యాదగిరిగుట్టలో వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చనలు

ABN , First Publish Date - 2022-05-27T07:32:12+05:30 IST

యాదగిరిగుట్ట నృసింహుడి క్షేత్రంలో ఏకాదశి పర్వదినోత్సవం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు.

యాదగిరిగుట్టలో వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చనలు

భక్తిశ్రద్ధలతో నిత్యారాధనలు

యాదగిరిగుట్ట, మే 26: యాదగిరిగుట్ట నృసింహుడి క్షేత్రంలో ఏకాదశి పర్వదినోత్సవం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో గర్భాల యంలోని స్వయంభువులను మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, నిత్య సహస్రనామార్చనలు జరిపారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవ మూర్తుల ను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేక వేదికపై వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. సుమారు రెండు గంటల పాటు అర్చక బృందం, వేదపండితులు లక్ష పుష్పార్చన వేడుకలు నిర్వహించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార వెండి జోడు సేవలు, సహస్ర నామార్చనలు జరిపిన అర్చకులు రాత్రి నివేదన లు చేసి శయనోత్సవంతో ఆలయ ద్వార బంధనం గావించారు. కొండపైన అనుబంధ ఆలయమైన రామలింగేశ్వరస్వామి సన్నిధిలో నిత్య పూజా కైంకర్యాలు, కొండకింద పాత గోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ఏకాదశి పర్వది నం సందర్భంగా విశేష పూజలు కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.19.26లక్షల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.  

యాదగిరిగుట్ట దేవస్థాన ఇన్‌చార్జి ఈవోగా ఆర్‌జేసీ రామకృష్ణ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఇన్‌చార్జి ఈవోగా రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో ఎన్‌.గీతారెడ్డి సెలవుపై వెళ్లడంతో దేవాదాయశాఖలో రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణారావును ఇన్‌చార్జి ఈవోగా ప్రభుత్వం నియమించింది. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకున్న అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

స్వామి సేవలో ప్రముఖులు

యాదగిరీశుడిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివా్‌సరెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆర్చకులు ప్రత్యేక దర్శనసౌకర్యం కల్పించారు. ఆయన ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలోని ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం నిర్వహించగా, దేవస్థాన అధికారులు ఆయనకు స్వామివారి అభిషేక లడ్డూ ప్రసాదాలను అందజేశారు. స్వామిని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్‌ దర్శించుకున్నారు. 

ప్రధానాలయంలో లక్ష పుష్పార్చన పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న అర్చకులు

Updated Date - 2022-05-27T07:32:12+05:30 IST