Viral Video: రాకాసి అలకు కొట్టుకుపోయిన 8మంది ప్రవాస కుటుంబ సభ్యులు.. Oman లో విషాద ఘటన!

ABN , First Publish Date - 2022-07-12T14:05:50+05:30 IST

అప్పటి వరకు ఆ కుటుంబం బీచ్‌లో సరదాగా గడుపుతోంది.

Viral Video: రాకాసి అలకు కొట్టుకుపోయిన 8మంది ప్రవాస కుటుంబ సభ్యులు.. Oman లో విషాద ఘటన!

మస్కట్: అప్పటి వరకు ఆ కుటుంబం బీచ్‌లో సరదాగా గడుపుతోంది. అంతలోనే వచ్చిన ఓ రాకాసి అల.. అందరు చూస్తుండగానే 8 మంది కుటుంబ సభ్యులను సముద్రంలోకి లాక్కెళ్లింది. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది కళ్లముందే సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఆదివారం సాయంత్రం ఒమన్‌లోని ధోఫర్ గవర్నరేట్ పరిధిలోని అల్ ముఘసేల్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే, అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది సముద్రంలో కొట్టుకుపోయిన 8 మందిలో ముగ్గురిని కాపాడింది. మరో ఐదుగురి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 


ఒక్కసారిగా పొటేత్తిన రాకాసి అల ధాటికి క్షణాల్లోనే ఎనిమిది మంది కుటుంబ సభ్యులు బీచ్ ఒడ్డు నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయవడం వీడియోలో ఉంది. కాగా, ప్రమాదం బారిన పడ్డ కుటుంబాన్ని ఆసియా వాసులుగా రాయల్ ఒమన్ పోలీసులు గుర్తించారు. రెస్క్యూ బృందం ముగ్గురిని కాపాడగా.. కొట్టుకుపోయిన ఐదుగురిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వయసు 6 నుంచి పదేళ్లలోపేనని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సముద్ర అలలు భారీగా విరుచుకుపడుతున్నాయి. వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలోని అన్ని బీచ్‌లలో అధికారులు ఇప్పటికే సందర్శకులను అనుమతించడం లేదు. వాతావరణం కుదుటపడే వరకు ఎవరూ బీచ్‌లకు వెళ్లొద్దని పౌరులు, నివాసితులను అధికారులు హెచ్చరించారు.  




Updated Date - 2022-07-12T14:05:50+05:30 IST