మీడియా కవరేజ్ ట్రాకింగ్ కోసం ఈసీ సరికొత్త నిర్ణయం

ABN , First Publish Date - 2021-11-26T01:08:34+05:30 IST

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్

మీడియా కవరేజ్ ట్రాకింగ్ కోసం ఈసీ సరికొత్త నిర్ణయం

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది. ఈసీ కార్యకలాపాలకు అన్ని రకాల మాధ్యమాల్లో లభించే కవరేజ్‌ను కూడా ఈ సంస్థ గమనిస్తుంది. ఈ సంస్థ తన పరిశీలనలతో కూడిన నివేదికలను ఈసీకి సమర్పిస్తుంది. మీడియా కవరేజ్‌ను పర్యవేక్షించేందుకు ఈసీ ఓ ప్రైవేటు సంస్థను నియమించుకుంటుండటం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 


దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ కోరింది. ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ. అర్హతగల సంస్థలు నవంబరు 30 లోగా తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటపుడు ఎన్నికల కమిషన్, ఎన్నికల ప్రక్రియలకు అన్ని రకాల మాధ్యమాల్లో లభిస్తున్న కవరేజ్‌ను ఎంపికైన సంస్థ పర్యవేక్షించవలసి ఉంటుంది. ఈ కవరేజ్ ఆధారంగా పీరియాడిక్ సెంటిమెంట్ విశ్లేషణ నివేదికలను తయారు చేసి, వార్తా నివేదికలు, అభిప్రాయాలను పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్‌గా వర్గీకరించాలి. ఈ విశ్లేషణ కోసం ఈసీ కొన్ని కీ వర్డ్స్‌ను ఇస్తుంది. అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఓ ఇంటరాక్టివ్ డ్యాష్‌బోర్డును కూడా ఈ సంస్థ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీనిలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను అప్‌లోడ్ చేయాలి. 


వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికలు జరుగుతాయి. గతంలో ఎన్నికల ప్రక్రియల ఉల్లంఘనలు జరిగాయంటూ ఈసీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల సమాచారాన్ని పకడ్బందీగా అందుబాటులో ఉండేవిధంగా చేయడం కోసం ఓ ఏజెన్సీని నియమించుకోవాలని నిర్ణయించినట్లు ఈసీ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. 

 


Updated Date - 2021-11-26T01:08:34+05:30 IST