ఏనుగు దాడిలో రైతు మృతి

ABN , First Publish Date - 2022-04-10T13:33:43+05:30 IST

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శనివారం తెల్లవారు జామున జరిగిన ఏనుగు దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిమ్మప్పనాయుడు (65) అనే రైతు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల

ఏనుగు దాడిలో రైతు మృతి

కుప్పం(చిత్తూరు): ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శనివారం తెల్లవారు జామున జరిగిన ఏనుగు దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిమ్మప్పనాయుడు (65) అనే రైతు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె యూని యన్‌ పరిధిలోని కొంగనపల్లెకు చెందిన రైతు తిమ్మప్పనాయుడికి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన శనివారం తెల్లవారు ఝామున 5 గంటల సమయంలో పొలం వద్దకు బయలు దేరాడు. మార్గమధ్యంలో చెట్లమధ్య పొంచి ఉన్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఆయనపైకి వచ్చింది. తొండంతో అమాంతం పైకెత్తి, కాలికింద వేసి తొక్కింది. దీంతో తల నుజ్జునుజ్జైన తిమ్మప్పనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. ఏనుగు దాడిలో తిమ్మప్పనాయుడు మృతి చెందడంతో బంధు వులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఏనుగుల దాడులతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో జరుగుతున్న ఏనుగుల దాడులవల్ల పంటలు నష్టపోవడమేకాక, ప్రాణాలకు కూడా ముప్పు వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు దాహం తీర్చుకోవడానికి, ఆహారంకోసం తరచూ సరిహద్దు గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. భీతావహ పరిస్థితులు నెలకొంటున్నాయి. అటవీశాఖాధికారులు ఏనుగుల దాడుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని మూడు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-10T13:33:43+05:30 IST