పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో తరలివెళుతున్న సిబ్బంది
ఆత్మకూరు, ఏప్రిల్ 7: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కోర్టు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని 67 ఎంపీటీసీ స్థానాల్లో 27 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంతో వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. 40 ఎంపీటీసీ స్థానాలకు 100 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఆరు జడ్పీటీసీ స్థానాలకు పోటీ నెలకొంది. ఆత్మకూరు మండలంలో 41 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మండలంలో 3 సమస్యాత్మక, 16 అతి సమస్యాత్మక గ్రామాలకు పోలీసు బలగాలను నియమించారు. మండల కేంద్రాల్లో సాయంత్రం పోలింగ్ సిబ్బంది వారి రూట్లకు కేటాయించిన బస్సులలో పోలీసు ఎస్కార్ట్ మధ్య తరలివెళ్లారు. జాయింట్ కలెక్టర్ హరింద్రప్రసాద్ ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించారు.