ఎన్నికల కరోనా..!

ABN , First Publish Date - 2020-11-30T04:40:05+05:30 IST

గ్రేటర్‌ హైదరబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారాలు ఆదివారం సాయంత్రం ముగియడంతో పదిరోజులుగా వివిధ ప్రాంతాలనుంచి ఎన్నికల ప్రచారాలకు తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు.

ఎన్నికల కరోనా..!
గ్రేటర్‌ ఎన్నికల్లో భౌతిక దూరం పాటించని నాయకులు

ప్రచారాలకు వెళ్లిన నేతలతో జాగ్రత్త

కరోనా వాహకాలు అయ్యేందుకు అవకాశాలు అధికం

గ్రేటర్‌ ప్రచారాల నుంచి నేతల తిరుగుముఖం

కరోనా పరీక్షలు అత్యావశ్యకం 

ఇల్లెందు, నవంబరు 29: గ్రేటర్‌ హైదరబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారాలు ఆదివారం సాయంత్రం ముగియడంతో పదిరోజులుగా వివిధ ప్రాంతాలనుంచి ఎన్నికల ప్రచారాలకు తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలనుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిదులు వందలాదిమంది తమతమ పార్టీలకు అనుకూలంగా గ్రేటర్‌ ఎన్నికల్లో విస్తృతప్రచారం చేశారు. రేయింబవళ్లు తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఓటర్లను బుజ్జగించడం, కాళ్లవేళ్లా పడటం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అంతేగాక తమతమపార్టీల రోడ్‌షోలు, బహిరంగసభల్లో వేలాదిమందితో మాస్కులు లేకుండా భౌతిక దూరాలు పాటించకుండా యథేచ్ఛగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఓట్ల కోసం తమకు కేటాయించిన డివిజన్‌లలో గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించడం, కరచాలనాలు చేయడం వాల్‌పోస్టర్లు, కరపత్రాలు పంచడంలాంటి అనేక కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశాలున్న అనేక పనులు చేశారు. అయితే రోడ్‌షోలల్లో భారీ సభల్లో వేలాదిమందితో కలియ తిరిగి ఉండటం లాంటి కరోనా వైరస్‌ విస్తరించే అవకాశాల ముంగిట తమ పార్టీల కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ప్రచారాలు ముగియడంతో నివాస పట్టణాలు, గ్రామాలకు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో కరోనా రెండోవ దశ విస్తరణ రోజురోజుకు పెరుగుతుండటం, ప్రభుత్వం అధికారా యంత్రాంగాలు అనేక ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని, ప్రతిఒక్కరు కరోనా వైరస్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారాలకు గ్రేటర్‌ హైదరబాద్‌ తరలివెళ్లిన  వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని తదనంతరమే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారు. ఏది ఎమైనా ప్రచారాలకు ఉభయ జిల్లాలనుంచి వేలాదిమంది తరలివెళ్లడం మూలంగా ముందస్తు జాగ్రత్తలుగా కరోనా టెస్టులు చేయించుకోవడం అటు నాయకులు, కార్యకర్తలకే గాక స్థానికులకు సైతం మనోధైర్యం కల్పించిన వారమవుతామని ప్రచారాలకు వెళ్లిన వివిధ పార్టీల నాయకులకు స్థానికులు విజ్ఙప్తి చేస్తున్నారు. 


Updated Date - 2020-11-30T04:40:05+05:30 IST