భారీగా విద్యుత్‌ వినియోగం

ABN , First Publish Date - 2022-08-19T06:35:40+05:30 IST

విశాఖపట్నం సర్కిల్‌లో విద్యుత్‌ వినియోగం ఏటా పెరిగిపోతోంది. వినియోగదారుల సంఖ్య కూడా ఊహించని విధంగా అంచనాలను దాటుతోంది.

భారీగా విద్యుత్‌ వినియోగం

నాలుగేళ్లలో 45.72 శాతం పెరుగుదల

విశాఖ సర్కిల్‌లో వినియోగదారులు 17.17 లక్షలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం సర్కిల్‌లో విద్యుత్‌ వినియోగం ఏటా పెరిగిపోతోంది. వినియోగదారుల సంఖ్య కూడా ఊహించని విధంగా అంచనాలను దాటుతోంది. గత ఐదేళ్ల లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్‌ వినియోగం ఎలా పెరుగుతుందో అర్థమవుతోంది. ఇటీవల కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికీ విశాఖపట్నం సర్కిల్‌లోనే కొనసాగుతున్నాయి. 

విశాఖపట్నం సర్కిల్‌లో 2018 నాటికి 13,38,905 మంది విద్యుత్‌ వినియోగదారులు ఉండగా...ఆ ఏడాది 30,52,670 కిలోవాట్ల విద్యుత్‌ను వాడుకున్నారు. 2022 జూలై నాటికి లెక్కలు చూసుకుంటే వినియోగదారుల సంఖ్య 28.27 శాతం పెరిగి 17,17,472కి చేరింది. విద్యుత్‌ వినియోగమైతే 45.72 శాతం పెరిగి 44,48,360 కిలోవాట్లకు పెరిగింది. 

విశాఖపట్నం పరిసరాల్లోనే ఎక్కువగా పరిశ్రమలు ఉండడంతో వాటి డిమాండ్‌కు తగిన విద్యుత్‌ను అందించేందుకు ఈపీడీసీఎల్‌ అధికారులు ఇటీవల కాలంలో గ్యాస్‌ ఇన్సులేటెట్‌ సబ్‌స్టేషన్లు పదింటిని నిర్మించారు. వినియోగంతో పాటు ఆదాయం కూడా పెరగడంతో మౌలిక వసతులకు భారీఎత్తున ఖర్చు చేస్తున్నారు. విద్యుత్‌ వినియోగదారులను ఈపీడీసీఎల్‌ ఐదు వర్గాలుగా (గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఇతర వినియోగదారులు)గా వర్గీకరించింది. ఇందులో గృహ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్‌ ఇస్తోంది. పరిశ్రమలకు కూడా డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేస్తోంది. బయట విద్యుత్‌ లభించని సమయాల్లో కొన్నిసార్లు ఆంక్షలు విధిస్తోంది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్‌ అందిస్తున్నట్టు చెబుతోంది. 


పరిశ్రమల వినియోగం పెరిగింది

ఎల్‌.మహేంద్రనాథ్‌, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్‌

గృహ విద్యుత్‌ వినియోగదారుల సంఖ్య సాధారణంగానే పెరుగుతుంది. కానీ వాణిజ్యం, పరిశ్రమల విద్యుత్‌ వినియోగం భారీగా పెరగడం విశేషం. 2018తో పోల్చుకుంటే ఈ రెండు విభాగాల వినియోగదారుల సంఖ్య 36.44 శాతం, విద్యుత్‌ వినియోగం 39.96 శాతం పెరిగింది. కరోనా సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వినియోగం తగ్గినా ఆ తరువాత అన్నీ పుంజుకున్నాయి. అనకాపల్లితో పాటు అచ్యుతాపురం సెజ్‌లో పరిశ్రమలకు విద్యుత్‌ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాము. 


గత ఐదేళ్లలో వినియోగదారులు, వారు వాడుకున్న విద్యుత్‌ వివరాలివి.

------------------------------------------------------------------------------------------------------

సంవత్సరం  వినియోగదారులు  పెరిగిన శాతం  విద్యుత్‌ వినియోగం   పెరిగిన శాతం

------------------------------------------------------------------------------------------------------ 

2018         13,38,905        ----------      30,52,670 కిలోవాట్లు    --------

2019         13,84,832        3.43 శాతం    33,54,333 కిలోవాట్లు    9.88 శాతం

2020         14,34,690        7.15 శాతం    36,18,510 కిలోవాట్లు   18.54 శాతం

2021         14,78,026       10.39 శాతం    38,21,500 కిలోవాట్లు   25.29 శాతం

2022         17,17,472       28.27 శాతం    44,48,360 కిలోవాట్లు   45.72 శాతం

------------------------------------------------------------------------------------------------------

Updated Date - 2022-08-19T06:35:40+05:30 IST