కరెంటు షాక్‌

Published: Sat, 26 Mar 2022 00:31:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కరెంటు షాక్‌

- విద్యుత్‌ చార్జీలు పెంచుతూ ఈఆర్‌సీ నిర్ణయం

- ఏప్రిల్‌ 1 నుంచి అమలు 

- బోరుమంటున్న వినియోగదారులు

- విపక్షాల ఆందోళనలు 

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 25:  విద్యుత్‌శాఖ రెండేళ్లుగా ఒకటి తరువాత ఒకటి వరుసగా ఇస్తున్న షాక్‌లతో విద్యుత్‌ వినియోగదారులు విలవిలలాడుతున్నారు. రెండేళ్ల క్రితం అదనపు విద్యుత్‌ వినియోగం పేరిట అడిషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ (ఏఎస్‌డీ) వేసి మెజార్టీ వినియోగదారుల నుంచి డిపాజిట్‌ సొమ్ము వసూలు చేయడాన్ని మరిచిపోకముందే గత  సెప్టెంబర్‌ మాసం నుంచి ప్రతి నెలా దశలవారీగా వినియోగదారులపై అదనపు వినియోగానికి అభివృద్ధి చార్జీలంటూ వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. తాజాగా కొన్ని సంవత్సరాలుగా చార్జీలను పెంచలేదనే నెపంతో భారీగా విద్యుత్‌ చార్జీలను పెంపుతో షాక్‌ ఇచ్చారు. విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ) తీసుకున్న ఛార్జీల పెంపు నిర్ణయం వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు అమలులోకి తెస్తామని ప్రకటించడంతో ఓవైపు విపక్షాలు ఆందోళనలు చేస్తుంటే మరోవైపు వినియోగదారులు పెంచిన ఛార్జీ బిల్లులను ఎలా చెల్లించాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలు పెంచగా, రవాణాపై పెట్రో భారం పడడంతో నిత్యావసర వస్తువులతోపాటు కూరగాయలు, అన్ని ధరలు చుక్కలను అంటాయి. ఈ తరుణంలోనే కరెంటు చార్జీలను కూడా యడాపెడా పెంచడం దారుణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల తీరుతో బతుకడమే కష్టంగా మారిందంటూ పేద, మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

జిల్లా ప్రజలపై రూ.7 కోట్లపైనే భారం 

ఏప్రిల్‌ ఒకటి నుంచి విద్యుత్‌ చార్జీల పెంపు అమలులోకి వస్తే జిల్లా ప్రజలపై ప్రతినెలా 7కోట్ల 12 లక్షల 83వేల రూపాయల ఆర్థిక భారం పడనున్నది. అలాగే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వినియోగదారులపై 10 కోట్లకుపైగానే అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 3,67,649 కనెక్షన్లతో గృహవినియోగదారులు 22,082 మిలియన్‌ యూనిట్ల కరెంటును ప్రతినెలా వినియోగిస్తున్నారు. చార్జీల పెంపుతో వీరిపై యూనిట్‌కు 50 పైసల చొప్పున ఒక కోటి 10 లక్షల 41వేల రూపాయల అదనపు భారం పడనున్నది. అలాగే 48,013 వాణిజ్య కనెక్షన్‌ వినియోగదారులు వినియోగిస్తున్న 5,740 యూనిట్ల కరెంటుకుగాను యూనిట్‌కు 50పైసల చొప్పున పెంచిన చార్జీలతో వారిపై 28 లక్షల 70వేల అదనపు ఆర్థిక భారం పడుతుంది. అలాగే 3,776 కనెక్షన్ల ద్వారా పరిశ్రమలకు ప్రతినెలా 3,252 మిలియన్‌ యూనిట్ల కరెంటును వినియోగిస్తున్నందున వారికి యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున పెంచడంతో 32 లక్షల 52వేల రూపాయల అదనపు భారం పడుతుంది. అలాగే 602 యూనిట్లకు హైటెన్షన్‌ (హెచ్‌టీ) కనెక్షన్ల ద్వారా 54.12 మిలియన్‌ యూనిట్ల కరెంటును వినియోగిస్తుండడంతో వారిపై అదనపు 5 కోట్ల 41 లక్షల 20వేల రూపాయల ఆర్థిక భారం అదనంగా పడుతుంది. అయితే కేటగిరీ-1 (బి)(1)లో 0 నుంచి 100 యూనిట్లకు ప్రస్తుతం యూనిట్‌కు రూ.3.30 పైసలు వసూలు చేస్తుండగా వీరికి యూనిట్‌కు 10 పైసలు మాత్రమే పెంచి కొంత ఊరట కలిగించింది. ఇప్పటి వరకు 0నుంచి 50 యూనిట్ల గృహ వినియోగదారులకు కేటగిరీ -1 స్లాబ్‌లో యూనిట్‌కు 1.45 పైసలు వసూలు చేస్తుండగా కొత్త రేట్లతో యూనిట్‌కు 1.95పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 51 నుంచి 100 యూనిట్లలోపు వారు రూ.2.60 నుంచి 3.10 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య వినియోగదారులు స్లాబ్‌-ఏలో 50 యూనిట్లలోపు వారు యూనిట్‌కు ప్రస్తుతం 6 రూపాయలు చెల్లిస్తుండగా ఏప్రిల్‌ నుంచి రూ.7 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే స్లాబ్‌-బిలో 0 నుంచి 100 యూనిట్ల కరెంటను వినియోగించుకున్న వారు ప్రస్తుతం చెల్లిస్తున్న యూనిట్‌కు రూ.7.50 పైసలను ఇకపై యూనిట్‌కు 8.50 పైసలు చొప్పులన చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని కేటగిరీలు, స్లాబ్‌ల వినియోగదారులపై ఈఆర్‌సీ ఛార్జీలను పెంచి అదనపు భారం మోపింది. అయితే పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని విపక్ష కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పార్టీలతో పాటు వినియోగదారులు కూడా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొంతైన తగ్గింపు చేస్తుందా లేక కొత్త చార్జీలను యధావిధిగా అమలు చేస్తుందో వేచి చూడాలి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.