సందడిగా ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌’.. సరికొత్త అనుభూతి...

ABN , First Publish Date - 2021-10-18T14:53:36+05:30 IST

ఎప్పుడూ రణగొణ ధ్వనులు, వ్యాపారాలు, అమ్మకాలు, అరుపులతో గందరగోళంగా కనిపించే చార్మినార్‌ ఆదివారం సాయంత్రం సందర్శకులకు సరికొత్త అనుభూతులను పంచింది...

సందడిగా ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌’.. సరికొత్త అనుభూతి...

  • పోలీస్‌ బ్యాండ్‌ మేళ, ఈవెంట్లు
  • నగర చరిత్రకు అద్దం పట్టే వంటకాలు ప్రత్యేకం


ఎప్పుడూ రణగొణ ధ్వనులు, వ్యాపారాలు, అమ్మకాలు, అరుపులతో గందరగోళంగా కనిపించే చార్మినార్‌ ఆదివారం సాయంత్రం సందర్శకులకు సరికొత్త అనుభూతులను పంచింది. మిమిక్రీ, కామెడీ కార్యక్రమాలతో సందడిగా మారింది. ఖవ్వాలీ, షాయరీ ప్రియులకు ఆనందాన్నిచ్చింది. ‘‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’’ (ఓ సాయంత్రం చార్మినార్‌ కోసం) కార్యక్రమంతో ఆ పరిసరాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 వరకు కొత్త వాతావరణాన్ని సంతరించుకుంది. నగరం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర నగరాలకు చెందిన పర్యాటకులు సైతం చార్మినార్‌ చెంతకు చేరుకున్నారు.


హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌ : ప్రతి నెలా రెండు ఆదివారాలు చార్మినార్‌ ప్రాంగణాన్ని కేవలం పర్యాటకులు, సందర్శకుల సౌకర్యార్థం కేటాయించాలని అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని జనం స్వాగతించారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. త్రివర్ణ పతాక రంగుల్లో శోభిల్లుతూ చార్మినార్‌ సరికొత్త అనుభూతులను పంచింది. పోలీస్‌ బ్యాండ్‌ మేళాలతో ప్రారంభమైన ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. చార్మినార్‌ నలువైపులా గుల్జార్‌హౌజ్‌, లాడ్‌బజార్‌, సర్దార్‌మహల్‌, పంచ్‌మొహల్లా వరకు ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు. తొలుత హైదరాబాద్‌ 13వ బెటాలియన్‌కు చెందిన బ్యాండ్‌తో పాటు ట్రాఫిక్‌ విభాగం తరఫున మొత్తం రెండు బ్యాండు బృందాలు సందర్శకులలో హుషారు రేకెత్తించాయి. రాత్రి 8.30కు ప్రారంభమైన ముషాయిరా కార్యక్రమం ఖవ్వాలీ, షాయరీ ప్రియులకు ఆనందాన్నిచ్చింది.


50 కౌంటర్లు..

విభిన్నమైన వంటకాలతో కూడిన స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. పత్తర్‌కా గోష్‌, షాహీ కబాబ్‌, హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్‌, హలీమ్‌ లాంటి వంటకాలతో కూడిన 50 కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిత్యం ఇక్కడ ఉండే చిరువ్యాపారులను పోలీసులు మదీనా, పత్తర్‌గట్టి వైపు విక్రయించుకోడానికి అనుమతించారు.


పాత నగరాన్ని అభివృద్ధి పరచాలి: వీహెచ్‌

మాజీ ఎంపీ వీహెచ్‌ చార్మినార్‌ను సందర్శించారు. లాల్‌ఖిలాను అతి సుందరంగా తీర్చిదిద్దినట్టే చార్మినార్‌, గోల్కొండలను ఆకర్షణీయంగా తయారు చేయాలని కోరారు. లైట్‌, సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.


337 బస్‌ ట్రిప్పులు

ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌కు వెళ్లే వారి కోసం గ్రేటర్‌ ఆర్టీసీ 337 బస్‌ ట్రిప్పులను ప్రత్యేకంగా నడుపుతోంది.  చాంద్రాయణ గుట్టనుం చి సుచిత్ర, బార్కస్‌ - సికింద్రాబాద్‌ (2సి), ఉప్పుగూడ- సికింద్రాబాద్‌, చార్మినార్‌- ఈసీఐల్‌ ఎక్స్‌రోడ్‌, జేపీ దర్గా, గోల్కొండ, నార్సింగ్‌, సికింద్రాబాద్‌, బోరబండ, గండిమైసమ్మతో పాటు అఫ్జల్‌గంజ్‌ నుంచి ఉప్పల్‌ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చార్మినార్‌కు వచ్చే వారి కోసం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 వరకు స్పెషల్‌ సర్వీసులు అందుబాటులో ఉం టాయని అధికారులు తెలిపారు. 



Updated Date - 2021-10-18T14:53:36+05:30 IST