నకిలీ ఖాతాల నిగ్గు తేలాకే ట్విటర్‌ కొంటా

ABN , First Publish Date - 2022-05-18T07:08:07+05:30 IST

ట్విటర్‌ కొనుగోలుపై టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ మరింత స్పష్టత ఇచ్చారు.

నకిలీ ఖాతాల నిగ్గు తేలాకే ట్విటర్‌ కొంటా

లండన్‌: ట్విటర్‌ కొనుగోలుపై టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ మరింత స్పష్టత ఇచ్చారు. ట్విటర్‌లో నకిలీ ఖాతాదారుల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువ ఉంటేనే, ఈ విషయంలో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. దీన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ట్విటర్‌  యాజమాన్యానిదేనన్నారు. తమ ఖాతాదారుల్లో నకిలీ ఖాతాదారులు ఐదు శాతం మించరని ట్విటర్‌  గతంలో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీకి తెలిపింది. ఈ నివేదిక ఆధారంగానే తాను ట్విటర్‌ను 4400 కోట్ల డాలర్లకు కొనేందుకు ముందుకు వచ్చినట్టు మస్క్‌ ట్వీట్‌ చేశారు. ట్విటర్‌ ఖాతాదారుల్లో కనీసం 20 శాతం నకిలీ ఖాతాదారులని వార్తలు వస్తున్న నేపథ్యంలో మస్క్‌ ఈ ట్వీట్‌ చేయడం విశేషం. 


అసలు వ్యూహం: మస్క్‌ వేరే వ్యూహంతో ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్‌ తమకు గుదిబండ అవుతుందని టెస్లా వాటాదారుల అభిప్రాయం. గత నెల 14న ఈ డీల్‌ ప్రకటించిన దగ్గరి నుంచి టెస్లా షేర్లు మూడో వంతు నష్టపోయాయి. నకిలీ ఖాతాల పేరుతో ఈ సుడిగుండం నుంచి ఎలాగోలా బయటపడాలన్నది మస్క్‌ అసలు వ్యూహమని మార్కెట్‌ వర్గాల అంచనా. ట్విటర్‌ షేర్ల మార్కెట్‌ ధర కూడా మస్క్‌ ఆఫర్‌ చేసిన 54.20 డాలర్ల నుంచి, ప్రస్తుతం 37.39 డాలర్లకు పడిపోయింది. విషయాన్ని సాగదీయడం ద్వారా, మస్క్‌ ట్విటర్‌ను మరింత చౌకగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలూ జోరుగా వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-05-18T07:08:07+05:30 IST