Rajya Sabha Polls : శివసేన ఎమ్మెల్యే ఓటు రద్దు వెనుక అసలు కారణం ఇదే...

ABN , First Publish Date - 2022-06-11T19:23:42+05:30 IST

మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో

Rajya Sabha Polls : శివసేన ఎమ్మెల్యే ఓటు రద్దు వెనుక అసలు కారణం ఇదే...

న్యూఢిల్లీ : మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శివసేన ఎమ్మెల్యే సుహాస్ కండే ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఆయన ఓటు వేసిన తర్వాత బ్యాలట్ పేపర్‌ను మడతపెట్టలేదని, ఇది బ్యాలట్ పేపర్ గోప్యతను, ఓటింగ్ విధానాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. 


ఎన్నికల కమిషన్ (Election Commission) శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఆదేశాల్లో తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ (BJP) విజ్ఞప్తి మేరకు సుహాస్ కండే (Suhas Kande) ఓటు వేసిన విధానాన్ని పరిశీలించింది. వీడియో ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు, 1961లోని సెక్షన్ 39A(2)(c)లో పేర్కొన్న ఓటు వేసే విధానాన్ని కండే ఉల్లంఘించారు. దీనివల్ల ఆయన ఓటు వేసిన బ్యాలట్ పేపర్  గోప్యత ప్రభావితమైంది. బ్యాలట్ పేపర్‌పై ఓటు వేసిన తర్వాత ఆ పేపర్‌ను ఆ ఓటరు  మడతపెట్టాలని, తాను ఎవరికి ఓటు వేసినదీ ఇతరులు గుర్తించే అవకాశం లేకుండా గోప్యంగా ఉంచాలని ఈ నిబంధన చెప్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఈ ఆర్డర్‌ను జారీ చేశారు. 


సుహాస్ కండే ఓటు వేసిన తర్వాత తన పార్టీ ఆథరైజ్డ్ ఏజెంట్ వద్దకు వెళ్ళడానికి ముందు ఆ బ్యాలెట్ పేపర్‌ను మడతపెట్టలేదని ఈ ఆర్డర్ పేర్కొంది. ఓటు వేసిన క్యూబికిల్  నుంచి బయట ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్‌కు చూపించారని, అందువల్ల ఆ బ్యాలెట్ పేపర్‌లో ఆయన ఎవరికి ఓటు వేశారో ఆథరైజ్డ్ ఏజెంట్ కాని ఇతరులు కూడా చూసే అవకాశం కలిగిందని పేర్కొంది. ఆయన ఆ బ్యాలెట్ పేపర్‌ను మడత పెట్టకుండా చేతితో పట్టుకుని మరొక క్యూబికిల్ వైపు వెళ్ళారని, దీంతో మరోసారి దాని గోప్యతకు నష్టం జరిగిందని పేర్కొంది. పోలింగ్ సిబ్బంది చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఓటు వేసే క్యూబికిల్ బయట తిరిగారని తెలిపింది. 


ఓటు వేయడంలో ఎదుటి పక్షం ఎమ్మెల్యేలు నిబంధనలను ఉల్లంఘించారని ఓ వైపు బీజేపీ, మరోవైపు మహా వికాస్ అగాడీ కూటమి ప్రతినిధులు చేసిన ఫిర్యాదులను రిటర్నింగ్ ఆఫీసర్ (RO) తోసిపుచ్చారు. సుహాస్ కండేపై బీజేపీ చేసిన ఫిర్యాదు కూడా వీటిలో ఒకటి. రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. కండే కేసులో ఆర్ఓ పొరపాటు చేశారని పేర్కొంది. ఇతర కేసుల్లో ఆర్ఓ నిర్ణయాన్ని సమర్థించింది. 


మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఎన్‌సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహద్, కాంగ్రెస్ ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్, శివసేన ఎమ్మెల్యే సుహాస్ కండే ఓట్లపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాల ఓట్లపై మహా వికాస్ అగాడీ కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 


మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ 3, మహా వికాస్ అగాడీ కూటమి 3 స్థానాలను దక్కించుకున్నాయి. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ రాష్ట్ర మంత్రి అనిల్ బొండే, ధనంజయ్ మహడిక్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, శివసేన నేత సంజయ్ రౌత్ గెలిచారు. శివసేన నేత సంజయ్ పవార్, బీజేపీ నేత ధనంజయ్ మహడిక్ మధ్య భీకర పోరు జరిగింది. చివరికి శివసేన నేత ఓటమిపాలయ్యారు. 


Updated Date - 2022-06-11T19:23:42+05:30 IST