దురహంకారానికి చెంపపెట్టు!

ABN , First Publish Date - 2021-11-15T06:44:35+05:30 IST

అధికార అహంకారంతో బలవంతపు ఏకగ్రీవాలకు తెగపడిన అధికార పక్షానికి ఆదివారం జరిగిన నాలుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఓటర్లు తీర్పు నిచ్చారు.

దురహంకారానికి చెంపపెట్టు!

ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దంపట్టిన పంచాయతీల ఎన్నికలు 

నాలుగు పంచాయతీలకు ఎన్నిక

రెండింట్లో సత్తా చాటిన టీడీపీ 

అధికార పక్షం బెదిరింపులతో తగ్గిన పోలింగ్‌ 

ఓటర్ల తీర్పుతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం 


అధికార అహంకారంతో బలవంతపు ఏకగ్రీవాలకు తెగపడిన అధికార పక్షానికి ఆదివారం జరిగిన నాలుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఓటర్లు తీర్పు నిచ్చారు. ఆదివారం జిల్లాలో జరిగిన నాలుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఇద్దరు సర్పంచ్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు. జిల్లా మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలోనే అధికార పక్షానికి పరాభవం ఎదురైంది. టీడీపీ బలపరిచిన అభ్యర్థినిని పోటీ చేయనీయకుండా ఉండటానికి అధికారపక్షం పన్నిన కుయుక్తులను ఓటర్లు తిప్పికొట్టారు. మంత్రి ఇలాకాలో ‘పోటీకి తావులేదు.. ఏకగ్రీవం కావాల్సిందే..’  అనే నేతల అహంకారానికి ఓటర్లు తగిన పాఠం చెప్పారు. 



(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో నాలుగు గ్రామ పంచాయతీలకు జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ  పెట్టడం కోసం అధికార పక్షం అర్థ, అంగ బలాలను ప్రయోగించింది. ఓటుకు రూ.3 నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసింది. దీంతోపాటు తాము బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లు వేసేవారిని బెదిరించే ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, అధికార పక్షానికి పరాభవం తప్పలేదు. నందివాడ మండలం పోలుకొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆర్థిక, అంగ బలాన్ని ఢీ కొని మరీ అక్కడ టీడీపీ బలపరిచిన అభ్యర్థిని మానేపల్లి ఝాన్సీకుమారి, వైసీపీ బలపరిచిన అభ్యర్థిని మానేపల్లి అలివేలుపై 27 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఘంటసాల మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ  ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బెల్లంకొండ అమలేశ్వరరావు, తన సమీప అభ్యర్థి, వైసీపీ బలపరిచిన డొక్కు కృష్ణకుమారిపై 143 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ పంచాయతీని కూడా అధికారపక్షం ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. పోటీ తప్పని పరిస్థితి ఏర్పడటంతో ప్రలోభాలు, బెదిరింపుల పర్వానికి తెర తీసింది. అయినప్పటికీ అధికారపక్ష కుయుక్తులను ఓటర్లు తిప్పి కొట్టారు. ముదినేపవల్లి మండలంలోని ములకలపల్లి గ్రామ పంచాయతీలో  57 ఓట్ల తేడాతో టీడీపీ బలపరిచిన అభ్యర్థిని కంటిపూడి కార్తీకపై వైసీపీ బలపరిచిన నువ్వుల కోటేశ్వరరావు గెలుపొందారు. ఈ మండలంలో కూడా అఽధికార పక్షం డబ్బులను వెదజల్లింది. మద్యాన్ని పారించింది. ఇటువంటి కుయుక్తుల మధ్య కార్తీక పోరాడి ఓడారు. కలిదిండి గ్రామ పంచాయతీకి జరిగిన పోరులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి మసిమక్కుల మారుతీ ప్రసన్న తన సమీప అభ్యర్థిని, టీడీపీ బలపరిచిన లంకా రమా సుజాతపై 249 ఓట్ల తేడాతో  గెలుపొందారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లాలో మొత్తం ఐదు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా కలిదిండి మండలం అమరావతి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది. ఇక వార్డు మెంబర్లకు సంబంధించి ఆగిరిపల్లి, కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి, మోపిదేవి మండలంలోని కోసూరివారి పాలెం వార్డుల్లో టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన ఎనిమిది వార్డుల్లో ఆగిరిపల్లి మండలంలోని చిన్న ఆగిరిపల్లి, నూజివీడు మండలం బోర్వంచ, చల్లపల్లి మండలంలోని ఆముదాల్లంక, బంటుమల్లి మండలంలోని ఆర్తమూరు, పెడన మండలంలోని నేలకొండవల్లి, ఘంటసాల మండలం దాలిపర్రు, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, కలిదిండి మండలం కోరుకొల్లు వార్డుల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలను సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. టీడీపీ శ్రేణులు ముందుగా భావించిన ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. 


పోలింగ్‌ ప్రక్రియ ఇలా...

జిల్లాలో మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం జరిగిన పోలింగ్‌లో 14,027 మంది ఓటర్లకు గాను 11,008 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదైంది. కలిదిండి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి జరిగిన ఎన్నికలో 6,718 ఓట్లకు గాను 5,159 పోలయ్యాయి. నందివాడ మండలం పోలుకొండ సర్పంచ్‌ స్థానానికి 2,270 ఓట్లకుగానూ, 1,681 మంది, ఘంటసాల మండలం మల్లంపల్లిలో 1,818 మంది ఓటర్లకు గానూ, 1,624 మంది, ముదినేపల్లి మండలం ములకలపల్లిలో 526 మంది ఓటర్లకు గాను 466 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన 11 వార్డు స్థానాల్లో 2,632 మంది ఓటర్లకు గాను 2,078 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


పోలింగ్‌పై అధికారపక్షం బెదిరింపుల ప్రభావం  

జిల్లావ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీల్లో ఆదివారం జరిగిన నాలుగు సర్పంచ్‌, 11 వార్డు సభ్యుల ఎన్నికలపై అధికార పక్షం బెదిరింపుల ప్రభావం కనిపించింది. జిల్లాలో అన్ని పంచాయతీలనూ ఏకగ్రీవం చేసేందుకు కుయుక్తులు పన్నిన అధికార పక్షం ఆశలు ఫలించలేదు. పోటీ తలెత్తటం వల్ల వ్యతిరేక ఓట్లు వేసే వారిపై అధికార పక్షం గురి పెట్టింది. ఈ కారణంగా పోలింగ్‌ శాతం కొంత తగ్గిందనే చెప్పాలి. 78.48 శాతం పోలింగ్‌ నమోదవడం దీనికి నిదర్శనం. అధికారపక్షం బెదిరింపులు లేకపోతే పోలింగ్‌ శాతం పెరిగేదనేది పరిశీలకుల అంచనా. 




Updated Date - 2021-11-15T06:44:35+05:30 IST