ష్‌.. గప్‌చుప్‌

ABN , First Publish Date - 2021-03-09T04:59:47+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. చివరి వరకు అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఓటరును ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. పాటలు, ఆటలు, డప్పు వాయిద్యాలు, డీజేలతో హోరెత్తించాయి.

ష్‌.. గప్‌చుప్‌
వాయిద్య సామగ్రితో ఇంటికి బయలుదేరిన యువకులు

ప్రచారం సరి.. పంపకాలే మరి!

ముగిసిన మునిసిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం 

ప్రలోభాలకు అభ్యర్థుల వ్యూహం

 చివరి రోజు హోరాహోరీగా అభ్యర్థుల పర్యటనలు


మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. చివరి వరకు అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఓటరును ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. పాటలు, ఆటలు, డప్పు వాయిద్యాలు, డీజేలతో హోరెత్తించాయి. అధికారికంగా సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసినప్పటికీ కొందరు నాయకులు, అభ్యర్థులు తెరవెనుక ప్రచారానికి ప్రణాళిక వేసుకున్నారు. ప్రలోభాల వల విసురుతున్నారు. ప్రధానంగా ఎన్నికలకు ఒకరోజు ముందు పంపకాలకు సిద్ధమయ్యారు. డబ్బు, మద్యంతో పాటు నిత్యావసరాలు, చీరలు, ఇతర బహుమతులను పెద్దఎత్తున అందజేయాలనుకుంటున్నట్టు తెలిసింది. గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వారు వెనుకాడడం లేదు. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌, విజయనగరం క్రైం, మార్చి 8:

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను టీడీపీ జనంలోకి తీసుకెళ్లగా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అధికార పక్షం ప్రచారం చేసుకుంది. అదే సమయంలో ఎవరికి వారు స్థానిక సమస్యలపై హామీలు ఇస్తూ.. ప్రత్యర్థులపై ఆరోపణలు సంధిస్తూ ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఓ దశలో తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ తంతుకు ఫుల్‌స్టాప్‌ పడింది. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం పర్వానికి గడువు ముగిసింది. సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రచార రథాలు ఇళ్లకు చేరాయి. చివరి క్షణాల్లో కూడా కొంతమంది బాణ సంచా కాల్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆఖరి రోజున కూడా అభ్యర్థులు భారీ స్థాయిలో జానాన్ని మోహరించారు. వారికి కూలి డబ్బులు చెల్లించి మరీ వెనుక తిప్పారు. మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్లు అందించి రూ.500 చేతిలో పెట్టి పంపించారు.  ప్రధాన పార్టీల నుంచి రెబల్స్‌గా ఉన్న వారు సైతం పంపిణీకి వెనుకాడలేదు. చేతనైనంత ఖర్చు చేశారు. మంగళవారం పెద్ద ఎత్తున పంపకాలు జరిగే అవకాశం ఉంది. పోటీలో ఉన్న వారు గుట్టుగా సరంజామాను కొనుగోలు చేసి ఓ చోట ఉంచారు. వాటిని కొందరు నమ్మకస్తుల ద్వారా రెండో కంటికి కనిపించకుండా ఓటర్లకు చేర్చాలని కూడా నిర్దేశించారు. ప్రచారంలో పాల్గొన్న వారికి ఇప్పటికే ఒక విడత పంపకాలు పూర్తి చేశారు. మందు బాటిళ్ల పంపిణీ పెద్దఎత్తున సాగుతోంది.  

 చెల్లని ఓట్ల శాతం ఈసారైనా తగ్గేనా?

పంచాయతీ ఎన్నికల్లో 33వేల పైచిలుకు చెల్లని ఓట్లు నమోదయ్యాయి. కొన్నిచోట్ల ఓటమి చవిచూసిన ఓట్ల తేడా కంటే రెట్టింపు ఓట్లు చెల్లనవిగా పక్కకు తీసేశారు. ఈ స్థాయిలో ఓట్లు బుట్టదాఖలా కాకుండా ఓటర్లకు ఒకరోజు ముందు అయినా అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. పోలింగ్‌ రోజున ఓటర్లకు అక్కడున్న సిబ్బంది బేలట్‌ పత్రాలను ఇబ్బంది లేకుండా మడత పెట్టి ఇస్తున్నా కొంత మంది వేరేలా ఫోల్డింగ్‌ చేస్తున్న కారణంగా ఇతర గుర్తులపై ఇంకు మరకలు అంటుతున్నాయి. అవి చెల్లని ఓట్లుగా మిగులుతున్నాయి. వాస్తవంగా స్వస్తిక్‌ గుర్తు స్పష్టంగా పడి వేరే చోట చిన్న ఇంకు అంటినా ఇబ్బంది లేదు కాని అక్కడున్న ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేసేటప్పుడే ఓటరు తగిన జాగ్రత్తలు పాటించాలి. మున్సిపల్‌ ఎన్నికల్లో అయినా చెల్లని ఓట్ల శాతాన్ని తగ్గించేందుకు ఎన్నికల అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తే బావుంటుందని సీనియర్‌ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్యాలెట్‌ ఇచ్చినపుడు ఓటరుకు స్పష్టంగా చెబితే కొంతవరకు చెల్లని ఓట్లను తగ్గించే అవకాశం ఉంది. 

కంట్రోల్‌ రూం ప్రారంభం 

మున్సిపల్‌ పోలింగ్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు.  కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం రాత్రి కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటం వల్ల సమాచారం రావడంలో ఇబ్బంది ఉండదన్నారు. గత ఎన్నికల్లో వెలుగుచూసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో డీపీవో సునీల్‌రాజకుమార్‌, సీపీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మందు బంద్‌

జిల్లాలో నగరపాలక సంస్థ, మున్సిపల్‌, నగర పంచాయతీకి పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్‌ అధికారులు సీల్‌ వేశారు. 33 మద్యం షాపులు, 28 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లను ముందస్తు చర్యల్లో భాగంగా మూసివేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్‌, ఎస్‌ఈబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ సోమవారం సాయంత్రం నుంచి నిఘా పెట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హెచ్చరించారు. 

ఎన్నికల సిబ్బంది కేటాయింపు 

ఎన్నికల నిర్వహణకు ర్యాండమ్‌ పద్ధతిలో సిబ్బందిని కేటాయించారు. స్థానిక ఎన్‌ఐసీలో ఈ ప్రక్రియను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికలను సక్రమంగా, సజావుగా నిర్వహించేందుకు 123 మంది సూక్ష్మ పరిశీలకులు, 2171 మంది పీవోలు, ఏపీవో, ఓపీవోలను కేటాయించారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు పాల్గొన్నారు. 




Updated Date - 2021-03-09T04:59:47+05:30 IST