మోగిన ‘వాయిదా’ ఎన్నికల నగారా

ABN , First Publish Date - 2021-11-02T06:27:21+05:30 IST

జిల్లాలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది.

మోగిన ‘వాయిదా’ ఎన్నికల నగారా

పెనుకొండ నగర పంచాయతీకి ఎన్నికలు

రేపటి నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

6న పరిశీలన... 8న ఉపసంహరణ

15న పోలింగ్‌..16న రీపోలింగ్‌...

17న ఓట్ల లెక్కింపు... ఫలితాల వెల్లడి

అనంతపురం, నవంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది.  సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. జిల్లాలో పెనుకొండ నగర పంచాయతీతో పాటు అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన, రాయదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని 1వ వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని చిలమత్తూరు జడ్పీటీసీ స్థానంతో పాటు 16 ఎంపీటీసీలు, 4 సర్పంచ స్థానాలతో పాటు ఆయా మండలాల్లోని పంచాయతీ పరిధిలోని 175 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ మేరకు ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 6న నామినేషన్ల పరిశీలన, 8న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. వారం రోజుల పాటు అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు వెసులుబాటిచ్చారు. ఈ నెల 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎక్కడైనా  పోలింగ్‌ వాయిదా పడితే ఆ స్థానాల్లో 16న రీపోలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ ప్రకటించారు. 17న ఓట్ల లెక్కింపు చేపట్టడంతో పాటు అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి ఈ ఎన్నికలు సవాలుగా మారాయనడంలో సందేహం లేదు. ఈ నగర పంచాయతీలో 20 వార్డులున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, టీడీపీ ముఖ్య నాయకులు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలై ఉన్నారు. 


అనంతలో ఒక డివిజన, రాయదుర్గంలో ఒక వార్డు స్థానానికి ఎన్నికలు...

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన కార్పొరేటర్‌గా వైసీపీ అభ్యర్థి చింతకుంట పద్మావతి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత కొద్దిరోజులకే అనారోగ్యంతో ఆమె చనిపోయారు. దీంతో 17వ డివిజనకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాయదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని 1వ వార్డు నుంచి భీమనపల్లి సావిత్రమ్మ వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కౌన్సిలర్‌గా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో ఆ వార్డుకు ఎన్నిక అనివార్యమైంది.  


చిలమత్తూరు జడ్పీటీసీ స్థానానికి ...

ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చిలమత్తూరు జడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా గొల్ల వినోదమ్మ నామినేషన వేశారు. ఆ క్రమంలో ఆమె తనను గెలిపించాలంటూ ప్రచారమూ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.  ఈ ఎన్నికలు ఈ ఏడాది మేలో నిర్వహించారు. అయితే ఎన్నికలకు ముందే ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో చిలమత్తూరు జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈ ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన నోటిఫికేషన విడుదల చేసింది. 


13 మండలాల్లో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

జిల్లాలోని 13 మండలాల్లో 16 ఎంపీటీసీ స్థానాలకు గడిచిన ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించలేదు. వివిధ కారణాలతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదివరకూ ఎన్నికల్లో వాయిదా పడిన 16 ఎంపీటీసీ స్థానాలకుగానూ 10 స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికలకు ముందే చనిపోయారు. మరికొందరు ఎన్నికల అనంతరం వివిధ కారణాలతో పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యం లోనే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికలు నిర్వహించనున్న చిలమత్తూరు జడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఈ నెల 3 నుంచి 5 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 6న నామినేషన్లు పరిశీలిస్తారు.  అభ్యంతరాలుంటే 7వ తేదీన అప్పీలు చేసుకునేందుకు అవకాశాలు కల్పించారు. ఈ నెల 9 వరకూ నామినేషన్లు వితడ్రాకు సమయం కల్పించారు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 16న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్‌కు అవకాశం ఉంటే 17న నిర్వహిస్తారు. 18న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. 


సర్పంచ, వార్డు స్థానాలకు....

జిల్లాలో వివిధ కారణాలతో వాయిదా పడిన, సర్పంచ, వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులు కొందరు చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 4 సర్పంచ, 175 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో లేపాక్షి మండలంలోని కంచిసముద్రం, పుట్లూరు మండలంలోని కందిగోపుల, రొద్దం మండలంలోని చిన్నమంతూరు, శెట్టూరు మండలంలోని కైరేవు సర్పంచ స్థానాలున్నాయి. వీటితో పాటు 35 మండలాల్లోని పంచాయతీల పరిధిలో 175 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 6వ తేదీ నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నారు. 14న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్‌కు అవకాశమున్న పక్షంలో ఈ నెల 15న నిర్వహించి అదే రోజే ఫలితాలు ప్రకటించనున్నారు.



పెనుకొండ పోరుపై టీడీపీ గురి

ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు...

8 మందికి కమిటీలో చోటు


అనంతపురం వైద్యం, నవంబరు1:పెనుకొండ నగర పంచాయతీ పోరుపై టీడీపీ గురి పెట్టింది. ఎన్నికల కమిషన షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లా టీడీపీ నేతలు ప్రధానంగా పెనుకొండ మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పెనుకొండ కోటపై పసుపు జెండా ఎగురవేయాలని నేతలు సమష్టి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం పెనుకొండలో జిల్లా టీడీపీ కీలక నేతలు సమావేశమై ఎన్నిక ప్రణాళికపై చర్చించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలు ఈ ఎన్నికపై మళ్లీ సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికలు ఎదుర్కోవడానికి, అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవడానికి వ్యూహాత్మకంగా సాగేందుకు నేతలు సన్నద్ధమయ్యారు. అందరినీ సమన్వయం చేసుకొని వెళ్లడానికి ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం ఎనిమిది మందికి అవకాశం కల్పించారు. ఇందులో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత,  పల్లె రఘునాథ్‌రెడ్డి, జిల్లా టీడీపీ పరిశీలకులు బీటీ నాయుడు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి,  గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన ఉన్నారు. ఈ కమిటీ ఎన్నికలు ముగిసే వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయం కోసం అవసరమైన వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగనుంది. మొత్తం మీద పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికను అనంత తెలుగు తమ్ముళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

Updated Date - 2021-11-02T06:27:21+05:30 IST