ఎన్నికలతో 1500శాతం కేసులు

ABN , First Publish Date - 2021-04-22T07:35:52+05:30 IST

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. వేలాది మందితో రోడ్డు ర్యాలీలు.. లక్షలాది మందితో బహిరంగ సభలు! ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు.. అన్ని పార్టీలదీ అదే బాట!! ప్రచారంలో పాల్గొనే నేతల ముఖాలకు మాస్కులు ఉండవు. ర్యాలీలు, సభల్లో పాల్గొనే ప్రజల ముఖాలకూ మాస్కులు ఉండవు...

ఎన్నికలతో 1500శాతం కేసులు

  • పశ్చిమబెంగాల్‌లో నెలరోజుల్లో భారీగా పెరుగుదల
  • మార్చి 11న యాక్టివ్‌ కేసులు 3,110.. ఇప్పుడు 53 వేలు
  • తమిళనాట పెరుగుదల 62 శాతం.. అసోంలో 230శాతం
  • ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో చేసిన టెస్టులూ తక్కువే
  • కరోనా కేసులు భారీగా నమోదవుతున్న మహారాష్ట్రలో
  • ఆ సమయంలో పెరిగిన కేసులు 19.79 శాతమే!
  • సాగర్‌ నియోజకవర్గంలోనూ రికార్డుస్థాయి కేసులు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. వేలాది మందితో రోడ్డు ర్యాలీలు.. లక్షలాది మందితో బహిరంగ సభలు! ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు.. అన్ని పార్టీలదీ అదే బాట!! ప్రచారంలో పాల్గొనే నేతల ముఖాలకు మాస్కులు ఉండవు. ర్యాలీలు, సభల్లో పాల్గొనే ప్రజల ముఖాలకూ మాస్కులు ఉండవు. భౌతికదూరం పాటించడం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ 29 దాకా ఎనిమిది దశలపాటు సుదీర్ఘంగా ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌లో.. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తమిళనాడు, కేరళ, అసోంలో.. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఈ నిర్లక్ష్యంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క బెంగాల్‌లోనే నెలరోజుల వ్యవధిలో కేసుల సంఖ్య ఏకంగా 1500 శాతం పెరిగింది. మార్చి 11 నాటికి బెంగాల్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య కేవలం 3,110. ఆ తర్వా నుంచి భారీగా పెరిగి.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 53 వేలకు చేరింది. కరోనా ఉధృతి పెరగడానికి అనేక కారణాలు ఉండొచ్చుగానీ.. ఎన్నికల ర్యాలీలు, సభలు ప్రధాన కారణమనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. గణాంకాలే ఇందుకు రుజువు. ఇప్పటిదాకా అక్కడ ఐదు దశల్లో 16 జిల్లాల్లో పోలింగ్‌ జరిగింది. వాటిలో కొన్ని ప్రధానమైన జిల్లాల్లో కేసుల 


సంఖ్యను పరిశీలిస్తే..


  1. దాదాపు 29 లక్షల జనాభా ఉన్న పురూలియా జిల్లాలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశ ఎన్నికలు మార్చి 27న, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్‌ 1న జరిగాయి. ప్రధాని మోదీ ఎన్నికల సభ జరిగిన మార్చి 18 నాటికి ఆ జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 35. అప్పట్నుంచ మార్చి 27 దాకా అన్ని పార్టీల సభలు, రోడ్‌షోలు జరిగాయి. మార్చి 22 నుంచి అక్కడ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల తర్వాత.. ఇప్పుడక్కడ యాక్టివ్‌ కేసులు 1200. అంటే దాదాపు 34 రెట్లు పెరిగాయి.
  2. దక్షిణ 24 పరగణాల జిల్లాలో మార్చి 14న టీఎంసీ నేత ఒకరు స్థానిక రైల్లో ప్రచారం చేశారు. ఆ తర్వాత పలు పార్టీల నేతలు భారీగా సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. అక్కడ మార్చి 14 నాటికి యాక్టివ్‌ కేసులు 126. తొలి దశ ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 1 నాటికి అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అలాగే.. హౌరాలో ఫిబ్రవరి 17 నాటికి యాక్టివ్‌ కేసులు 84. అప్పట్నుంచే అక్కడ ఎన్నికల సందడి ప్రారంభమైంది. నెల తిరిగేసరికి యాక్టివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. మొదటి దశ ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 6 నాటికి యాక్టివ్‌ కేసులు 1000 దాటేశాయి. ఇక హూగ్లీ జిల్లాలో మార్చి 17న 81 యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పుడా సంఖ్య 500 దాటేసింది.
  3. ఉత్తర 24 పరగణాల జిల్లాలో మార్చి 22 నాటికి యాక్టివ్‌ కేసులు 3,420 కాగా.. ఇప్పుడా సంఖ్య 14,220కి చేరుకుంది. ఐదు దశల ఎన్నికలు ముగిసేనాటికే ఈ పరిస్థితి ఉంటే, మిగతా మూడు దశలూ ముగిసేసరికి ఎన్నికేసులు నమోదవుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.


ఇతర రాష్ట్రాల్లో..

