నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేడు

ABN , First Publish Date - 2021-05-07T06:40:57+05:30 IST

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను శుక్రవారం ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.

నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేడు

సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఎన్నిక

నకిరేకల్‌, మే 6: నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను శుక్రవారం ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. మున్సిపాలిటీ కార్యాలయం గదులు ఇరుకుగా ఉన్నందున మండల పరిషత్‌ కార్యాలయ హాల్‌లో ఈ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20వార్డులకు టీఆర్‌ఎస్‌ 11, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ 6, కాంగ్రెస్‌ 2, ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. మధ్యాహ్నం మూడు గంటలకు గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వెంటనే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌ రిజర్వేషన్‌ అయింది. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకోసం ఎన్నికల్లో పాల్గొన్న సభ్యుల్లో ఒకరు చైర్మన్‌ను ప్రతిపాదించగా, మరొకరు బల పరుస్తారు. పోటీకి సిద్ధంగా ఉన్న సభ్యుడు తన సంసిగ్థతను తెలియపరుస్తాడు. అదే తరహాలో వైస్‌ చైర్మన్‌ను కూడా ఎన్నుకుంటారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని చైర్మన్‌, వైస్‌చైర్మన్‌గా అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయా పార్టీల గుర్తులపై గెలిచిన అభ్యర్థులకు విప్‌జారీ చేయనున్నారు. ఎన్నికల అధికారిగా నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఎన్నికల పరిశీలకురాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ వాకాటి కరుణ పర్యవేక్షణలో ఎన్నిక జరుగనుంది. ఎన్నిక కోసం మునిసిపల్‌ అధికారులు గురువారం నోటిఫికేషన్‌ జారీచేశారు. కొవిడ్‌ నిబంధనల నడుమ ఎన్నికల నిర్వహించనున్నారు. ఎన్నిక సందర్భంగా పట్టణంలో 144సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

ఓటు వినియోగించుకోనున్న ముగ్గురు ఎక్స్‌అఫీషియో సభ్యులు 

టీఆర్‌ఎ్‌సకు చెందిన వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎంపీ వి.లక్ష్మికాంతారావు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు కోసం ఇప్పటికే వారు దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్‌ ఎన్నిక కోసం మ్యాజిక్‌ ఫిగర్‌ 11 మంది సభ్యులకు, టీఆర్‌ఎస్‌ నుంచి 11మంది అభ్యర్థులే గెలుపొందారు. సభ్యుల్లో ఒక్కరిద్దరు చేజారిపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముగ్గురు ఎక్స్‌అఫీషియో ఓట్లు వేసేలా టీఆర్‌ఎస్‌ నాయకులు రంగం సిద్ధం చేశారు. 

క్యాంపు నుంచి నేరుగా ఎన్నికకు

టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 11మంది అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. నాలుగు రోజుల పాటు క్యాంప్‌ నిర్వహించిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ అభ్యర్థులను నేరుగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు తీసుకురానున్నారు. చైర్మన్‌ పదవికోసం 19వ వార్డు నుంచి గెలిచిన రాచకొండ శ్రీనివాస్‌, 7వ వార్డు నుంచి గెలిచిన కొండ శ్రీను మధ్య పోటీ ఉంది. 11వ వా ర్డు నుంచి గెలుపొందిన ఉమారాణి వైస్‌ చైర్మన్‌ పోటీలో ఉన్నారు.

Updated Date - 2021-05-07T06:40:57+05:30 IST