ఎలక్ట్రానిక్స్‌ భగీరథుడు

ABN , First Publish Date - 2022-09-20T06:28:44+05:30 IST

అయ్యగారి సాంబశివ రావు (డాక్టర్ ఏఎస్ రావు) నిఖార్సైన మానవతావాది. విలువల కోసం జీవితాంతం నిలబడిన వ్యక్తి. నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయితీ, అంకితభావం కలిగినవాడు...

ఎలక్ట్రానిక్స్‌ భగీరథుడు

అయ్యగారి సాంబశివ రావు (డాక్టర్ ఏఎస్ రావు) నిఖార్సైన మానవతావాది. విలువల కోసం జీవితాంతం నిలబడిన వ్యక్తి. నిస్వార్ధం, నిరాడంబరత, నిజాయితీ, అంకితభావం కలిగినవాడు. భారతదేశంలో పేరెన్నికగన్న గొప్ప శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశోధనలు, ఉత్పత్తులు రూపొందించడం మాత్రమే కాదు, కార్మికుల సంక్షేమం కూడా ప్రధానం అని ఆచరణాత్మకంగా నమ్మిన వ్యక్తి. శాస్త్రవేత్తగా ఆయన జీవితం, అలాగే వ్యక్తిగత జీవితం గొప్ప స్ఫూర్తిదాయకం.


పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో 1914 సెప్టెంబర్ 20న వెంకటాచలం, సుందరమ్మ దంపతులకు జన్మించారు ఎఎస్ రావు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఐదో తరగతి వరకు మోగల్లులోనే సాగింది. తరువాత తణుకు హైస్కూల్లోనూ, విజయనగరం మహారాజా కాలేజీలోనూ చదివారు. 1935లో వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బిఎస్సీ, తదుపరి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో ఉండగా కాకినాడలోని అన్నపూర్ణమ్మతో వివాహం అయింది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ వంటి వారి ఉపన్యాసాలకు ఉత్తేజితుడయ్యారు.


1945 నుంచి 47 దాకా అమెరికాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మాతృదేశానికి తిరిగి వచ్చాక 1947లో హొమి జె బాబా వద్ద రీసెర్చ్ ఇంజనీరుగా చేరారు. వాళ్ళిద్దరి కలయిక భారతదేశ శాస్త్రసాంకేతిక రంగాలలోనూ ముఖ్యంగా ఆటమిక్ రంగంలో చేసిన పరిశోధనలు విజయవంతంగా పూర్తయ్యాయి. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ లో ఎలక్ట్రానిక్ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఏఎస్ రావు బాధ్యతలు చేపట్టారు. భారతదేశపు తొలి పరమాణు రియాక్టర్ ‘అప్సర’ తయారీలో కీలక భూమిక పోషించారు. ఆయనను భారత ప్రభుత్వం 1960లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్) మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రావు. 300 మందితో ఐదు విభాగాలుగా ప్రారంభమైన ఈసీఐఎల్ 10 సంవత్సరాలలో పదివేల మంది సిబ్బందితో 20కి పైగా విభాగాలతో పని చేసేలాగా అభివృద్ధి చేశారాయన. కంపెనీ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఏఎస్ రావును ప్రతిష్ఠాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వరించింది. 1967లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. 1972లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.


1970 ప్రాంతంలో భారతదేశంలో కంప్యూటర్లు అంటేనే కొత్త వింత. అలాంటి రోజుల్లోనే స్వదేశీ పరిజ్ఞానంతో కంప్యూటర్లను తయారు చేసిన ఘనత ఈసీఐఎల్‌ది. ఈ కంపెనీ తయారుచేసిన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు డిఫెన్స్, సెక్యూరిటీ, రైల్వేలు, మెడికల్ లాంటి కీలకమైన రంగాలలో వాడేవారు. అలాగే మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్‌లో రైల్వే రిజర్వేషన్ల కోసం, బ్యాంకులు కంప్యూటరీకరణ చేసినప్పుడు సాఫ్ట్‌వేర్ అందించింది ఈసీఐఎల్. ‍1980 ప్రాంతంలో భారతదేశంలో టీవీలను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఇది. స్వదేశీ పరిజ్ఞానంతో వీటన్నిటి తయారీకి మార్గదర్శి, చోదకశక్తి డాక్టర్ ఏఎస్ రావు.


ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఫ్యాక్స్ మిషన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కంట్రోల్ సిస్టం, ఎర్త్ స్టేషన్ యాంటీనా, రేడియేషన్ మానిటరింగ్ అండ్ డిటెక్షన్ సిస్టం, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్, సాలిడ్ స్టేట్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ , ఎయిర్‌పోర్ట్ స్కానింగ్ సిస్టం వంటివన్నీ ఈసీఐఎల్ ఉత్పత్తి చేసినవే. అలాగే మిస్సైల్స్ ఏ సమయంలో పేలాలి అని నిర్ధారించే ఎలక్ట్రానిక్ ఫ్యూజులను 10 లక్షలకు పైగా తయారుచేసి డిఫెన్స్‌కు సప్లై చేసింది ఈసీఐఎల్. అందులో ఒక్క ఫ్యూజు కూడా ఫెయిల్ కాలేదు అంటే ఎంతటి నాణ్యత ప్రమాణాలను ఈసీఐఎల్ పాటించిందో అర్థమవుతుంది.


కార్మికులకి కంపెనీకి దగ్గరలో స్థలాన్ని సేకరించి అందులో ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నారు. కంపెనీ ఆవరణలో ఖాళీగా ఉన్న కొన్ని ఎకరాల భూమిలో కూరగాయలు పండించే ఏర్పాటు చేశారు. వాటిని కంపెనీలో పనిచేసే సిబ్బందికి అతి తక్కువ ధరకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. డాక్టర్ ఏఎస్ రావు 1978లో పదవీ విరమణ చేశారు. ఆయనకి ఎవరో బహుమతిగా ఇచ్చిన కారును కూడా అమ్మి పేద పిల్లల చదువు కోసం సాయం చేశారు. ఆయన తన పేరు పెట్టుకోవటానికి సమ్మతించిన ఏకైక సంస్థ డాక్టర్ ఏఎస్ రావు అవార్డు కౌన్సిల్. ప్రతి సంవత్సరం ఈ సంస్థ ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పారితోషికం అందిస్తున్నది. తన అంతిమ సంస్కారాలు ఎలా జరగాలో ఒక విల్లు రాసి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. డాక్టర్ ఏఎస్ రావు 2003 అక్టోబర్ 30న కన్నుమూశారు. ఆయన ఒక గొప్ప స్ఫూర్తిప్రదాత, భవిష్యత్ తరాలకు మార్గదర్శి, గొప్ప మానవతావాది, భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త.

పి.బి. చారి

(నేడు ఏఎస్ రావు జయంతి)

Updated Date - 2022-09-20T06:28:44+05:30 IST