Elon Musk టార్గెట్ చేస్తున్న Vijaya Gadde మన తెలుగావిడే.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-29T01:47:05+05:30 IST

ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఆ వ్యవస్థను వెనకుండి నడిపించే ప్రతీ విభాగం, ప్రతీ వ్యక్తి నిబద్ధతతో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది. అలాంటిది ప్రజల అభిప్రాయాలకు వేదికగా నిలిచే ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాన్ని ఒడిదుడుకులు లేకుండా...

Elon Musk టార్గెట్ చేస్తున్న Vijaya Gadde మన తెలుగావిడే.. అసలేం జరిగిందంటే..

ఒక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఆ వ్యవస్థను వెనకుండి నడిపించే ప్రతీ విభాగం, ప్రతీ వ్యక్తి నిబద్ధతతో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది. అలాంటిది ప్రజల అభిప్రాయాలకు వేదికగా నిలిచే ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాన్ని ఒడిదుడుకులు లేకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా నడిపించడం సామాన్యమైన విషయం కాదు. ట్విట్టర్‌ను అలా నడిపించిన వారిలో ప్రవాసాంధ్ర మహిళ Vijaya Gadde పాత్ర ఎంతో కీలకమైనదనడంలో సందేహమే లేదు. ట్విట్టర్ లీగల్ హెడ్‌గా పనిచేసిన ఈ తెలుగు మహిళ తన బాధ్యత నిర్వర్తిస్తున్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు అగ్ర రాజ్యం అమెరికాలోని ప్రముఖుల్లో కొందరికి మింగుడు పడలేదు. అభిప్రాయ వ్యక్తీకరణలో అభ్యంతరకర పదాలు ట్విట్టర్‌లో వాడితే ఎంత వారినయినా ఆమె ఉపేక్షించలేదు. అలాంటి ట్విట్టర్ ఖాతాలను తొలగించిన విషయంలో విజయ గద్దెదే కీలక పాత్ర.



వ్యక్తుల భావ వ్యక్తీకరణకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువనిస్తూనే యూజర్ల వ్యక్తిగత భద్రతకు విజయ గద్దె పెద్ద పీట వేశారు. సామాజిక మాధ్యమమైన ఈ ట్విట్టర్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలన్ మస్క్ చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం విజయ గద్దెను ఆందోళనకు గురిచేసింది. ఆ ఆందోళనకు కారణం లేకపోలేదు. అభ్యంతరకర ట్వీట్స్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ వంటి వారిని కూడా ఉపేక్షించని విజయ గద్దె ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోగానే విజయ గద్దెనే టార్గెట్ చేసుకుంటూ, ఆమె నిర్ణయాలను తప్పుబడుతూ ట్వీట్స్ పెట్టడం ట్విట్టర్ భవిష్యత్‌లో ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోందనే వాదన సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.



ఒక ప్రముఖ వార్తా సంస్థ ట్విట్టర్ అకౌంట్‌ను ఒక వాస్తవ కథనాన్ని బహిర్గతం చేసినందుకు తొలగించారని, ఈ నిర్ణయం అస్సలు ఏమాత్రం సరికాదని మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారో లేదో వెంటనే గత నిర్ణయాలను తప్పుబడుతూ మస్క్ ట్వీట్ పెట్టడం పెను దుమారం రేపుతోంది. విజయ గద్దె తీసుకున్న సాహసోపేత చర్యల కారణంగా ట్విట్టర్‌లో గత కొంత కాలంగా అభ్యంతరకర పదాల వాడకానికి అడ్డుకట్ట పడింది. కానీ.. ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లడంతో మళ్లీ అలాంటి పదాలకు తావిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే భావనలో విజయ గద్దె ఉన్నారు. భావ వ్యక్తీకరణకు వేదికైన ట్విట్టర్‌లో నెటిజన్ల స్వేచ్ఛకు, వారి అభిప్రాయాల వ్యక్తీకరణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళనను ఆమె వ్యక్తం చేసినట్లు తెలిసింది. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసుకున్న విషయం తెలిశాక ఉద్యోగులతో జరిగిన సమావేశంలో విజయ గద్దె భావోద్వేగానికి కూడా లోనయినట్లు తెలిసింది. ట్విట్టర్ భవిష్యత్‌పై ఈ తెలుగు మహిళ ఆందోళన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు Politicoలో ఓ వార్త ప్రచురితమైంది. మస్క్ నాయకత్వంలో ఉద్యోగుల భవిష్యత్ పట్ల కూడా ఆమె ‘తీవ్ర అనిశ్చితి’ వ్యక్తం చేసినట్లు ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు.



