లక్ష్యం నిర్వీర్యం..!

ABN , First Publish Date - 2021-08-03T05:03:27+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,03,574 హెక్టార్లు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, వరి, బుడ్డశనగ, పసుపు, కొర్ర, పెసర, జొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. మరో 1.35 లక్షల హెక్టార్లలో అరటి, చీనీ, బొప్పాయి, నిమ్మ, మామిడి, సపోటా వంటి ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు సాగుచేస్తున్నారు.

లక్ష్యం నిర్వీర్యం..!
సీకేదిన్నెలోని జిల్లా భూసార పరీక్షాకేంద్రం

విద్యుత బిల్లు చెల్లించలేదని..

జిల్లా భూసార పరీక్షా కేంద్రానికి వపర్‌ కట్‌

నాలుగు నెలలుగా ఆగిపోయిన భూసార పరీక్షలు

సిబ్బంది జేడీఏ ఆఫీసుకు డిప్యుటేషన

ఉద్యాన పంటలకు భూసార పరీక్షలు తప్పనిసరి

ఆందోళనతో అన్నదాతలు


జిల్లా భూసార పరీక్షా కేంద్రం అది. కరెంట్‌ బిల్లు బకాయి రూ.50 వేలు. ప్రభుత్వం నిధులివ్వలేదు. బిల్లు చెల్లించలేదు. విద్యుత అధికారులు పవర్‌ సరఫరా కట్‌ చేశారు. కరెంట్‌ లేకపోవడంతో నాలుగు నెలలుగా భూసార పరీక్షలు ఆగిపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయిల్‌ టెస్టింగ్‌ కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు ఎన్నో. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా విద్యుత శాఖకు చెల్లించాల్సిన బకాయిలు రూ.700 కోట్లు పైమాటే. జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నా, రైతులకు ఉపయోగపడే భూసార పరీక్ష కేంద్రానికి పవర్‌ కట్‌ చేయడం విమర్శలకు తావిస్తోంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,03,574 హెక్టార్లు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, వరి, బుడ్డశనగ, పసుపు, కొర్ర, పెసర, జొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. మరో 1.35 లక్షల హెక్టార్లలో అరటి, చీనీ, బొప్పాయి, నిమ్మ, మామిడి, సపోటా వంటి ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు సాగుచేస్తున్నారు. 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, కాంప్లెక్స్‌, పొటాష్‌, ఎంఓపీ వంటి రసాయన ఎరువులు భూమిలో పోస్తున్నారు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూములు నిస్సారం అవ్వడమే కాకుండా కాలుష్యం, ప్రజలు తినే ఆహారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంగా భూసార పరీక్షలకు గత ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాయిల్‌ టెస్టింగ్‌ ఫలితాలకు అనుగుణంగా భూమిలో లోపాలు గుర్తించి ఆ మేరకు రసాయన, సేంద్రియ ఎరువులు వాడాలని సూచన చేస్తున్నారు. జిల్లాలో సీకేదిన్నె మండలం ఊటుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో మూడు భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.


నిధులు రాక.. కరెంట్‌ బిల్లు కట్టక

కడప నగర శివారున సీకేదిన్నె మండలం ఊటుకూరు వద్ద జిల్లాస్థాయి భూసార పరీక్ష కేంద్రం (ఎస్‌టీఎల్‌) ఉంది. ఈ పరీక్ష కేంద్రంలో ఏడీ, నలుగురు ఏఓలు, ఇద్దరు కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు 100-200 భూసార పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది. అధునాతన టెస్టింగ్‌ యంత్రాలు కూడా ఉన్నాయి. ఖరీఫ్‌ సీజన ప్రారంభం కావడంతో రైతులు నేరుగా భూసార పరీక్షకోసం ఎస్‌టీఎల్‌కు వస్తున్నారు. అరటి, చీనీ, బొప్పాయి, మామిడి వంటి ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేయిస్తున్నారు. అయితే.. కీలకమైన జిల్లా భూసార పరీక్షా కేంద్రానికి నిధుల గ్రహణం పట్టుకుంది. రసాయనాల (కెమికల్స్‌) కొనుగోళ్లకే కాదు.. కనీసం విద్యుత బిల్లులు కూడా చెల్లించేందుకు ఏడాది కాలంగా నిధులు ఇవ్వడం లేదు. ఊటుకూరు సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ రూ.50 వేలు పవర్‌ బిల్లు చెల్లించాల్సి ఉంది. నోటీసులు పంపినా స్పందన లేదు. దీంతో విద్యుత శాఖ అధికారులు పవర్‌ సరఫరా కట్‌ చేశారు. నాలుగు నెలలుగా కరెంట్‌ లేక భూసార పరీక్షలు చేయడం లేదు. దీనికి తోడు విద్యుత మోటర్‌ కూడా చెడిపోయింది. తాగునీరే కాదు.. అత్యవసరమై వాషింగ్‌ రూంకు వెళ్లాల్సి వస్తే నీళ్లు లేవు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పరిస్థితి మరీదారుణంగా మారింది. నిధులు ఇచ్చి భూసార పరీక్షలు చేయించాల్సిన జిల్లా యంత్రాంగం ఇక్కడి సిబ్బందిని జేడీఏ ఆఫీసుకు డిప్యుటేషనపై పంపించారు. రాయచోటి భూసార కేంద్రానికి కూడా తాళం పడింది. దీంతో పలువురు రైతులు భూసార పరీక్షలను బయట చేయిస్తున్నారు. ఇది వారికి సాగు ఖర్చుకు అదనం.


జిల్లాలో రూ.700 కోట్లకు పైగానే బకాయిలు

భూసార పరీక్షా కేంద్రం ఒక్కటే కాదు.. జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ స్కీంల ద్వారా దాదాపు రూ.700 కోట్లకుపైగా విద్యుత బకాయిలు ఉన్నాయని ట్రాన్సకో అధికారులు పేర్కొంటున్నారు. నోటీసులు పంపినా స్పందన లేదని, గట్టిగా అడిగితే నిధులు లేవని, ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే చెల్లిస్తామని సమాధానం చెబుతున్నారని అంటున్నారు. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉండగా.. రూ.50 వేల బకాయి ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పవర్‌ కట్‌ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భూసార పరీక్షలు పంటలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఈ కేంద్రానికి విద్యుత పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.


కమిషనర్‌కు లేఖ రాశాం

- లక్ష్మిదేవి, ఏడీ, భూసార పరీక్ష కేంద్రం, ఊటుకూరు

చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చి జూలై ఒకటిన బాధ్యతలు తీసుకున్నా. నేను వచ్చినప్పటి నుంచి కరెంట్‌ సరఫరా లేదు. విచారిస్తే బిల్లు కట్టలేదని విద్యుత శాఖ అధికారులు పవర్‌ కట్‌ చేశారని తెలిసింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌, జేడీఏలకు నివేదిక ఇచ్చారు. రోజుకు 100-150 శాంపుల్స్‌ భూసార పరీక్షలు చేసే సామర్థ్యం, యంత్రాలు ఉన్నాయి. కరెంట్‌, నీళ్లు లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదు. రైతులు కొందరు స్వచ్ఛందంగా శాంపుల్స్‌ తెస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేయడం లేదని తెలిసి వెనుదిరుగుతున్న మాట వాస్తవమే.



Updated Date - 2021-08-03T05:03:27+05:30 IST