ఎక్కడి పనులక్కడే!

ABN , First Publish Date - 2022-05-22T06:38:24+05:30 IST

అది నాటి ముఖ్యమంత్రి దత్తత గ్రామం. దానిని సర్వాంగ సుందరంగా తీర్చిందిద్దేందుకు వీలుగా అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

ఎక్కడి పనులక్కడే!
రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాలను తొలగించని దృశ్యం

నిలిచిపోయిన రహదారి విస్తరణ పనులు 

పూర్తికాని చెట్లు, విద్యుత్‌ స్తంభాల తొలగింపు

కాంతులీనని సెంట్రల్‌ లైటింగ్‌ 

నాలుగేళ్లైనా లభించని మోక్షం 

నాటి సీఎం దత్తత గ్రామంలో పరిస్థితి 

ప్రభుత్వం మారడంతో పూర్తిచేయని వైనం 

 అరకులోయ, మే 21: అది నాటి ముఖ్యమంత్రి దత్తత గ్రామం. దానిని సర్వాంగ సుందరంగా తీర్చిందిద్దేందుకు వీలుగా అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడంతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా రూ.22 కోట్లు మంజూరు చేసింది. పనులు చివరి దశలో ఉండగా ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.  

నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరకులోయ(పెదలబుడు)ను దత్తత తీసుకున్నారు. పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. సుందరీకరణలో భాగంగా ఆర్‌ఐటీఐ జంక్షన్‌ నుంచి అరకు రైల్వేస్టేషన్‌ వరకు నాలుగులేన్ల రహదారి విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ.22 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. ఐదు కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.12 కోట్లు, మధ్యలో రెండు వంతెనలకు రూ.3 కోట్లు, సెంట్రల్‌ లైటింగ్‌కు రూ.70 లక్షలు వెచ్చించేందుకు నిర్ణయించారు. పృధ్వీ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ గత ప్రభుత్వ హయాంలోనే విస్తరణ పనులు ప్రారంభించింది. 


కొత్త ప్రభుత్వంతో చిక్కులు 

పనులు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చింది. అప్పటికే ప్రారంభించిన పనులను నిలిపివేసింది. 20 శాతం కన్నా ఎక్కువ పనులు జరిగితేనే కొనసాగించేందుకు అనుమతించడంతో కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయి. తిరిగి ప్రారంభించినప్పటికీ వరుసగా రెండేళ్లు కరోనా విలయతాండవంతో లాక్‌డౌన్‌లు ప్రకటించడంతో వేగం తగ్గింది.  దీంతో పాటు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో మరికొద్ది నెలలు ఆటంకం కలిగింది. ఎట్టకేలకు ప్రభుత్వ అనుమతులు పొంది, బిల్లుల చెల్లింపులు సాఫీగా సాగిన క్రమంలో రహదారి విస్తరణతో పాటు, సెంట్రల్‌ డివైడర్‌, డ్రైన్స్‌, ఫుట్‌పాత్‌ వంటి పనులు పూర్తిచేశారు. 


చెట్ల తొలగింపునకు అడ్డంకులు 

రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 167 చెట్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు విద్యుత్‌ స్తంభాలను కూడా మార్చాల్సి రావడంతో ఆయా ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి వీలు కాలేదు. చెట్ల తొలగింపునకు అనుమతించాలంటూ అటవీశాఖకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదించగా, రెండున్నరేళ్ల తరువాత అనుమతి లభించింది.  విద్యుత్‌ స్తంభాల మార్పునకు  చెట్టు అడ్డంకిగా మారడంతో ఆ పనులూ నిలిచిపోయాయి. 


వెలుగులివ్వని సెంట్రల్‌ లైట్లు

అరకులోయ రహదారి విస్తరణలో భాగంగా సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసినప్పటికీ, వేసిన విద్యుత్‌ దీపాలు వెలగడం లేదు. దీంతో రోడ్డంతా అంధకారం నెలకొంటోంది. సెంట్రల్‌ టూరిజం ఫండ్‌ రూ.50 లక్షల తో గత ప్రభుత్వ హయాంలోనే లైటింగ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, విస్తరణ పనుల నేపథ్యంలో తొలగించారు. తిరిగి స్తంభాలను పునరుద్ధరించినప్పటికీ, విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రహదారి మొత్తం చీకటిమయమవుతోంది.  

నిధులున్నా పూర్తికాని వంతెనలు 

రహదారి విస్తరణలో భాగంగా రెండు పాత వంతెనలు తొలగించి, కొత్తగా నిర్మించేందుకు వీలుగా రూ.3 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటికీ ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవకపోవడంతో, ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 


జూన్‌ నెలాఖరుకు పూర్తిచేస్తాం

అరకులోయ పట్టణ రహదారి విస్తరణ పనులు ఈ ఏడాది జూన్‌ నెలాఖరుకు పూర్తిచేస్తాం. చెట్ల తొలగింపునకు అటవీశాఖ ఇటీవలే అనుమతిచ్చింది. ఈ పనులకు టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించాం. విద్యుత్‌ స్తంభాల మార్పు, నిలిచిపోయిన డ్రైన్ల నిర్మాణం, ఇతర పనులు సత్వరం పూర్తిచేస్తాం. ఫుట్‌పాత్‌లను టైల్స్‌తో అందంగా తీర్చిదిద్దుతాం. 

- గంగరాజు, ఆర్‌అండ్‌బీ డీఈఈ, అరకు సబ్‌డివిజన్‌


Updated Date - 2022-05-22T06:38:24+05:30 IST