Musk మళ్లీ తండ్రయ్యారన్న వార్త వైరల్.. నాకు చేతనైనంత చేస్తున్నానంటూ మస్క్ రిప్లై!

ABN , First Publish Date - 2022-07-08T03:09:12+05:30 IST

తన సంస్థ న్యూరాలింక్‌లోని(Neuralink) ఓ ఉన్నతోద్యోగిణి మిస్ షివోన్ జిలిస్‌తో(Shivon Zilis) కలిసి ఎలాన్ మస్క్(Elon musk) ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Musk మళ్లీ తండ్రయ్యారన్న వార్త వైరల్.. నాకు చేతనైనంత చేస్తున్నానంటూ మస్క్ రిప్లై!

ఎన్నారై డెస్క్: తన సంస్థ న్యూరాలింక్‌లోని(Neuralink) ఉద్యోగి మిస్ షివోన్ జిలిస్‌తో(Shivon Zilis) కలిసి ఎలాన్ మస్క్(Elon musk) ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆ పిల్లల పేరు మార్పు కోసం ఇటీవల కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ తాజాగా వెలుగులోకి రావడంతో మస్క్ మళ్లీ తండ్రయ్యారన్న వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న మస్క్ తాజాగా ట్విటర్‌లో స్పందించారు. జనాభా తగ్గుదలతో సంభవించబోయే సంక్షోభాన్ని నివారించేందుకు నాకు చేతనైనంత చేస్తున్నా అంటూ కామెంట్ చేశారు. నానాటికీ తగ్గుతున్న సంతానోత్పత్తి రేటే ప్రస్తుతం మానవ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని కూడా తెలిపారు. జిలిస్‌తో కలిసి కవలలకు జన్మనిచ్చినట్టు ప్రముఖ వార్త సంస్థ బిజినెస్ ఇన్‌సైడర్ ఇటీవల సంచలన వార్త ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. మస్క్ మొత్తం సంతానం సంఖ్య 9కి చేరినట్టైంది. మరోవైపు.. ట్విటర్‌ను కొనుగోలు చేశాక మస్క్ జిలిస్‌నే ఆ సంస్థకు సీఈఓగా నియమించొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. 


అభివృద్ధి చెందిన అనేక దేశాలు ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి తగినంత జనాభాలేక అవస్థలు పడుతున్నాయి. కార్మికుల కొరత తీర్చుకునేందుకు వలసలనూ ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవలే క్రైస్తవ మత పెద్ద పోప్.. పిల్లల్ని కనాలంటూ ఐరోపా ఖండంలోని యువ జంటలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అనేక జంటలు ప్రస్తుతం పిల్లల్ని కనే బదులు కుక్కలు, పిల్లుల్ని పెంచుకునేందుకు ఇష్టపడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ప్రస్తుతమున్న ఆర్థిక,సామాజిక వాతవరణంలో పిల్లల్ని పెంచడం భారమనే అభిప్రాయం అభివృద్ధి చెందిన దేశాల యువతలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే..  జనాభా తగ్గిపోతే మానవ సమాజమే సంక్షోభంలో పడుతుందని టెస్లా అధినేత మస్క్ తరచూ హెచ్చరిస్తూ ఉంటారు. 


ఎవరీ జిలిస్.. 

మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌లో జిలిస్ .. ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్స్ విభాగం డైరెక్టర్‌గా చేస్తున్నారు. 2017 మేలో సంస్థలో చేరిన ఆమె అదే నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక మస్క్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ అనే సంస్థ బోర్డులోనూ ఆమె సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 



Updated Date - 2022-07-08T03:09:12+05:30 IST