1912.. హెల్ప్‌లెస్‌

ABN , First Publish Date - 2022-07-05T15:51:47+05:30 IST

‘వర్షానికి ఆదివారం రాత్రి 11 గంటలకు కరెంట్‌ పోయింది. ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు ఫోన్‌ చేస్తే గంటలకొద్దీ ఎంగేజ్‌. ఫ్యూజ్‌ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ ఫోన్లూ

1912.. హెల్ప్‌లెస్‌

స్పందించని విద్యుత్‌ శాఖ టోల్‌ఫ్రీ నెంబర్‌  

గంటల కొద్దీ ఎంగేజ్‌


హైదరాబాద్‌ సిటీ: ‘‘వర్షానికి ఆదివారం రాత్రి 11 గంటలకు కరెంట్‌ పోయింది. ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు ఫోన్‌ చేస్తే గంటలకొద్దీ ఎంగేజ్‌. ఫ్యూజ్‌ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ ఫోన్లూ అదే పరిస్థితి. యాప్‌లో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి నాలుగు గంటల సమయం పట్టింది’’ అని యూసు్‌ఫగూడకు చెందిన ఓ బాధితుడు వాపోయాడు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలుంటే 5-10 నిమిషాల్లో గుర్తించి పరిష్కరిస్తామని డిస్కం అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. వర్షం పడి సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు చేసేందుకు అధికారులకు ఫోన్లు చేసినా వినేవారు కరువయ్యారని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


వర్షాలతో విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ పవర్‌కట్‌ సమస్యలు ఏర్పడుతున్నా ఉన్నతాధికారులు కార్యాలయాలు వదిలి బయటకు రావడం లేదు. వర్షం పడితే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించినా కొందరు అధికారుల చెవికి ఎక్కడం లేదు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే గంటలకొద్దీ ఎంగేజ్‌ రావడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూసు్‌ఫగూడ శ్రీకృష్ణానగర్‌ ఏ-బ్లాక్‌లో ఆదివారం రాత్రి 11 నుంచి సోమవారం తెల్లవారు జామున 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు 4 గంటలు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు వర్షం..మరోవైపు చీకట్లో చిన్న పిల్లలతో రాత్రంతా నిద్రలేకుండా గడిపామని లక్ష్మి తెలిపారు. వర్షకాలంలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే మాన్‌సూన్‌ పనులు పూర్తిచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా కన్పించడంలేదు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు కురిసిన వర్షంతో హైదరాబాద్‌ జోన్‌లో 135, రంగారెడ్డి జోన్‌లో 127 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఫిర్యాదులు పట్టించుకోకుండా కొంతమంది సిబ్బంది ఫోన్లు పక్కన పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. 


పనులు చేసినట్లు తప్పుడు నివేదికలు

ప్రతి నెలా వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్న విద్యుత్‌శాఖ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగదారులు డిస్కం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌చేస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్న క్షేత్రస్థాయి అధికారులు సరఫరాలో అంతరాయాలు తలెత్తినప్పుడు ఫోన్లు చేస్తే పట్టించుకోరని ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో 24 గంటలూ అధికారులు అందుబాటులో ఉండాలనే ఆదేశాలున్నా పలు డివిజన్లలో ఆ నిబంధనలేవీ అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. పలు డివిజన్లలో మాన్‌సూన్‌ పనులు పూర్తిచేయకున్నా చేసినట్లు తప్పుడు నివేదికలు ఉన్నతాధికారులకు సమర్పించారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులపై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలిస్తున్నా..వాటిపై ఎలాంటి విచారణ చేపట్టడం లేదు.  


రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు

 పట్టణ ప్రగతిలో భాగంగా గ్రేటర్‌లో విద్యుత్‌ శాఖ ప్రణాళిక

పట్టణ ప్రగతిలో భాగంగా గ్రేటర్‌జోన్‌ 9 సర్కిళ్లలో విద్యుత్‌ శాఖ రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఒంగిపోయిన విద్యుత్‌ స్తంభాలు, తుప్పుపట్టినవి మార్చడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాల కోసం పలు ప్రాంతాల్లో కొత్త లైన్లు వేస్తున్నారు. ట్రాఫిక్‌ అంతరాయాలు కలిగే 900 ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు మార్చడంతోపాటు 380 డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కింద సిమెంట్‌ దిమ్మెలు ఏర్పాటు చేయనున్నారు. సైబర్‌సిటీలో రూ. 1.5 కోట్లు,  రాజేంద్రనగర్‌లో రూ. 4.2 కోట్లు, సరూర్‌నగర్‌లో రూ. 4.2 కోట్లు, మేడ్చల్‌లో రూ. 2 కోట్లు, హబ్సిగూడ సర్కిల్‌లో రూ. 5.5 కోట్లతో, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌ సర్కిళ్లలో సుమారు రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు విద్యుత్‌శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 

Updated Date - 2022-07-05T15:51:47+05:30 IST