Eknath Shinde: ఫడ్నవీస్ తనను కాబోయే సీఎంగా ప్రకటించాక ఏక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలివి..

ABN , First Publish Date - 2022-06-30T23:34:51+05:30 IST

మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఆగమాగమైన సంకీర్ణ ప్రభుత్వం చివరకు..

Eknath Shinde: ఫడ్నవీస్ తనను కాబోయే సీఎంగా ప్రకటించాక ఏక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలివి..

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఆగమాగమైన సంకీర్ణ ప్రభుత్వం చివరకు కుప్పకూలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో శివసేనలో నెలకొన్న సంక్షోభానికి శుభం కార్డు పడింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండేతో జత కట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ కీలక నేత ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ.. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్ షిండేను మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రకటించారు. శివసేనలో రేగిన సంక్షోభానికి, తమకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఫడ్నవీస్‌తో కలిసి మీడియా సమావేశంలో ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.



బీజేపీకి 120 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదని, ఫడ్నవీస్‌కు, ప్రధాని మోదీకి, అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. బాలాసాహెబ్ సైనికుడిని సీఎం పదవిలో కూర్చోబెడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు. 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని.. వారి మద్దతుతోనే ఈ పోరాటంలో విజయం సాధించానని షిండే చెప్పారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గతంలో నియోజకవర్గాల అభివృద్ధి నిమిత్తం కలిశామని, ఆ సమయంలో ఆయన వైఖరి చూసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని తమకు అవగతమైందని ఏక్‌నాథ్ షిండే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఏక్‌నాథ్ షిండేను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో గోవాలోని హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తూ స్టెప్పులేశారు.

Updated Date - 2022-06-30T23:34:51+05:30 IST