‘అగ్నిపథ్‌’ను రద్దు చేసే వరకు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:39:00+05:30 IST

మతోన్మాద రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసేంత వరకు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

‘అగ్నిపథ్‌’ను రద్దు చేసే వరకు ఉద్యమించాలి
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

 డీవైఎఫ్‌ఐ శిక్షణ తరగుతుల్లో 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

చింతకాని, జూన్‌24: మతోన్మాద రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసేంత వరకు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. చింతకాని మండలం కొదుమూరులో మూడు రోజుల పాటు నిర్వహించనున్న భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ప్రారంభించిన అనంతరం తమ్మినేని ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని రక్షించే బాధ్యత యువత తీసుకోవాలన్నారు. దేశ ప్రయోజనాల కోసం యువత ముందుకు వచ్చి.. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని, స్వాతంత్య్ర పోరాటం, వీర తెలంగాణ రైతాంగ, విద్యుత్‌ పోరాటాల్లో యువత కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో ప్రస్తుత మతోన్మాద, ప్రాంతీయవాద పాలకులకు వ్యతిరేకంగా యువత మళ్లీ ఉద్యమించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పోరాడాలన్నారు. బీజేపీ దాని అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌తో దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని, ముస్లింలు, దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని ఎదురుతిరిగిన వారిపై కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నా రన్నారు. బీజేపీ లాంటి మతోన్మాద రాజకీయాలను, అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసేంత వరకు నాటి స్వాతంత్య్ర పోరాటాల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం ఖమ్మం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వర రావు, బండి రమేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి షేక్‌ బషీరుద్దీన్‌, మద్దాల ప్రభాకర్‌, సీపీఎం మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, వత్సవాయి జానకిరాములు, బయ్యా బాలాజీ, గడ్డం విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:39:00+05:30 IST