ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2021-11-27T04:54:27+05:30 IST

దర్శి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ రోజు స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పోలింగ్‌ కేంద్రాల్లోకెళ్లి హల్‌చల్‌ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఆ విషయంపై వివరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. ప్రత్యేకించి విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులను సంజాయిషీ కోరారు. దర్శి నగర పంచాయతీకి ఈనెల 15వ తేదీ పోలింగ్‌ జరగ్గా, ఆ రోజు ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రాల్లోకెళ్లి హల్‌చల్‌ చేయడం తెలిసిందే. పోలింగ్‌ కేంద్రాల్లోనూ, ఆవరణల్లో బారులుదీరిన ఓటర్ల వద్ద ఆయన హల్‌చల్‌ చేసిన దృశ్యాలు అదే సమయంలో టీవీల్లో ప్రసారమయ్యాయి.

ఎన్నికల కమిషన్‌ సీరియస్‌
ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రంలో హల్‌చల్‌ చేస్తున్న ఎమ్మెల్యే వేణుగోపాల్‌

దర్శి ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రాల సందర్శనపై వివరణ

తొలి రెండు నివేదికలను తిప్పిపంపిన కమిషనర్‌

పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు కలిసి మూడో నివేదిక తయారీ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

దర్శి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ రోజు స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పోలింగ్‌ కేంద్రాల్లోకెళ్లి హల్‌చల్‌ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఆ విషయంపై వివరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. ప్రత్యేకించి విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులను సంజాయిషీ కోరారు. దర్శి నగర పంచాయతీకి ఈనెల 15వ తేదీ పోలింగ్‌ జరగ్గా, ఆ రోజు ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రాల్లోకెళ్లి హల్‌చల్‌ చేయడం తెలిసిందే. పోలింగ్‌ కేంద్రాల్లోనూ, ఆవరణల్లో బారులుదీరిన ఓటర్ల వద్ద ఆయన హల్‌చల్‌ చేసిన దృశ్యాలు అదే సమయంలో టీవీల్లో ప్రసారమయ్యాయి. ఆ రోజు రాత్రికే ఎస్‌ఈసీ నుంచి ఆ విషయంపై వివరణ కోరారు. బందోబస్తు నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించిన దర్శి డీఎస్పీ, మరికొందరు స్థానిక అధికారులతో కలిసి ఒక నివేదిక పంపారు. ఆ నివేదికపై ఎస్‌ఈసీ పలు కొర్రీలు వేసింది. వెంటనే మరో నివేదిక పంపారు. దాన్నీ తిప్పిపంపింది. ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రాల్లో యథేచ్ఛగా తిరిగినట్లు వీడియోల్లో కనిపించడంతో మీరు అదేమి లేదంటూ నివేదిక పంపడంలో ఆంతర్యమేమిటని  అధికారులు స్థానిక పోలీస్‌ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌, అలాగే ఎస్పీలు కూడా ఈ విషయంపై సరైన నివేదిక ఇవ్వాలని, కిందిస్థాయి అధికారులకు సూచిస్తూ విధి నిర్వహణలో వారి లోపం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. దీంతో పోలీస్‌ అధికారులు, దర్శి నగర పంచాయతీ అధికారులు, సీనియర్‌ అధికారులు, న్యాయవాదుల సలహాలకు అనుగుణంగా ఎమ్మెల్యే నిబంధనలు అతిక్రమించలేదన్న తరహాలో మరో నివేదిక పంపినట్లు తెలిసింది. ఆ నివేదికపై ఎస్‌ఈసీ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

Updated Date - 2021-11-27T04:54:27+05:30 IST