సింహగిరిపైకి ఎలక్ట్రిక్‌ బస్సులు?

ABN , First Publish Date - 2022-01-22T06:22:34+05:30 IST

సింహాచలం కొండపైకి ఎలక్ర్టిక్‌ (ఈ) బస్సులు నడపాలని దేవస్థానం యోచిస్తోంది. అప్పన్న సన్నిధిలో కాలుష్యం తగ్గించడానికి డీజిల్‌ బస్సులు స్థానే కాలుష్య రహితమైన ఈ-బస్సులు వేస్తే ఎలా ఉంటుందో, ఎంత వ్యయం అవుతుందో అంచనాలు రూపొందించాలని దేవస్థానం చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు సూచించారు.

సింహగిరిపైకి ఎలక్ట్రిక్‌ బస్సులు?

ప్రాజెక్టుపై నివేదిక సమర్పించాల్సిందిగా చైర్మన్‌ ఆదేశం

త్వరలో బోర్డు సమావేశంలో చర్చ

అప్పన్న సన్నిధిలో కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యం

రోప్‌వేను కూడా ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని పలువురి సూచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం కొండపైకి ఎలక్ర్టిక్‌ (ఈ) బస్సులు నడపాలని దేవస్థానం యోచిస్తోంది. అప్పన్న సన్నిధిలో కాలుష్యం తగ్గించడానికి డీజిల్‌ బస్సులు స్థానే కాలుష్య రహితమైన ఈ-బస్సులు వేస్తే ఎలా ఉంటుందో, ఎంత వ్యయం అవుతుందో అంచనాలు రూపొందించాలని దేవస్థానం చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు సూచించారు. ఈ మేరకు ఈఓ సూర్యకళ గత ఐదేళ్లలో డీజిల్‌ కోసం వెచ్చించిన వ్యయం, బస్సుల నిర్వహణ ఖర్చులు తదితరాలన్నింటినీ బయటకు తీశారు. అలాగే దేవస్థానం సొంతంగా నిర్వహిస్తున్న ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంటు ద్వారా ఎంత విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది? అందులో ఎంత వినియోగించి, ఎంత గ్రిడ్‌కు ఇస్తున్నదీ ఆమె పొందుపరిచారు. వీటన్నింటినీ రాబోయే   బోర్డు సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారు.


రోజూ కొండపైకి నాలుగు బస్సులు

సింహాచలం దేవస్థానానికి ఐదు బస్సులు ఉన్నాయి. అందులో ఒకటి మూలకు చేరింది. నాలుగు మాత్రమే తిరుగుతున్నాయి. సగటున ఒక్కో బస్సు నెలకు ఆరు వేల కి.మీ. దూరం తిరుగుతోంది. ఒక్కో బస్సుకు నెలకు సగటున 1,500 లీటర్ల డీజిల్‌ అవుతోంది. గత ఐదేళ్లలో నాలుగు బస్సులు తిరిగిన దూరం, వాటికి వినియోగించిన డీజిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్కటి లీటరు డీజిల్‌కు 3.7 కి.మీ. దూరం ప్రయాణిస్తున్నాయి. ఇవి పూర్తిగా కొండ కింద నుంచి కొండ మీదకు మాత్రమే తిరగడం, ఆ మార్గం అంతా ఘాట్‌ రోడ్‌ కావడంతో మైలేజీ ఎక్కువగా రావడం లేదు. 


ఈ-బస్సు ఖరీదు రూ.1.5 కోట్లు

దేవస్థానం చైర్మన్‌ ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వ పథకం ఫేమ్‌-2 కింద ఎలక్ర్టిక్‌ బస్సులను సమకూర్చుకోవడానికి అందుబాటులో వున్న అన్ని మార్గాలను అధికారులు అన్వేషించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇదే ఆలోచనతో 50 ఈ-బస్సులు తిప్పడానికి యోచిస్తోంది. తొమ్మిది మీటర్ల పొడవు, డ్రైవర్‌తో కలిసి 36 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ-బస్సు ఖరీదు రూ.1.5 కోట్లుగా ఉంది. అదే ఏడు మీటర్ల పొడవు, 25 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సు అయితే రూ.1.45 కోట్లు. వీటికి చార్జర్‌ కోసం రూ.5 లక్షలు అదనంగా చెల్లించాలి. నిర్వహణ వ్యయం అదనం. 


పీటీడీ ద్వారా ప్రయత్నం

పీటీడీగా మారిన ఆర్‌టీసీ కూడా ఈ-బస్సుల కోసం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ కంపెనీని సంప్రతించింది. ఘాట్‌రోడ్డులో ఈ-బస్సు తిప్పడానికి కిలోమీటర్‌కు రూ.45.76 అవుతుందని, నెలకు కనీసం 91 వేల కి.మీ. తిప్పాల్సి వుంటుందని ఆ కంపెనీ పేర్కొన్నట్టు తెలిసింది.  


ఈ-బస్సులతో ఆర్థిక భారం

ఈ-బస్సులు కొనుగోలు చేయాలంటే..ప్రథమంగా నాలుగు బస్సులకు కలిపి రూ.6 కోట్లు వెచ్చించాలి. నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుందని పీటీడీ వర్గాలు చెబుతున్నాయి.  


ప్రత్యామ్నాయంగా రోప్‌వే

కాలుష్యం లేకుండా ఉండాలన్నా, వ్యయం తగ్గించుకోవాలన్నా కొండపైకి రోప్‌వే కూడా ఒక ప్రత్యామ్నాయంగా వుంటుందని పలువురు సూచిస్తున్నారు. కైలాసగిరిపైకి వీఎంఆర్‌డీఏ రోప్‌వే నిర్వహిస్తోంది. అప్పన్న కొండపైకి కూడా అలా వేస్తే ఎలా వుంటుందో ఆలోచించాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-01-22T06:22:34+05:30 IST