఉండి ఆరాధనలూ, దుఆలూ చేయాలి. పుణ్యఫలాపేక్షతో ఎవరైతే ఈ రెండు పండగల రాత్రుల్లో దైవారాధనలో గడుపుతారో వారి హృదయాలు సజీవంగా ఉంటాయి’’ అని ఆయన తెలిపారు. ఉపవాస సమయంలో మానవ సహజమైన దౌర్బల్యాల వల్ల జరిగే పొరపాట్లు, లోటుపాట్లను ఫిత్రా దానం ద్వారా ప్రక్షాళన చేసుకోవాలి. ఈద్‌కు ఒక రోజు ముందే ఫిత్రా చెల్లించి, బీదవారు ఈద్‌ రోజున కడుపు నిండా ఆహారం తినే వీలు కల్పించాలి. పండగ రోజు నమాజ్‌ కన్నా ముందు ఇచ్చిన దానాన్నే అల్లాహ్‌ సమ్మతిస్తాడని దైవ ప్రవక్త స్పష్టం చేశారు. 


పండగ విధి విధానాలు

పండగ రోజున తలస్నానం చేయడం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం, కొత్త దుస్తులు ధరించడం... ఇది దైవ ప్రవక్త ఆచరణ విధానం. ఈద్‌ నమాజ్‌ను పట్టణం లేదా గ్రామం వెలుపల ఉన్న బహిరంగ ప్రదేశంలో, అంటే ఈద్‌గాహ్‌లో చేసుకోవడం సంప్రదాయం. అయితే ప్రస్తుత కరోనా కల్లోల కాలంలో, ఈసారి  ప్రజలు సమీపంలో ఉన్న మసీదుల్లోనో, ఇళ్ళలోనో ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈద్‌ నమాజ్‌కు ముందు కొన్ని ఖర్జూరాలు తిని వెళ్ళాలి. అవి బేసి సంఖ్యలో (1, 3, 5, 7... ఇలా) ఉండాలి.


పండ్లు లేకపోతే తీపి పదార్థం ఏదైనా తీసుకోవాలి. ఈద్‌గాహ్‌కూ (ప్రస్తుతం మసీదుకు) ఒక మార్గంలో వెళ్ళి, మరో మార్గంలో తిరిగి రావడం దైవ ప్రవక్త సంప్రదాయం. తక్బీర్‌ చదువుతూ నమాజ్‌కు వెళ్ళాలి. నమాజ్‌ పూర్తి చేశాక, సలాములు చేస్తూ, అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేయాలి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. పండగ రోజున పిల్లలకు పెద్దలు ఈదీలు (కానుకలు) ఇస్తూ ఉంటారు. అల్లాహ్‌ కూడా రంజాన్‌ మాసంలో భక్తులు కనబరచిన భక్తికీ, నిష్ఠకూ అపారమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.


మరో ఆరు రోజుల ఉపవాసం

రంజాన్‌ తరువాతి మాసం షవ్వాల్‌. ఈద్‌ (రంజాన్‌) పండగ జరుపుకొన్న రెండో రోజు నుంచీ ఆరు రోజుల పాటు షవ్వాల్‌ ఉపవాసాలను పాటించే సంప్రదాయం ఉంది. అయితే ఇది తప్పనిసరి కాదు. ఉపవాసాలు కొనసాగించలేని పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది. షవ్వాల్‌ ఉపవాసాలు ఎంతో పవిత్రమైనవని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. ఎవరయితే రంజాన్‌ ఉపవాసాలు చేసి, ఆ తరువాత షవ్వాల్‌ మాసంలో ఆరు ఉపవాసాలు పాటిస్తారో, వారు ఏడాదంతా ఉపవాసంలో ఉన్నట్టేననీ, అప్పుడే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినంత పవిత్రుడవుతాడనీ ఆయన పేర్కొన్నారు. అటువంటివారికి కనీసం పదింతల పుణ్యం లభిస్తుందని చెప్పారు. ఎవరైనా రంజాన్‌ మాసమంతా ఉపవాసాలు చేస్తే అతనికి పది నెలల పుణ్యం ప్రాప్తమవుతుంది. ఆ తరువాత షవ్వాల్‌లో ఆరు రోజుల ఉపవాసానికి అరవై రోజుల పుణ్యం లభిస్తుంది. అంటే మొత్తం పన్నెండు నెలలు... ఏడాది పాటు ఉపవాసం ఉన్న పుణ్యాన్ని అతను పొందగలుగుతాడని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, రంజాన్‌ మాసంలో చేసిన ఉపవాసాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే... షవ్వాల్‌ మాసంలో చేసే ఈ ఆరు ఉపవాసాల ద్వారా అల్లాహ్‌ ఆ పొరపాట్లను మన్నిస్తాడనీ, నమాజుల్లో ఏర్పడిన లోపాలను పూరిస్తాడనీ పేర్కొంటున్నాయి.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST