అధికారంలోకి వస్తే ధరల నియంత్రణ

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని ఎంపీ గల్లా జయదేవ్‌, గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర తెలిపారు.

అధికారంలోకి వస్తే ధరల నియంత్రణ
44వ డివిజన్‌ కన్నసాని నాగలక్ష్మి తరపున ప్రచారం చేస్తున్న ఎంపీ గల్లా, మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి, శ్రావణ్‌ తదితరులు

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ఇక్కట్లు

ఎంపీ గల్లా, టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి

గుంటూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని ఎంపీ గల్లా జయదేవ్‌, గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం 44వ డివిజన్‌ అభ్యర్థి కన్నసాని నాగలక్ష్మికి మద్దతుగా సాకేతపురంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా మాట్లాడుతూ పన్నుల భారాన్ని ప్రజలపై మోపడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుందని, దానిని అడ్డుకుంటామన్నారు. జగన్‌ పాలన ప్రజావేదిక కూల్చివేత విధ్వంసంతో మొదలైందన్నారు. రాజధాని ఎక్కడికి తరలిపోదని మాయమాటలు చెప్పిన జగన్‌ ఇప్పుడు విశాఖకు మార్చడానికి ప్రయత్నించడం ప్రజలను మోసగించడమేనని తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. అనంతరం 46వ డివిజన్‌ గోరంట్లలో అభ్యర్థి నుకవరపు బాలాజీకి మద్దతుగా ఎంపీ గల్లా, శ్రావణ్‌ కుమార్‌, కోవెలమూడి రవీంద్రలు ప్రచారం చేశారు. అందులో భాగంగా అన్నదాన సత్రం నుంచి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు వరకు భారీ రోడ్డు షో నిర్వహించారు. నగరాభివృద్ధి టీడీపీతోనేని నేతలు స్పష్టం చేశారు. అనంతరం గోరంట్ల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.

 ఆత్మరక్షణలో వైసీపీ నేతలు : కోవెలమూడి రవీంద్ర

ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి టీడీపీ అభ్యర్థులకు వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారని టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర(నాని) తెలిపారు. ప్రచారం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ప్రజలు కష్టాలో ఉంటే ఒక్క వైసీపీ నాయకుడు  కూడా పట్టించుకోలేదన్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేదలు ఇబ్బంది పడుతున్నారని ప్రతి డివిజన్‌లో రూ.2 కోట్ల సొంత ఖర్చుతో నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కొర్రీలు వేశారన్నారు. పేదలకు అండగా నిలిచే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌, నేతలు మద్దిరాల మ్యానీ, గంజి చిరంజీవి, చిట్టాబత్తిని చిట్టిబాబు, మానుకొండ శివప్రసాద్‌, వడ్రాణం హరిబాబు,  కనపర్తి శ్రీనివాసరావు, కంచర్ల శ్రీనివాసరావు, ఎలుకా వీరాంజనేయులు, మేళం సైదయ్య బాజి, రాజా, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST