నేటి నుంచి పదోతరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-23T05:48:05+05:30 IST

నేటి నుంచి పదోతరగతి పరీక్షలు

నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
చేవెళ్లలోని ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రం

  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు 


ఆమనగల్లు/చేవెళ్ల, మే 22: పదోతరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలోని అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లుచేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. పరీక్షాపేపర్లు ఇప్పటికే ఆయా పోలీ్‌సస్టేషన్లకు చేరుకున్నాయి. ఆమనగల్లు పట్టణంలో రెండు, కడ్తాలలో ఒకటి, ముద్విన్‌లో ఒకటి, తలకొండపల్లిలో ఒకటి, వెల్జాల్‌లో ఒకటి, మాడ్గులలో రెండు, ఇర్విన్‌లో ఒకటి చొప్పున పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షాకేంద్రానికి ఒక సీఎస్‌, ఒక డీవోతో పాటు ప్రతి 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున  9పరీక్షా కేంద్రాలకు 100 మంది ఇన్విజిలేటర్లను  నియమించారు. నాలుగు మండలాల పరిధిలో 45ఉన్నత పాఠశాలలకు సంబంధించి 1926మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆమనగల్లు మండలంలో 540, తలకొండపల్లి మండలంలో 440, మాడ్గుల మండలంలో 477, కడ్తాల మండలంలో 469మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయా మండలాల ఎంఈవోలు సర్ధార్‌నాయక్‌, రామాంజన్‌రెడ్డిలు తెలిపారు. విద్యార్థులు పరీక్షకు గంటముందే పరీక్షాకేంద్రానికి రావాలని వారు సూచించారు. వేసవి నేపథ్యంల  అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతితో పాటు మెడికల్‌ కిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉంటుందని ఆయా మండలాల ఎస్‌ఐలు ధర్మేశ్‌, హరిశంకర్‌గౌడ్‌, వరప్రసాద్‌, రమేశ్‌లు తెలిపారు. అదేవిధంగా చేవెళ్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  ఎంఈవో అక్బర్‌ తెలిపారు. మండలంలో మొత్తం 757 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని స్పష్టం చేశారు. చేవెళ్లలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌, ప్రభుత్వ బాలురు, ప్రభుత్వ బాలికల పాఠశాల, సీల్వర్‌డైల్‌, సత్యసాయి పాఠశాలతో పాటు మండల పరిధిలోని ఆలూర్‌ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు విద్యార్థులకు సౌక్యర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్షాకేంద్రానికి హాల్‌టికెట్లతో అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.  

Updated Date - 2022-05-23T05:48:05+05:30 IST