ఎన్నికల నియమావళిని పాటించాలి

ABN , First Publish Date - 2021-02-28T05:37:21+05:30 IST

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు.

ఎన్నికల నియమావళిని పాటించాలి

ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పీజేపాటిల్‌

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 27: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఏజెంట్లతో శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5లక్షల 5వేల 565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారని, అందుకు 731 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్‌లెవల్‌ ఏజెంట్ల జాబితాను సమర్పించాలన్నారు. బూత్‌లెవల్‌ ఏజెంట్లు ఓటర్‌ సమాచార స్లిప్‌ల పంపిణీలో బీఎల్‌వోలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్‌ ఏజెంట్ల నియామకానికి ఫారాలను ముందే సమర్పించాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు పోలింగ్‌ తేదీ 14న ఉదయం 6 గంటలకు ప్రిసైడింగ్‌ అధికారిని కలవాలన్నారు. కౌటింగ్‌ ఏజెంట్ల నియామకానికి మార్చి 5లోగా ఫాం-18లో పోలీస్‌ శాఖ వెరిఫికేషన్‌ నిమిత్తం అందజేయాలన్నారు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, కొవిడ్‌ అనుమానితులు, బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీచేస్తామన్నారు. ఏఆర్‌వోలు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ, సేకరణ సమాచారాన్ని అభ్యర్థులకు అందజేస్తారని తెలిపారు. 12 జిల్లాలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను గుర్తించామని, నల్లగిండలో గిడ్డంగుల సంస్థ గోదాంలో రిసెప్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులు ఈ ‌రిసెప్షన్‌ కేంద్రానికి చేరుతాయని తెలిపారు. అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన అనుమతులను ఆయా జిల్లాల ఏఆర్‌వోలు జారీ చేస్తారని తెలిపారు. పోలింగ్‌కు 48గంటలముందు మార్చి 12వ తేదీ సాయంత్రం 4గంటలలోపు ప్రచారాన్ని నిలిపివేయాలన్నారు. 12 జిల్లాల్లో మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఎలకా్ట్రనిక్‌ మీడియా, లోకల్‌ ఛానళ్లలో ప్రచారానికి అనుమతి కోసం ఈ కమిటీకి ప్రసారం తేదీకి మూడు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల వ్యయపరిమితి లేదని, ఫిర్యాదులు, సమాచారం కోసం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 1950 నంబర్‌తో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకుడిగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యసాచి ఘోష్‌ను ఎన్నికల సంఘం నియమించినట్లు తెలిపారు. కౌటింగ్‌ కేంద్రం నల్లగొండలోని గిడ్డంగుల సంస్థ గోదాంలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-02-28T05:37:21+05:30 IST