67.71శాతం

ABN , First Publish Date - 2020-12-02T05:57:53+05:30 IST

67.71శాతం

67.71శాతం
రామచంద్రాపురంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న ప్రజలు

గ్రేటర్‌ పరిధిలో అత్యధిక పోలింగ్‌ రామచంద్రాపురంలో

పటాన్‌చెరులో 65.75 శాతం

భారతీనగర్‌లో 61.89 శాతం నమోదైన పోలింగ్‌

పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ


పటాన్‌చెరు, డిసెంబరు 1 : పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో మంగళవారం జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పటాన్‌చెరు డివిజన్‌లో 65.75 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 41,667 ఓట్లకు గాను 27,396 ఓట్లు పోలయ్యాయి. 14,460 మంది పురుషులు, 12,936 మంది స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పట్టణ పరిధిలో 52 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పటాన్‌చెరు డివిజన్‌లో ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మందకోడిగా సాగింది. మొదటి రెండు గంటల్లో కేవలం 8.21శాతం పోలింగ్‌ నమోదైంది. 10గంటల తరువాత వేగం పుంజుకున్నది. పోలింగ్‌ ముగిసే సరికి 6గంటలకు 65.75శాతం పోలింగ్‌ నమోదైంది. గడిచిన 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 57.96శాతం నమోదు కాగా ఈ సారి 8శాతం పోలింగ్‌ అధికంగా నమోదైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

గ్రేటర్‌ ఎన్నికల్లో పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీ  నగర్‌ డివిజన్లలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నందీశ్వర్‌గౌడ్‌ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెట్టుకుమార్‌యాదవ్‌, బీజేపీ అభ్యర్థి ఆశి్‌షగౌడ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ముత్యాల జయమ్మ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటాన్‌చెరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారికవిజయ్‌కుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓట్లు వేశారు. 


పట్టణంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల బాహాబాహీ

పటాన్‌చెరు పట్టణంలోని సరాయి చౌరస్తా వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు బాహాబాహీకి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. చైతన్యనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్త పార్టీ జెండాను ప్రదర్శించడంతో ఎమ్మెల్యే తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అడ్డుకున్నారు. తమ కార్యకర్తపై ఎమ్మెల్యే తనయుడు చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి ఆశి్‌షగౌడ్‌, నాయకుడు అభిషేక్‌గౌడ్‌ ఆందోళనకు దిగారు. పెద్దఎత్తున కార్యకర్తలు పోగై టీఆర్‌ఎస్‌ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటికే అక్కడి ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి చేరుకోవడంతో బీజేపీ నాయకులు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతపరిచారు. అయితే ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పోగవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  టీఆర్‌ఎస్‌ నాయకుడు గూడెం మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్లు పడకపోవడంతో అసహనంతో బీజేపీ నాయకులు కావాలనే గొడవలకు దిగారన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. 


రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లలో

రామచంద్రాపురం : గ్రేటర్‌ ఎన్నికలు రామచంద్రాపురంలో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచి ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహాన్ని కనబరిచారు. భారతీనగర్‌ డివిజన్‌లో 61.89, రామచంద్రాపురంలో 67.71 శాతం పోలింగ్‌ నమోదైంది. భెల్‌ ఎంఐజీలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపించడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. ఎల్‌ఐజీలో ఒక ఓటరుకు బదులుగా మరొకరు ఓటు వేయడానికి ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. సెల్‌ఫోన్లను పోలింగ్‌ స్టేషన్‌లోకి అనుమతించకపోవడంతో అప్పటికప్పుడు ఎక్కడ భద్రపర్చాలో అర్థంకాక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


 ఇతర పార్టీకి ఓటువేయాలంటూ క్యూలైన్‌లోనే స్వతంత్య్ర అభ్యర్థి ప్రచారం

రామచంద్రాపురం డివిజన్‌లోని 112 డివిజన్‌లో ఓ జాతీయ పార్టీకి చివరి నిమిషంలో మద్దతు పలికిన స్వతంత్య్ర అభ్యర్ధి సదరు జాతీయ పార్టీకి ఓటు వేయాలంటూ క్యూలో నిల్చుని  ప్రచారం చేశాడు. దీంతో క్యూలైన్‌లోని కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు సదరు అభ్యర్థిని పోలింగ్‌ స్టేషన్‌ నుంచి బయటకు పంపారు. 


గ్రేటర్‌ పరిధిలోనే అత్యధికం

రామచంద్రాపురం, డిసెంబరు 1: గ్రేటర్‌ పరిధిలోని సర్కిల్‌ 22 రామచంద్రాపురం 112వ డివిజన్‌లో 67.71 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. అతి చిన్న డివిజన్‌ (28,118 మంది ఓటర్లు)గా గుర్తింపు పొం దిన రామచంద్రాపురంలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోనే అత్యధిక శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఉదయం 9 గంటల కు 10.27 శాతం, 11 గంటలకు 25శాతం, మఽధ్యాహ్నం ఒంటిగంటకు 40.59 శాతం, 3గంటలకు 52.9 శాతం, 5గంటలకు 55.2 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగిసేసరికి 67.71 శాతం నమోదయింది. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇక్కడి ఐటీఐలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ డివిజన్‌లో 80 శాతం పోలింగ్‌ నమోదైయ్యింది. ఇక్కడి నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి అంజయ్య అప్పట్లో 5వేల మెజార్టీతో గెలుపొందారు. గ్రేటర్‌లోనే అత్యధిక మెజార్టీని సాధించిన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 







Updated Date - 2020-12-02T05:57:53+05:30 IST