కోతల వాతలే..!

ABN , First Publish Date - 2021-10-12T06:44:43+05:30 IST

జిల్లా ముంగిట భారీ విద్యుత్‌ కోతల ముప్పు పొంచి ఉంది. నాలుగైదు రోజుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు అధికారిక షెడ్యూల్‌ సిద్ధం చేశారు. ఏ గంటకు సరఫరాలో ఎంత కోత కోయాలనే ఆదేశాలు పైనుంచి వచ్చే దాన్ని బట్టి కొన్ని రంగాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. బొగ్గు నిల్వలు లేక సరఫరాలో తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట ప్రజలు విద్యుత్‌ కోతలు భరించడానికి సిద్ధంగా ఉండాలని సోమవారం ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో పల్లెలు, పట్టణాలు, నగరాల్లో త్వరలో విద్యుత్‌ కోతలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రోజువారీ విద్యుత్‌ వినియోగం అన్ని రంగాలకు కలిపి 16 మిలియన్‌ యూనిట్లు ఉంది. ఇందులో ఎంత కోత విధిస్తారనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.

కోతల వాతలే..!

జిల్లాకు పొంచి ఉన్న విద్యుత్‌ కోతల ముప్పు

తీవ్రమైన బొగ్గు కొరత నేపథ్యంలో 

తగ్గిపోయిన థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి

రాత్రివేళల్లో విద్యుత్‌ కోతలు భరించడానికి 

సిద్ధంగా ఉండాలన్న ప్రభుత్వం 

ఏ సమయంలో ఏరంగాలకు కోత కొయ్యాలో 

ఏపీఈపీడీసీఎల్‌ షెడ్యూల్‌

తొలుత ఆక్వా, ఆ తర్వాత వ్యవసాయం,

ఆతర్వాత పల్లెలకు సరఫరా నిలుపుదల

ఒకపక్క ఉక్కపోత, మరోపక్క జ్వరాల 

బెడదతో కోతలపై జనంలో భయం

ప్రస్తుతం జిల్లాలో రోజూ వారీ విద్యుత్‌ డిమాండ్‌ 

16 మిలియన్‌ యూనిట్లు

ఇందులో ఎంత సరఫరాకు కోత కోస్తారో 

ఇంకా తెలియని పరిస్థితి


జిల్లా ముంగిట భారీ విద్యుత్‌ కోతల ముప్పు పొంచి ఉంది. నాలుగైదు రోజుల్లో పగలు, రాత్రి  తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు అధికారిక షెడ్యూల్‌ సిద్ధం చేశారు. ఏ గంటకు సరఫరాలో ఎంత కోత కోయాలనే ఆదేశాలు పైనుంచి వచ్చే దాన్ని బట్టి కొన్ని రంగాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. బొగ్గు నిల్వలు లేక సరఫరాలో తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట ప్రజలు విద్యుత్‌ కోతలు భరించడానికి సిద్ధంగా ఉండాలని సోమవారం ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో పల్లెలు, పట్టణాలు, నగరాల్లో త్వరలో విద్యుత్‌ కోతలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో రోజువారీ విద్యుత్‌ వినియోగం అన్ని రంగాలకు కలిపి 16 మిలియన్‌ యూనిట్లు ఉంది. ఇందులో ఎంత కోత విధిస్తారనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఒకపక్క వర్షాలు కురుస్తున్నా పగటి ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా వర్షాలు కురిసే అక్టోబరులో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. అదే సమయంలో విద్యుత్‌ వినియోగం పడిపోతుంది. కానీ ఈసారి వర్షాలు పడుతున్నా అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు ఉంటున్నాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం ఆపసోపాలు పడుతు న్నారు. రాత్రి వేళలో దోమల బెడద సరేసరి. ఇప్పటికే పగటి, రాత్రి పూట దోమల కాటుతో జనం డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పల్లెలు, పట్టణాలు మంచం పట్టాయి. ఈ తరుణంలో త్వరలో పెద్దఎత్తున జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ కోతలు విధించ డానికి ఏపీఈపీడీసీఎల్‌ సిద్ధమవుతోంది. