అడ్డగోలుగా..

ABN , First Publish Date - 2021-03-07T06:36:44+05:30 IST

అడ్డగోలుగా..

అడ్డగోలుగా..

పశ్చిమలో పేట్రేగిపోతున్న అధికార పార్టీ ఆగడాలు

కేబీఎన్‌ కళాశాల అడ్డాగా మంత్రి మంత్రాంగాలు

కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి ఓటర్లకు ఫోన్లు

డబ్బు పంపిణీకి సహకరించాలని వన్‌టౌన్‌ వ్యాపారులపై ఒత్తిళ్లు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు సామ దాన దండోపాయాలు పన్నుతున్నారు. వైసీపీ నాయకులకు అధికారులు దాసోహమంటుండగా, పశ్చిమ నియోజకవర్గంలో విజయం కోసం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. 

మంత్రి అడ్డాగా కేబీఎన్‌ కళాశాల

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కేబీఎన్‌ కళాశాలను తన అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడి నుంచే పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్ల గెలుపునకు వ్యూహాలు పన్నుతున్నారు. కేబీఎన్‌ కళాశాలలో ఏకంగా పార్టీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న 22 మంది వైసీపీ అభ్యర్థులకు ఓటేయమంటూ ఆయా డివిజన్లలోని ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను విభజించి ఆయా వర్గాలకు వైసీపీ సర్కార్‌ ఏమేం చేసిందో ఫోన్‌లో వివరిస్తున్నారు. సుమారు కోటి రూపాయలను పశ్చిమ నియోజకవర్గంలో పంపిణీ  చేసేందుకు సిద్ధం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదును ఎక్కడెక్కడ, ఎలా పంపిణీ చేయాలన్న వ్యూహరచనకు కేబీఎన్‌ కేంద్రంగా మారిందని సమాచారం. 

వ్యాపారవేత్తలపై ఒత్తిళ్లు

వన్‌టౌన్‌లోని వ్యాపారులకు ఈ ఎన్నికలు పెద్ద ఇబ్బందినే తెచ్చి పెట్టాయి. వివిధ వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న గుమస్తాలను డబ్బును ఓటర్లకు చేర్చే పావులుగా మంత్రి వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో గుమస్తాకు కొందరు ఓటర్ల అడ్రస్సులు ఇచ్చి, వారితో పాటు స్థానిక వైసీపీ నాయకుడిని వెంట పంపి డబ్బు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఎవరైనా ఈ డబ్బును పట్టుకుని నిలదీస్తే గుమస్తా ఎంటరై..         ఆ డబ్బు ఫలానా వ్యాపార సముదాయానికి సంబంధించినదని చెప్పి, వైసీపీ నాయకుడిని తప్పించేలా స్కెచ్‌ వేశారు. కొన్ని డివిజన్లలో వార్డు వలంటీర్ల ద్వారా ఇప్పటికే చీరలు, దోమ తెరల పంపిణీకి మంత్రి తెరదీశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

అధికారుల వత్తాసు

అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారానికి డీజేలను అనుమతిస్తున్న పోలీసులు టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారానికి మాత్రం కేవలం హ్యాండ్‌ మైకుకే అనుమతి అంటున్నారు. కేవలం అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే ప్రచారంలో పాల్గొనాలని ఎన్నికల సంఘం ప్రకటించినా వైసీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారంలో కనీసం 30 నుంచి 50 మంది వరకు ఉంటున్నా అడిగేవారే లేరు. 

Updated Date - 2021-03-07T06:36:44+05:30 IST