Ukraine War : రష్యా బలగాల క్షిపణి దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి

ABN , First Publish Date - 2022-07-06T19:02:22+05:30 IST

ఉక్రెయిన్ యుద్ధం(Ukraine War)లో ఎలైట్ స్నైపర్‌‌‌గా ఉక్రెయిన్ బలగాలకు సాయమందిస్తున్న

Ukraine War : రష్యా బలగాల క్షిపణి దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి

కీవ్ : ఉక్రెయిన్ యుద్ధం(Ukraine War)లో ఎలైట్ స్నైపర్‌‌‌గా ఉక్రెయిన్ బలగాలకు సాయమందిస్తున్న బ్రెజిల్(Brazil) మాజీ మోడల్(Model) 39 ఏళ్ల తలిత డు వాల్లె(Thalita do Valle) రష్యా బలగాల దాడిలో మృతిచెందింది. ఉక్రెయిన్ ఈశాన్య నగరం ఖర్కీవ్‌లో జూన్ 30న క్షిపణి దాడిలో ఆమె ప్రాణాలు వదిలారు. రష్యా బలగాల తొలి క్షిపణి దాడి తర్వాత బంకర్‌లో మిగిలిపోయిన షూటర్ ఆమె ఒక్కరేనని సమాచారం. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఉక్రెయిన్ మాజీ సైనికుడు డొగ్లస్ బురిగో(40) కూడా క్షిపణి దాడిలో మరణించాడని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.


కాగా తలిత లా(Law) చదివారు. మోడల్, నటిగా కొంతకాలం రాణించారు. ఎన్‌జీవోలతో కలిసి జంతువుల రెస్క్యూ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కాగా ఉక్రెయిన్ కంటే ముందు యుద్ధ కేత్రాల్లో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంత సాయుధ దళం ‘పెష్‌మెర్గాస్’(Peshmergas)లో ఆమె పనిచేశారు. ఆ సమయంలోనే స్నైపర్‌ షూటింగ్‌లో శిక్షణ పొందారు. యుద్ధంలో తన అనుభవాలను డాక్యుమెంటరీగా రూపొందించి యూట్యూబ్ చానల్లో కూడా ఆమె వీడియోలను పెట్టారు. 


తలిత మరణంపై ఆమె సోదరుడు థియో రొడ్రిగో విరా స్పందించాడు. ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన హీరోగా సోదరిని కొనియాడాడు. మానవీయ కోణమున్న ఎన్నో మిషన్లలో ఆమె పాల్గొన్నారని చెప్పాడు. రష్యన్ బలగాలు సమీపిస్తుండడంతో తరచూ ఫోన్లు చేయడం కుదరదని కుటుంబ సభ్యులు ఆమె తెలిపారు. మొబైల్ ఫోన్ యాక్టివిటీలను రష్యా డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని కుటుంబ సభ్యులకు ఆమె వివరించారు. ఖర్కీవ్ పట్టణం చేరుకున్నాక ఈ విషయాలను చెప్పారు. 

Updated Date - 2022-07-06T19:02:22+05:30 IST