‘నేరుగా నాతో తలపడు..’ పుతిన్‌కు టెస్లా అధినేత Elon Musk సవాల్..!

ABN , First Publish Date - 2022-03-15T02:16:06+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మస్క్ మరోసారి రంగంలోకి దిగారు. ‘‘నాతో నేరుగా తలపడతావా..’’ అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్విటర్ వేదికగా ఛాలెంజ్ చేశారు.

‘నేరుగా నాతో తలపడు..’ పుతిన్‌కు టెస్లా అధినేత Elon Musk సవాల్..!

వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే! ఆయన ట్వీట్లు నెట్టింట్లో ఎంతటి కలకలానికి దారితీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆస్తులు, పన్ను చెల్లింపులు, క్రిప్టోకరెన్సీ ఇలా అనేక టాపిక్స్‌పై ఆయన గతంలో చేసిన ట్వీట్లు పెను దుమారాన్నే రేపాయి. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మస్క్ మరోసారి రంగంలోకి దిగారు. ‘‘నాతో నేరుగా తలపడతావా..’’ అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్విటర్ వేదికగా ఛాలెంజ్ చేశారు. ‘‘సింగిల్‌గా నాతో తలపడాలని నేను పుతిన్‌కు సవాలు చేస్తున్నా. ఉక్రెయినే ఈ పోటీలో పందెం’’ అంటూ ట్వీట్ చేశారు. పుతిన్‌కు ట్విటర్‌లో ఖాతా లేకపోవడంతో క్రెమ్లిన్ అధికారిక  ట్విటర్ ఖాతాను కూడా ట్యాగ్ చేశారు. ఇప్పటికే..ఉక్రెయిన్‌కు సహాయంగా మస్క్.. తన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ సేవలను ఆ దేశంలో అందుబాటులోకి తెచ్చారు. దీంతో.. మస్క్ తీరు ప్రస్తుతం నెట్టింట్లో కలకలానికి దారితీస్తోంది.


ఇక నెట్టింట్లో ఈ ట్వీట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అసలు మస్క్ ఏ ఉద్దేశ్యంతో ఈ ఛాలెంజ్ విసిరారో అర్థం కాక నెత్తిబాదుకుంటున్న నెటిజన్లు ఎలాన్ మస్క్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఏంటీ.. నేరుగా తనతో తలపడమని  పుతిన్‌ను మస్క్ ఛాలెంజ్ చేశాడా.. దేవుడా.. నాకు నోటమాట రావట్లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలు ఎలాన్ మస్క్  పరిస్థితి సరిగ్గానే ఉందా అంటూ మరో నెటిజన్ సందేహం వ్యక్తం చేశాడు. ఇక రష్యా నిఘా సంస్థ కేజీబీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్.. జూడోలో బ్లాక్ బెల్ట్ పొందారు కూడా. అందుకే.. నెటిజన్లు మస్క్ విషయంలో ఈ రేంజ్‌లో స్పందిస్తున్నారు. అయితే.. మస్క్ రష్యాను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. అమెరికాకు రష్యా రాకెట్ ఇంజిన్ల సరఫరా నిలిపివేస్తే.. హారీపోటర్ సినిమాలో మాదిరి చీపురు కట్టలపై అమెరికా వ్యోమగాములు అంతరిక్ష యానం చేయాలంటూ ఇటీవల రష్యా కామెడీ చేసింది. వెంటనే సీన్‌లోకి ఎంటరైన మస్క్.. తన ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్‌కి సంబంధించిన వీడియో ట్వీట్ చేయడమే కాకుండా.. ‘‘అవి అమెరికా చీపురు కట్టలు’’ అంటూ ఓ సెటైర్ వదిలారు.

Updated Date - 2022-03-15T02:16:06+05:30 IST