మహా సీఎంగా ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా షిండే...రేపు ప్రమాణస్వీకారం?

ABN , First Publish Date - 2022-06-30T14:34:06+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే గత రాత్రి రాజీనామా చేయడంతో ఫ్లోర్ టెస్ట్‌తో కూడిన ప్రత్యేక మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది...

మహా సీఎంగా ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా షిండే...రేపు ప్రమాణస్వీకారం?

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వాయిదా

shivsena రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సర్కార్

ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ వాయిదా అనంతరం ఫడణవీస్ రేపు సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్ష గురువారం ఉదయం వాయిదా పడింది. ఇప్పుడు మహారాష్ట్ర 20వ సీఎంగా మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ రేపు ప్రమాణస్వీకారం చేయవచ్చని సమాచారం.డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపడతారని సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే గత రాత్రి రాజీనామా చేయడంతో ఫ్లోర్ టెస్ట్‌తో కూడిన ప్రత్యేక మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే మద్ధతుతో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందని బీజేపీ వర్గాల సమాచారం. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలాంటి అవకాశం తీసుకోకూడదని, శివసేన రెబెల్స్‌ ముంబయికి రాకూడదని బీజేపీ కోరింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గురువారం ముంబయికి రావద్దని, ప్రమాణ స్వీకారం రోజున రావాలని కోరుతున్నానని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పారు.ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర పరిపాలనలో ఒక చీకటి కాలానికి ముగింపు పలికిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు.


ఫ్లోర్ టెస్ట్ అవసరం లేదు: గవర్నర్ కోష్యారీ

మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఆదేశాల మేరకు గురువారం బలపరీక్ష అవసరం లేదని, కాబట్టి నేటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోమని మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే నిన్న మహారాష్ట్ర సీఎం పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2022-06-30T14:34:06+05:30 IST