ఎల్లమ్మ ఆలయానికి వాస్తుదోషం?

ABN , First Publish Date - 2021-03-01T05:42:01+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయాధికారులు, ఇంజనీర్ల అనాలోచిత చర్యలతో ఎల్లమ్మ ఆలయానికి వాస్తుదోషం నెలకొన్నదన్న ప్రచారం సాగుతున్నది.

ఎల్లమ్మ ఆలయానికి వాస్తుదోషం?
ఎల్లమ్మ ఆలయ మండపానికి ఉత్తరం వైపు చేపట్టిన మెట్లు

 గర్భాలయ నిర్మాణంలో అనాలోచిత చర్యలు

 ఏళ్లు గడుస్తున్నా నోచుకోని విగ్రహ పునఃప్రతిష్టాపన

 పూర్తికాని విస్తరణ పనులు

 ఇరుకు రాతి గుండ్ల మధ్య మొక్కుబడులతో ఇబ్బందులు


చేర్యాల, ఫిబ్రవరి 28: కొమురవెల్లి మల్లన్న ఆలయాధికారులు, ఇంజనీర్ల అనాలోచిత చర్యలతో ఎల్లమ్మ ఆలయానికి వాస్తుదోషం నెలకొన్నదన్న ప్రచారం సాగుతున్నది. అమ్మవారి రాతివిగ్రహ పునఃప్రతిష్టాపన కోసం సుమారు రెండున్నరేళ్లక్రితం ఎల్లమ్మ ఆలయ మండప విస్తరణ పనులు చేపట్టినా శాస్త్ర విరుద్ధంగా మెట్లు నిర్మాణం జరపడం వివాదాస్పదమవుతున్నది. అసంబద్ధ పనులు చేపట్టిన ఇంజనీరింగ్‌ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


మూడేళ్లక్రితం మండప విస్తరణ పనులు

మల్లన్న సోదరి అయిన ఎల్లమ్మను దర్శించుకుంటెనే మల్లన్నదర్శన ఫలితం కలుగుతుందని ప్రతీతి. కానీ రెండు భారీ రాతి గుండ్ల నడుమ ఉన్న అమ్మవారిని దర్శించుకోవడంలో భక్తులతో పాటు పూజలు నిర్వహించడంలో పూజారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం చిరుపరిమాణంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహ స్థానంలోని రాతిగుండ్లను తొలిచి ఆరు అడుగుల రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆలయవర్గాలు యోచించాయి. విషయం తెలిసిన ఓ భక్తుడు రాతివిగ్రహ తయారీకి స్వచ్ఛంధంగా అంగీకరించి సిద్ధం చేయించాడు. కానీ అమ్మవారి విగ్రహ ఎత్తుకు అనుసంధానంగా ఉండాల్సిన గర్భాలయ నిర్మాణానికి విరుద్ధంగా చేపట్టడం వలన మరో రాతి విగ్రహాన్ని తయారు చేయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. 


శాస్త్రవిరుద్ధంగా మెట్ల నిర్మాణం?

అమ్మవారి ఆలయం కింది భాగంలో పోచమ్మ దేవత ఉన్నది. ఎల్లమ్మను దర్శించుకున్న అనంతరం పోచమ్మను దర్శించుకుని యమ కోణం(నాలభయ్యారం)ద్వారా బయటకు వచ్చేవారు. కానీ కొన్ని సందర్భాల్లో యమకోణంలో భక్తులు ఇరుక్కుని ఇబ్బందుల పాలవడంతో తాత్కాలికంగా మూసివేశారు. ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో ఉన్న పోచమ్మ ఆలయ్నాన్ని ఆధీనంలోకి తీసుకుని లక్షలాది రూపాయలతో ఎల్లమ్మ ఆలయ మండప విస్తరణ పనులు చేపట్టారు. గతంలో అమ్మవారి దృష్టికి ఎదురుగా తూర్పు వైపునకు ఉన్న మెట్లకు బదులుగా ఉత్తరం వైపు మెట్లు నిర్మించడంతో ఎల్లమ్మ ఆలయం లోపలికి వెళ్లడానికి, పోచమ్మ ఆలయానికి వెళ్లకుండా మెట్లు అడ్డుగా ఉంటడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయాధికారులు మారడం, ద్వితీయశ్రేణి అధికారులు పట్టించుకోకపోవడం, ఇంజనీరింగ్‌ అధికారులు శాస్త్రప్రకారం చేపట్టాల్సిన పనులపై చిత్తశుద్ధి కనబరచకపోవడంతో ప్రస్తుతం మెట్లను కూల్చివేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. 


నిబంధనలకు విరుద్ధంగా ఏఈ నియామకం ? 

గతంలో ఏఈగా పనిచేసిన ప్రతా్‌పకు నెలసరి వేతనం చెల్లింపు విషయంలో వివాదం నెలకొనడంతో కొన్ని నెలల క్రితం అప్పటి ఈవో టంకశాల వెంకటేశ్‌ ఆయనను విధుల నుంచి తప్పించారు. అతనిస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా లోగుట్టుగా వేములవాడ రాజన్న ఆలయంలో రిటైర్డ్‌ అయిన ఏఈ శంకర్‌ను నియమించుకున్నారు. అంతేకాకుండా దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతులు పొందకుండానే ఆయన ద్వారా ఎంబీ రికార్డులు చేయడం, అడ్వాన్సులు చెల్లించడం, భక్తుడు నిర్మించిన గదిని వినియోగించుకుంటుండడం వివాదాస్పదవుతున్నది. ఈవిషయమై ఇటీవల ఆలయ పునరుద్ధరణ కమిటీసభ్యుడు వజ్రోజు శంకరాచారి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డం ఆలయాధికారుల పనితీరుపైనా అనుమానాలు వ్యక్తవుతున్నాయి. 

Updated Date - 2021-03-01T05:42:01+05:30 IST