Elon musk: ‘‘నా కొడుకును చూసి గర్వపడను..’’ ఎలాన్ మస్క్ తండ్రి వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-08-02T03:03:17+05:30 IST

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌‌ను చూసి తాను గర్వపడనని ఆయన తండ్రి ఎరోల్ మస్క్ తాజాగా వ్యాఖ్యానించారు.

Elon musk: ‘‘నా కొడుకును చూసి గర్వపడను..’’ ఎలాన్ మస్క్ తండ్రి వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్‌‌ను(Elon musk) చూసి తాను గర్వపడనని ఆయన తండ్రి ఎరోల్ మస్క్(Errol Musk) తాజాగా వ్యాఖ్యానించారు. మీ కుమారుడు ఎన్నో విజయాలు సాధించాడు కదా అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తమ కుటుంబం గత ఎన్నో ఏళ్లుగా ఎంతో సాధించిందని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో ఓ రేడియో షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎరోల్ మస్క్ మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబం ఎప్పటి నుంచో చాలా చాలా చేస్తు వస్తోంది. ఇదంతా మస్క్‌తో ఉన్నపళంగా మొదలైనది కాదు’’ అని ఆయన అన్నారు. ఎర్రోల్‌కు తన మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు కలిగారు. వారిలో ఎలాన్ మస్క్ కూడా ఒకరు.   


నలుగురు మహిళలతో మస్క్ తొమ్మిది మంది సంతానాన్ని కన్నా కూడా ప్రస్తుతం ఆయన ఒంటరిగానే ఉన్నారు. దీనిపై కూడా ఎర్రోల్ మస్క్ స్పందించారు. ‘ తన కోసం కేరిర్‌ను వదిలిపెట్టే మహిళ కోసం మస్క్ ప్రయత్నించాలి. కానీ అది అంత ఈజీ కాదు కదా..’’ అని కూడా ఎరోల్ మస్క్ వ్యాఖ్యానించారు. అయితే.. తన మరో కుమారుడు కింబల్ మాత్రం ఈ విషయంలో అదృష్టవంతుడని తెలిపారు. కింబల్, అతడి భార్య మధ్య గాఢమైన బంధం ఉందని చెప్పారు. 

Updated Date - 2022-08-02T03:03:17+05:30 IST