చీకట్లో విద్యుత్ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-06-21T06:22:46+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు గడిచినా, 84 మంది రాష్ట్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో ఉంది....

చీకట్లో విద్యుత్ ఉద్యోగులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు గడిచినా, 84 మంది రాష్ట్రస్థాయి విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ 82వ సెక్షన్ ప్రకారం ఇరు రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఒక సంవత్సర కాలంలో ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలి. అలాంటిది మొండి పట్టుదలతో, నిర్లక్ష్యంతో ఉద్యోగులను రోడ్డున పడేసి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ప్రజాధనాన్ని వృథాచేస్తున్నారు. న్యాయస్థాన వ్యాజ్యాలకు కోట్ల రూపాయలు ప్రభుత్వాలు వెచ్చించటమే కాక, అటు ఉద్యోగులతో కూడా ఖర్చు చేయిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ 84 మంది విద్యుత్ ఉద్యోగులను రోడ్డున పడేసి దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయినా వారికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. సంవత్సరాల తరబడి జీతాలు రాకుంటే ఉద్యోగులు జీవించటం ఎలా? ఇఎంఐలు, పిల్లల స్కూల్-/కాలేజ్ ఫీజులు కట్టలేక, వైద్యఖర్చులను తట్టుకోలేక తీవ్రమైన ఇబ్బందిపడుతూ మానసికంగా కుంగిపోతున్నారు. కరోనా కాలంలో వీరిలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినా వారికి వైద్య సహాయం కాని, వారి భార్యాబిడ్డలకు ఆర్థిక సహాయం కాని అందలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కష్టకాలంలో ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన ఇంజనీర్స్ అసోసియేషన్లు కొన్ని స్వార్ధబుద్ధితో వ్యవహరించి ఈ సమస్యను ఇంకా ఇబ్బందిలోకి నెట్టాయి. డిపార్‌్టమెంట్ నుంచి సస్పెండయిన వ్యక్తికయినా యాభై శాతం జీతం ఇప్పిస్తారు. రిలీవ్ చేసిన ఉద్యోగుల తప్పు లేకుండా జీతం ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వీరు తిరిగి ఉద్యోగాల్లో చేరిన తర్వాత జీతాల బకాయిలు ఇస్తే, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు. ఉన్నతాధికారులు ఆలోచించవలసిన విషయం ఇది. ఈ సమస్యను మానవతా దృక్పథంతో తక్షణమే పరిష్కరించాలి.

పొత్తూరు వెంకట రమేష్


Updated Date - 2022-06-21T06:22:46+05:30 IST