ఎన్నికల ప్రచారం దెబ్బకు తమిళనాడులో.. యాక్టివ్‌ కేసులు 62 శాతం మేర పెరిగితే, అసోంలో 230 శాతం పెరిగాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల పెరుగుదల 60.64 శాతం. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఆ సమయంలో యాక్టివ్‌ కేసుల పెరుగుదల కేవలం 19.79 శాతం. అంటే.. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల సభలు, ర్యాలీలు కేసుల ముప్పును ఎంతగా పెంచేశాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్యను భారీగా తగ్గించేశారు. టెస్టులు తగ్గిస్తేనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే.. టెస్టులు అంతకుముందులాగానే భారీగా చేసి ఉంటే ఇంకా పెద్ద సంఖ్యలో కేసులు బయటపడేవని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు.. అసోంలో మార్చి 17న 13 వేలకు పైగా టెస్టులు చేశారు. మార్చి చివరికి వచ్చేసరికి టెస్టుల సంఖ్య 5,300కు పడిపోయింది. ఏప్రిల్‌ 4న 7,075 టెస్టులు చేయగా.. ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 6న 17 వేలకు పైగా టెస్టులు చేశారు. ఆ తర్వాత నుంచి టెస్టుల సంఖ్య పెంచారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 17 దాకా అసోంలో కేవలం 643 కేసులు నమోదు కాగా.. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 19 నడుమ 7,950 కేసులు నమోదయ్యాయి. అటు బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి. డిసెంబరు నాటికి రోజుకు 40 వేలకు పైగా టెస్టులు చేసిన బెంగాల్‌లో మార్చి 15న చేసింది కేవలం 13,370 టెస్టులు. జనవరి 15 నుంచి మార్చి 15 నడుమ బెంగాల్‌లో నమోదైన కేసులు 14 వేలు. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 19 నడుమ నమోదైనవి.. ఏకంగా 89,700 కేసులు. తమిళనాట మార్చి 1 నుంచి 15 వరకూ 8000 కేసులు నమోదు కాగా.. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 నడుమ 29 వేల కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 1-19 నడుమ 1.13 లక్షల మందికి పాజిటివ్‌ వచ్చింది. కేరళలో మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 1 దాకా 66 వేల కేసులు నమోదు కాగా.. ఏప్రిల్‌ 1 నుంచి 19 నడుమ 1.26 లక్షల కేసులు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో చాలా మంది వైరస్‌ బారిన పడి, వారి నుంచి ఇతరులకు సోకడమే ఇందుకు కారణం. ఎన్నికల కౌంటింగ్‌ మే 2న జరిగే సంగతేమోగానీ.. ఎన్నికల దెబ్బకు ఆయా రాష్ట్రాల్లో ఆ రోజుకు కేసుల కౌంటింగ్‌ మాత్రం భారీగా పెరిగిపోతుందనే ఆందోళన వైద్యనిపుణుల్లో వ్యక్తమవుతోంది.

కొసమెరుపు: బెంగాల్‌లో కరోనా వ్యాప్తికి బీజేపీ కుట్ర పన్నుతోందని, బయటివారిని రాష్ట్రంలోకి తెస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తారు. లాక్‌డౌన్‌ వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిస్తారు. ‘నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనను’ అని రాహుల్‌ గాంధీ ప్రకటిస్తారు. కానీ.. అన్ని పార్టీల నాయకులూ మాత్రం యథావిధిగా ప్రచారంలో పాల్గొంటారు. కేసులు పెరగడానికి కారణమవుతారు. అది అసలు వైచిత్రి.



బిహార్‌ ఎన్నికలప్పుడూ..

కిందటి సంవత్సరం అక్టోబరు 28 నుంచి నవంబరు 7 దాకా మూడు దశల్లో బిహార్‌ ఎన్నికలు జరిగాయి. సెప్టెంబరు 23 నాటికి అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1.73 లక్షలు. అక్టోబరు 30 నాటికి అది 2.15 లక్షలకు చేరింది. నవంబరు 28 నాటికి 2.33 లక్షలైంది.



నాగార్జున సాగర్‌లోనూ..

ఇటీవలే ఉప ఎన్నిక జరిగిన నాగార్జునసాగర్‌లో భారీగా ‘పాజిటివ్‌’లు బయటపడుతున్నాయి. ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక జరగ్గా.. దానికి 45 రోజుల ముందు నుంచీ అన్ని పార్టీలూ విస్తృతంగా ప్రచారం చేశాయి. దాంతో అక్కడ కేసులు పెరుగుతూ వచ్చి, ఇప్పుడూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక.. త్వరలోనే మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్న మరో ఏడు ప్రాంతాల్లోనూ కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ముగిసే సమయానికి పెద్దపెద్ద వైరస్‌ సామూహిక విస్ఫోటాలు జరగొచ్చని వైద్యశాఖ అంచనా. ఈ ప్రాంతాల్లో పార్టీలు, ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి చేజారొచ్చని హెచ్చరిస్తోంది. 

Updated Date - 2021-04-22T07:35:52+05:30 IST