మనుషులలోనే కాదు.. ఏనుగులలోనూ పెరుగుతున్న ఒత్తిడి.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-03-21T15:54:13+05:30 IST

మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా నిరాశ..

మనుషులలోనే కాదు.. ఏనుగులలోనూ పెరుగుతున్న ఒత్తిడి.. కారణమిదే!

మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా నిరాశ, ఆందోళన ఒంటరితనంతో బాధపడుతుంటాయి. మగ, ఆడ ఏనుగులు ఒత్తిడికి గురవుతున్నాయి. అయితే దీనికి కారణం ఈ రెండింటిలోనూ భిన్నంగా ఉంటుంది. ఫిన్‌లాండ్‌లోని టర్కు యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనల్లో ఏనుగుల గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగుల్లో ఒత్తిడి, అశాంతి, నిస్పృహలకు కారణమేమిటో తెలుసుకునేందుకు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు మయన్మార్ ఏనుగులపై పరిశోధనలు చేశారు. 


ఇందుకోసం వాటి మలాన్ని పరిశీలించారు. మలంలోని ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తనిఖీ చేశారు. మగ, ఆడ ఏనుగుల్లో ఒత్తిడి పెరగడానికి కారణం భిన్నంగా ఉంటుందని పరిశోధన నివేదిక చెబుతోంది. ఉదాహరణకు, మగ ఏనుగులలో ఒత్తిడికి ఒంటరితనం అతిపెద్ద కారణం. అదే సమయంలో ఆడ ఏనుగు గర్భం ధరించినప్పుడు ఒత్తిడికి గురవుతుంది. ఏనుగులు ఒత్తిడికి లోనైనప్పుడు వాటి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 95 ఏనుగులపై చేసిన పరిశోధనలో మనుషుల మాదిరిగానే ఏనుగుల్లో కూడా స్నేహితులతో సాంగత్యం ఆనందంగా ఉంటుందని తేలిందని పరిశోధకుడు డాక్టర్ మార్టిన్ సెల్ట్‌మన్ చెప్పారు. స్నేహితులు లేని ఏనుగుల మలంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అదే సమయంలో ఆడ ఏనుగు తన పిల్ల ఏనుగులు ఆడుకోవడం చూసి ఒత్తిడికి దూరంగా ఉంటాయని తేలింది. మనుషుల్లాగే ఏనుగుల్లో సామాజిక బంధానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు వివిధ జంతువుల జీవితాలను మెరుగుపరచడానికి ఉపకరిస్తాయని వారు భావిస్తున్నారు. 

Updated Date - 2022-03-21T15:54:13+05:30 IST