ట్విట్టర్ డీల్ గురించి చర్చలు నడుస్తున్న సమయంలో విజయ గద్దె వర్చువల్‌ మీటింగ్ నిర్వహించినట్లు తెలిసింది. ఆ సమావేశంలో విజయ గద్దె భావోద్వేగానికి లోనయినట్లు Politico పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన విజయ గద్దె అంచెలంచెలుగా ఎదిగారు. ఒక తెలుగు మహిళ అయిన ఆమె Twitter Public Policy& Trust and Safety విభాగానికి లీడ్‌గా వ్యవహరించారు. 2011లో ఆమె లీగల్ విభాగానికి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎలన్ మస్క్ కేవలం విజయ గద్దెను మాత్రమే టార్గెట్ చేయలేదు. కంపెనీ లాయర్ అయిన జిమ్ బేకర్‌ను కూడా మస్క్ తప్పుబట్టారు. ఎలన్ మస్క్ ఆ వార్తా సంస్థ విషయంలో విజయ గద్దెను విమర్శించడాన్ని కొందరు నెటిజన్లు కూడా సమర్థిస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ట్విట్టర్ వేదికగా విజయ గద్దెను దూషిస్తూ పోస్ట్‌లు పెడుతున్న తీరు భవిష్యత్‌లో ట్విట్టర్ ఎలాంటి ట్వీట్స్‌కు వేదిక కాబోతోందనే విషయాన్ని చెప్పకనే చెబుతోందని ఈ పరిణామాలను నిశితంగా గమనించిన వారు అభిప్రాయపడుతున్నారు. ఎలన్ మస్క్ అంతటితో ఆగలేదు. విజయ గద్దెను తన పోస్ట్ ద్వారా ‘Curry’ అని పోల్చడంలోనే ఎలన్ మస్క్ జాత్యంహకార ధోరణి బయటపడిందని ట్విట్టర్‌లో కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.



విజయ గద్దెను ట్విట్టర్ నుంచి పంపేలా చేసేందుకే Elon Musk ఈ తరహా ట్వీట్స్, పోస్ట్ పెడుతున్నారనే అభిప్రాయాన్ని కూడా మెజార్టీ నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక తెలుగు మహిళను, భారతీయురాలిని ఆ స్థానంలో చూసి ఓర్వలేక Elon Musk పొమ్మన లేక పొగపెడుతున్నారనే వాదన చాలా మంది నెటిజన్లది. భారతీయ సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌పై కూడా పరోక్షంగా జాత్యంహకార పోస్ట్ పెట్టి ఎలన్ మస్క్ అవమానించిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.



ట్విట్టర్ గురించి విజయ గద్దె వ్యక్తం చేసిన ఆందోళన నిజమయ్యేలా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్న తర్వాత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం ఆయన చేస్తున్న ట్వీట్స్‌కు ఏమాత్రం పొంతనే లేదని, సంస్థలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్న విజయ గద్దె వంటి వారిపై ఈ తరహా ట్వీట్స్ పెడుతుండటం ఆయన జాత్యంహకార ధోరణికి అద్దం పడుతుందని చాలామంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ట్విట్టర్‌ను కొన్ని నిబంధనలతో భావ వ్యక్తీకరణను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు వేదికగా మారుస్తానని ఎలన్ మస్క్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఏదేమైనా.. గతంలో కూడా ఎన్నో ఒత్తిళ్లను తెగువతో ఎదుర్కొన్న విజయ గద్దె ఈ పరిణామాలను ఎలా చూడబోతున్నారనే విషయమే ఆసక్తికరంగా మారింది. ఒక తెలుగు మహిళకు, ప్రపంచ కుబేరుడికి మధ్య ఈ తరహా వాతావరణం ట్విట్టర్ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశాలు చాలానే ఉన్నాయి.

Updated Date - 2022-04-29T01:47:05+05:30 IST