
న్యూఢిల్లీ: వర్షపు చినుకుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న పరికరాన్ని ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించారు. ‘లిక్విడ్-సాలిడ్ ఇంటర్ఫేజ్ ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్’ పేరుతో రూపొందించిన ఈ డివైజ్ సాయంతో నీటి బిందువుల నుంచి తక్కువ మోతాదులో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని ప్రొఫెసర్ నీరజ్ ఖరే వివరించారు. ఈ పరికరం రూపకల్పనకు ‘ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్’ సాంకేతికతను వినియోగించినట్టు తెలిపారు.
ఈ పరికరంలోని నానో కాంపోజిషన్ పాలిమర్స్, కాంటాక్ట్ ఎలక్ట్రోడ్లు విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ పరికరానికి సంబంధించిన సాంకేతికతపై పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. కాగా ఈ ‘లిక్విడ్-సాలిడ్ ఇంటర్ఫేజ్ ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్’ సాయంతో వాచీలు, డిజిటల్ థర్మోమీటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మీటర్లు మొదలైనవాటిని చార్జ్ చేసుకోవచ్చు. ‘ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్’ ఆధారంగా ఈ పరికరాన్ని రూపొందించారు. ఒక పదార్థం.. మరో పదార్థానికి చేరువగా వచ్చినప్పుడు వాటి మధ్య రాపిడి ఏర్పడి, ఒక మెటీరియల్ నుంచి ఇంకొక మెటీరియల్‌కు ఎలక్ట్రాన్లు తరలుతాయి. దీనినే ‘ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్’ అని అంటారు. ఈ చర్య ఫలితంగా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.