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న హైడల్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు సర ఫరా అవుతోంది. కానీ ఇదేదీ జిల్లా అవసరాలకు చాలదు. అందుకే గ్రిడ్‌ ద్వారా ఽథర్మల్‌ విద్యుత్‌ మాత్రమే గతి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి నెల కొంది. బొగ్గు నిల్వలు లేకపోవడం, భారీ వర్షాలకు తవ్వకాలు ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడబోతోంది. ఈ మేరకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం విద్యుత్‌ కోతలు తప్పవని స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ఇదే విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా సాయంత్రం ఆరు నుంచి విద్యుత్‌ కోతలు భరించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభం డబ్బులతో కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో ఈ ప్రభావం జిల్లాపైనా గట్టిగా పడబోతోంది. జిల్లాలో విద్యుత్‌ సరఫరాలో కోత ఏ సమయంలో విధించాలి? ఎన్ని గంటలు విధించాలి? ఏఏ రంగాలకు తొలుత కోతలు అమలు చేయాలి? వంటి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా అధికారులు కొన్ని రకాల కోతల షెడ్యూళ్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం జిల్లాలో గృహ, వ్యవసాయం, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం రోజూ 16 మిలియన్‌ యూనిట్లు ఉంటోంది. ఇందులో ఆక్వారంగం రోజువారీ విద్యుత్‌ వినియోగం 30 మెగావాట్లు. వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ 200 మెగావాట్లు. గృహవిద్యుత్‌ వినియోగం 650 మెగా వాట్లు. అయితే ఇప్పుడు థర్మల్‌ విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో జిల్లాకు ఏ సమయంలో ఎన్ని యూనిట్లు కోత వేస్తారనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తక్కువ స్థాయిలో కోత కోస్తే తొలుత ఆక్వా రంగానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి గృహావసరాలకు సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. కోత ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తే పగటిపూట వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను నిలిపివేయనున్నారు. దీనికి బదులుగా రాత్రి తర్వాత ఏదొక సమయానికి సర ఫరా కొనసాగిస్తారు. వాస్త వానికి జిల్లాలో సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు డిమాండ్‌ చాలా తీవ్రస్థాయిలో ఉంటోంది. ఈనేపథ్యంలో కోతలు అమలు చేయాల్సివస్తే ఈ సమయంలో ఎలా మేనేజ్‌ చేయాలనేదానిపై అధి కారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆక్వా, వ్యవసాయానికి కోతలు వేయగా ఇంకా సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులు వస్తాయని అంచనాకు వచ్చారు. అదే జరిగితే తొలుత పల్లెల్లో సరఫరా నిలిపివేయనున్నారు. ఎన్ని గంటలపా టు ఈ కోతలు అనేది చెప్పలేని పరిస్థితి.


ఆ తర్వాత మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో సరఫరా నిలిపివేస్తారు. నగరాల్లో మాత్రం ఉదయం వేళల్లో కోతలు కోసి రాత్రిపూట పెద్దగా అవాంతరాలు లేకుండా చేయడానికి లోడ్‌ సర్దుబాటు చేయాలని భావి స్తున్నారు. కోతలు అమలు ప్రారంభమైతే ఏ సమయంలో సరఫరా కోతకోయాలనేది పైనుంచే నిర్ణయం జరుగుతుంది. దాని ప్రకారం జిల్లాలో అధికా రులు వ్యవహరించాల్సి ఉంటుంది. కాగా తాజా సంక్షోభంతో పల్లెల్లో మళ్లీ కోతలు పెద్దఎత్తున తప్పకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గడచిన కొన్ని వారాలుగా జిల్లాలో పల్లెల్లోను, పట్ట ణాల్లోను అనధికారికంగా విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. దీంతో జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఎక్కడా అధికారికంగా కోతలు విధించడం లేదని అధికారులు చెబుతుండడం విశేషం. ప్రస్తుతం పొంచి ఉన్న సంక్షోభం నేపథ్యంలో ఎన్ని రోజులు కోతలు అమలవుతాయనేది కూడా చెప్ప లేమని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ వివరించారు. పైఅధికారుల ఆదేశాల ప్రకా రం కోతల షెడ్యూల్‌ తయారుచేశామని వివరించారు. అక్కడి నుంచి వచ్చే సూచనల ప్రకారం కోతలు అమలు చేస్తామని చెప్పారు. ఇతర రంగాలకు కోతలు కోసి గృహావసరాలకు పెద్దగా ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రయ త్నిస్తున్నామని వివరించారు. మరోపక్క పరిశ్రమల పరిస్థితి ఏంటనేదానిపైనా ఆయా రంగాలు ఒకింత ఆందోళనగా ఉన్నాయి. వీటికి కోతలు తప్పేలా లేవు.

Updated Date - 2021-10-12T06:44:43+05:30 IST