Elon Musk: ఎలాన్ మస్క్‌పై విమర్శలు.. చెప్పే వన్నీ నీతులు.. చేసేవేమో..

ABN , First Publish Date - 2022-08-24T00:23:52+05:30 IST

కేవలం 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటుకి వెళ్లేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన ప్రైవేట్ జెట్ వాడారన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Elon Musk: ఎలాన్ మస్క్‌పై విమర్శలు.. చెప్పే వన్నీ నీతులు.. చేసేవేమో..

ఎన్నారై డెస్క్: కేవలం 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటుకి వెళ్లేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తన ప్రైవేట్ జెట్ వాడారన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వార్తలో నిజానిజాలు ఎంత అన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ మస్క్‌ను మాత్రం నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత తక్కువ దూరానికి, భారీగా ఇంధననాన్ని తగలేసి పర్యావరణాన్ని కలుషితం చేయాలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాలుష్యాన్ని వెదజల్లే సంప్రదాయిక రవాణా సాధనాలను వీడి, విద్యుత్ వాహనాల వైపు మళ్లాలంటూ అప్పట్లో చెప్పిన సుద్దులు ఇప్పుడు ఏమైపోయాయని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బునోళ్ల అతి చేష్టలు ఇలాగే ఉంటాయంటూ మరికొందరు మండిపడుతున్నారు. 


వాస్తవానికి ఆ విమానంలో(Private Jet) ఎలాన్ మస్క్ ఉన్నారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఆయన ప్రైవేట్ జెట్ కదలికలను వెయ్యికళ్లతో పరిశీలించేవారు ఈ ప్రయాణం గురించి తొలిసారిగా చెప్పారు. శాన్‌హోసే(San Jose) నుంచి కేవలం 56 కిలోమీటర్ల దూరంలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో(San Fransico) విమానాశ్రయానికి మస్క్ విమానం వెళ్లినట్టు గుర్తించారు. గతవారం ఇది జరిగినట్టు చెబుతున్నారు.  కేవలం 9 నిమిషాల్లో విమానం గమ్యస్థానానికి చేరుకుందని తెలిపారు. రైల్లో ప్రయాణించి ఉంటే పర్యావరణానికి హానీ జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ‘‘కేవలం 35 మైళ్ల దూరం ప్రయాణించేందకు మస్క్ విమానప్రయాణం చేశారా..? నాకు నోట మాటరావట్లేదు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


అయితే.. దీని వెనుక ఇతర కారణాలు ఉండే ఉండొచ్చని న్యూయార్క్ టైమ్స ఎడిటర్ ఆండ్రూ రాస్ సార్కిన్ అభిప్రాయపడ్డారు. శాన్‌ఫ్రాన్‌సిస్కో ఎయిర్‌పోర్టులో ఉన్న ప్యాసెంజర్ల కోసం మస్క్ ప్రైవేట్ జెట్ వెళ్లి ఉండొచ్చని చెప్పారు. సాధారణంగా రద్దీ తక్కువ ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు నిలిపుతారని, ఆ తరువాత ప్రయాణికులు ఉన్న ఎయిర్‌పోర్టుకు తరలిస్తారని వివరించారు. అయితే.. నెటిజన్లు మాత్రం ఈ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేదు. ప్యాసెంజర్లు ఉన్నా లేకపోయినా కూడా కేవలం 35 మైళ్ల దూరంలోని ప్రాంతానికి వెళ్లేందుకు విమానం వాడటం బాధ్యతారాహిత్యమని మండిపడుతున్నారు.


ఎలాన్ మస్క్ ప్రైవేట్ జెట్ కదలికలపై ఓ కన్నేసేందుకు జాక్ స్వీనీ(Jack Sweeney) అనే టీనేజర్ గతేడాది ఓ ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. విమానాల కదలికలకు సంబంధించిన బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆ అకౌంట్‌లోని బాట్(సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్) క్రోడీకరించి ఏదైనా విమానం ఎక్కడుందో చెప్పేయగలదు. దీని వల్ల భద్రతాపరమైన సమస్యలు వస్తాయని మస్క్ అప్పట్లోనే వారించినా జాక్ వినలేదు. ఆ తరువాత మస్క్ అతడి విషయాన్ని పట్టించుకోవడం మానేశారు.

Updated Date - 2022-08-24T00:23:52+05:30 IST