ఎన్నికల విధులు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ

ABN , First Publish Date - 2022-02-11T14:30:38+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 31న తొలివిడత శిక్షణా కార్యక్రమం పూర్తయ్యింది. రెండో విడత శిక్షణా కార్యక్రమాలు

ఎన్నికల విధులు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ

                        - నగరంలో 24 వేల మంది పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ


చెన్నై: గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 31న తొలివిడత శిక్షణా కార్యక్రమం పూర్తయ్యింది. రెండో విడత శిక్షణా కార్యక్రమాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. 24 ప్రాంతాల్లో ఏర్పాటైన ఈ కార్యక్రమాలకు ఒక్కో ప్రాంతానికి వెయ్యిమంది చొప్పున 24 వేల మంది పోలింగ్‌ సిబ్బంది హాజరయ్యారు. వీరిలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. ఈవీఎంల పనితీరు, అవి చెడిపోతే మరమ్మతుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, వీవీప్యాట్‌ల పనితీరు, ఓటర్ల బూత్‌స్లిప్పుల పరిశీలన తదితర అంశాలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ఆలందూరు జోన్‌ సెయింట్‌ థామస్‌మౌంట్‌ చక్రపాణి కాలనీలోని మాన్‌ఫోర్డు మెట్రిక్యులేషన్‌ మహోన్నతపాఠశాలలో జరుగుతున్న పోలింగ్‌ సిబ్బంది శిక్షణా తరగతులను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణకు రాని పోలింగ్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలి విడత శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి సంజాయిషీ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. కరోనా సోకిన, గర్భంతో ఉన్న పోలింగ్‌ సిబ్బంది ఈ శిక్షణకు హాజరుకాకపోయినా ఫరవాలేదని ఆయన తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారికి పోలింగ్‌ యంత్రాల పనితీరుకు సంబంధించిన పుస్తకాలను అందజేయనున్నామని చెప్పారు. 


తమిళ అక్షరక్రమంలో అభ్యర్థుల పేర్లు...

నగరపాలక ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలపై తమిళ అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను పొందుపరచనున్నట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. నగరంలో కార్పొరేషన్‌ ఎన్నికలకు 5774 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. వాటిని ఇప్పటికే నగరంలో 22 కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి సమీప ప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఓటింగ్‌ యంత్రాలపై అభ్యర్థుల పేర్లు అంటించే పనులు ప్రారంభమవుతున్నాయి. తొలుత గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు, ఆ తర్వాత మిగిలిన వారి పేర్లను అతికిస్తారు. ఈ ఎన్నికల్లో నోటాకు తావులేదని తెలిపారు.


తపాలా ఓట్లకు 14 వేల దరఖాస్తులు...

ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులకు తపాలా బ్యాలెట్‌ పత్రాలను అందజేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తపాలా ఓట్లువేసేవారి నుంచి దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమయ్యింది. తొలి రోజే 14 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. గురువారం సాయంత్రం వరకూ ఈ దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ తపాలా బ్యాలెట్‌ పత్రాలను పంపిణీ చేయనున్నారు. అందులో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటువేసి కవర్‌లో ఉంచి ఈ నెల 22 లోగా స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులకు పంపాలని అధికారులు తెలిపారు. గడువు తర్వాత వచ్చే తపాల ఓట్లను చెల్లనివిగా ప్రకటిస్తారని చెప్పారు.

Updated Date - 2022-02-11T14:30:38+05:30 IST